Cashew Halwa : టేస్టీ జీడిపప్పు హల్వా.. ఇంట్లోనే సింపుల్గా చేసుకోవడానికి ఈ రెసిపీలు ఫాలో అయిపోండి
Cashew Recipes : హల్వాలో జీడిపప్పు ఉంటుంది. అదే జీడిపప్పుతోనే హల్వా చేస్తే.. ఆ రుచే వేరు. అయితే దీనిని ఇంట్లోనే రెండు రకాలుగా ఎలా చేయవచ్చో చూసేద్దాం.

Cashew Halwa Recipe : జీడిపప్పు బర్ఫీ, జీడిపప్పుతో చేసిన ఇతర స్వీట్స్ చాలామంది ఇష్టంగా తింటారు. అయితే మీకు జీడిపప్పుతో చేసే హల్వా గురించి తెలుసా? నోటికి మంచి రుచిని ఇస్తూ.. సింపుల్గా చేసుకోగలిగే రెసిపీ ఇది. అయితే దీనిని రెండు రకాలు చేసుకోవచ్చు. పైగా ఆ రెండూ చాలా సింపుల్. మరి ఈ జీడిపప్పు హల్వాను ఎలా తయారు చేసుకోవాలి? కావాల్సిన పదార్థాలు ఏంటి? ఎలాంటి టిప్స్ ఫాలో అయితే హల్వా మరింత రుచిగా వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
జీడిపప్పు - 1 కప్పు
పాలు - 1 కప్పు
పంచదార - అర కప్పు
కొబ్బరి పొడి - అర కప్పు
కుంకుమ పువ్వు - చిటికెడు
నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు
తయారీ విధానం
ముందుగా జీడిపప్పును కడిగి.. వాటిని పాలల్లో వేసి నానబెట్టుకోవాలి. అలాగే కుంకుమ పువ్వును కూడా ఓ గిన్నెలో నానబెట్టుకోవాలి. అయితే దీనిని పాలతో లేదా నీళ్లతో నానబెట్టవచ్చు. ఇప్పుడు ముందుగా పాలల్లో గంట ముందు నానబెట్టిన జీడిపప్పును మిక్సీ జార్లో వేయాలి. జీడిపప్పును మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దీనిని ఓ గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టౌవ్ వెలిగించి దానిపై మందపాటి పాన్ పెట్టుకోవాలి.
పాన్లో నెయ్యి వేసి వేడి అయిన తర్వాత ముందుగా జీడిపప్పు మిశ్రమాన్ని వేయాలి. దానిని కాస్త ఉడకనివ్వాలి. అడుగున అంటకుండా కలుపుతూ ఉండాలి. జీడిపప్పు పేస్ట్ కాస్త దగ్గర అవుతున్న సమయంలో కొబ్బరి పొడి వేయాలి. ఈ రెండింటీని బాగా కలపాలి. కాస్త ఆదమరిచినా అడుగు పట్టేస్తాది కాబట్టి కలుపుతూనే ఉండాలి. ఇలా రెండూ బాగా మిక్స్ అయి.. బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించుకోవాలి.
ఇలా వేగిన మిశ్రమంలో కాస్త పంచదార వేయాలి. మంటను తగ్గించి పంచదార కరిగేవరకు మిశ్రమాన్ని కలుపుతూ ఉండాలి. దానిలో కుంకుమ పువ్వు మిశ్రమాన్ని, ఏలకుల పొడిని వేసి బాగా కలపాలి. మిశ్రమం దగ్గరకు అయిన తర్వాత స్టౌవ్ ఆపేయాలి. కాస్త చల్లారిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే టేస్టీ జీడిపప్పు హల్వా రెడీ.
జీడిపప్పు హల్వా రెసిపీ 2
జీడిపప్పు హల్వాను మరో పద్ధతిలో కూడా చేసుకోవచ్చు. అయితే జీడిపప్పును నానబెట్టకుండా పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు పాన్లో నెయ్యి వేసి జీడిపప్పు, కొబ్బరి పొడి బ్రౌన్కలర్లో వచ్చేవరకు వేయించుకోవాలి. అవి మంచి అరోమాతో వేగిన తర్వాత పాలను లేదా నీళ్లు వేసి దగ్గరగా ఉడికించి పంచదార వేసుకోవాలి. అన్ని కలిసే వరకు, పంచదార కరిగేవరకు కలుపుతూ ఉండాలి. చివరిగా దానిని నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసి సర్వ్ చేసుకోవచ్చు.






















