Pesarapappu Thotakura Recipe : నోరూరించే తోటకూర పెసరపప్పు కర్రీ.. సింపుల్‌గా, టేస్టీగా చేసుకోగలిగే రెసిపీ
Pesarapappu Thotakura : తోటకూరను టేస్టీగా తినాలనుకుంటే మీరు పెసరపప్పు తోటకూరన కర్రీని చేసుకోవచ్చు. మరి దీనిని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం.

Pesarapappu Thotakura Curry : ఈజీగా, హెల్తీగా, టేస్టీగా ఏదైనా చేసుకోవాలనుకున్నప్పుడు తోటకూర పెసరపప్పు బెస్ట్ ఆప్షన్. ఇది పప్పు కాదు. ఇది కచ్చితంగా కూరనే. అదేంటి పప్పు కాకుండా కూర ఎలా చేయాలి? అది కూడా తక్కువ సమయంలో అనుకుంటున్నారా? అయితే ఇది మీకోసమే. చాలా సింపుల్‌గా లంచ్ బాక్స్‌కి తయారు చేసుకోగలిగే ఈ రెసిపీ ఏంటో? దానిని టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం.
కావాల్సిన పదార్థాలు
తోటకూర - 4 కట్టలు
పెసరపప్పు - 1 కప్పు
శనగప్పు - 1 టీస్పూన్
మినపప్పు - 1 టీస్పూన్
ఆవాలు - అర టీస్పూన్
జీలకర్ర - అర టీస్పూన్
వెల్లుల్లి రెబ్బలు - 5
కరివేపాకు - 10
ఉల్లిపాయ - 1 పెద్దది
ఉప్పు - రుచికి తగినంత
నూనె - తగినంత
తయారీ విధానం
ముందుగా కప్పు పెసరపప్పును నానబెట్టుకోవాలి. తర్వాత తోటకూరను బాగా శుభ్రం చేసుకోవాలి. బాగా ముదిరిపోయినది ఉంటే ఆకులు మాత్రమే తీసుకోవాలి. లేతగా ఉంటే కాడలతో సహా తోటకూరను కర్రీకోసం వాడుకోవచ్చు. వర్షాకాలంలో ఆకు కూరలకు కాస్త ఇసుక ఎక్కువగా ఉంటుంది కాబట్టి బాగా కడగాలి. అలాగే కాస్త చిన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత కూడా తోటకూరను శుభ్రంగా కడిగి వడకట్టాలి.
పెసరపప్పు ఓ పావుగంట నానబెట్టుకుంటే సరిపోతుంది. కర్రీగా చేసుకుంటాము కాబట్టి ఎక్కువసేపు నానబెట్టుకోకపోవడమే బెటర్. ఇప్పుడు కడాయి తీసుకుని స్టౌవ్‌పై పెట్టి వెలిగించాలి. దానిలో శనగపప్పు, మినపప్పు వేయించుకోవాలి. తర్వాత ఆవాలు, జీలకర్ర వేయాలి. అవి చిటపటలాడిన తర్వాత వెల్లుల్లి , కరివేపాకు, ఎండుమిర్చి వేసి పోపుగా వేసుకోవాలి. ఇప్పుడు దానిలో ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసి అవి కాస్త రంగు మారేవరకు వేయించుకోవాలి.
ఉల్లిపాయలు రంగు మారిన తర్వాత ఉప్పు, పసుపు వేసుకోవాలి. ఇప్పుడు నానబెట్టుకున్న పెసరప్పును వడకట్టి.. పోపు రెడీ అయిన తర్వాత వేసుకోవాలి. బాగా కలిపి కాసేపు వేగనివ్వాలి. అనంతరం సన్నగా తరిగిన తోటకూర వేసి మూతపెట్టేయాలి. మంటను తగ్గించి.. మగ్గనివ్వాలి. మధ్యలో కలుపుతూ ఉండాలి. తోటకూర ఉడికింది అంటే.. ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకుని దించేసుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ పెసరపప్పు తోటకూర కర్రీ రెడీ.
ఈ కర్రీ రుచిని మరింత పెంచుకోవాలనుకుంటే పల్లీల పొడి లేదా, పుట్నాల పొడి కూడా వేసుకోవచ్చు. దీనిని మీరు చపాతీలు, అన్నానికి కూడా కాంబినేషన్‌గా తీసుకోవచ్చు. ఇది మంచి రుచిని ఇస్తుంది కాబట్టి పెద్దల నుంచి పిల్లల వరకు అందరూ ఇష్టపడతారు. మూంగ్‌దాల్ స్నాక్స్‌ని ఇష్టపడేవారికి ఇది బెస్ట్ రెసిపీ అవుతుంది. అలాగే తోటకూర, పెసరపప్పు కూడా ఆరోగ్యానికి ఎన్నో మంచి ప్రయోజనాలు ఇస్తుంది కాబట్టి.. అందరూ హ్యాపీగా లాగించేయవచ్చు.





















