Winter Diet Tips : చలికాలంలో బరువును తగ్గించే డైట్ టిప్స్.. Weight Loss కోసం తప్పక ఫాలో అవ్వండి
Winter Weight Loss : చలికాలంలో చాలామంది బరువు పెరుగుతారు. దానివెనుక కొన్ని కారణాలు ఉంటాయంటున్నారు నిపుణులు. ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటే బరువు అదుపులో ఉంటుందంటున్నారు.

Winter Diet & Lifestyle Changes for Weight Loss : చలికాలంలో శరీరంలో చాలా మార్పులు జరుగుతాయి. దానిలో బరువు పెరగడం ఒకటి. వింటర్లో చాలామంది బరువు పెరుగుతారు. దీనివెనుక చాలా కారణాలు ఉన్నాయి. ఉష్ణోగ్రతలు తగ్గినప్పుడు క్రేవింగ్స్ పెరగడం, ఎనర్జీ తక్కువగా ఉండడం, వ్యాయామం చేసే ఇంట్రెస్ట్ రాకపోవడం వంటివి కారణమవుతాయి. కానీ ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే.. బరువును పూర్తిగా అదుపులో ఉంచుకోవచ్చని చెప్తున్నారు ఢిల్లీలోని మ్యుటేషన్ డైట్ క్లినిక్ వ్యవస్థాపకురాలు దీపికా దువా అరోరా. బరువు పెరగకుండా తగ్గగలిగే టిప్స్ కొన్ని సూచిస్తున్నారు. అవేంటో చూసేద్దాం.
ఆకలి-బరువు
అరోరా ప్రకారం.. శరీరం సహజంగానే శీతాకాలానికి సర్దుబాటు అవుతుంది కానీ మనమే దానిని తెలుసుకోము అంటూ.. "శీతాకాలంలో జీవక్రియ ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో తక్కువ తిన్నప్పుడు జీవక్రియకు ఆటంకం కలుగుతుంది. దీనివల్ల క్రేవింగ్స్ పెరుగుతాయి. విటమిన్ డి లోపం వల్ల కూడా ఫుడ్ క్రేవింగ్స్ పెరిగి ఎక్కువగా తింటారు. దీనివల్ల శారీరక శ్రమ తగ్గుతుంది. ఆకలి పెరుగుతుంది. హార్మోన్ల మార్పులు జరుగుతాయి. " ఇవి కేవలం చలి వల్ల మాత్రమే కాదు.. సూర్యరశ్మి తగ్గడం, సెరోటోనిన్ తగ్గడం వల్ల స్వీట్ క్రేవింగ్స్ పెరిగి, పోషకాల లోపం ఏర్పడి ఎక్కువ తినేస్తారని తెలిపారు.
"మీరు బరువు తగ్గాలనుకున్నప్పుడు.. మీరు తక్కువ తినడానికి ప్రయత్నిస్తారు. ఇది సరైనది కాదు. కాబట్టి మీరు శరీరానికి కావాల్సిన కార్బోహైడ్రేట్లను సరైన పరిమాణంలో అందించాల్సి ఉంటుంది." ఫుడ్ తక్కువగా తీసుకుంటే, శరీరానికి కావాల్సిన పోషకాలు అందించకపోతే.. అది అతిగా తినడానికి కారణమవుతుంది. తక్కువ తింటే.. మూడ్ స్వింగ్స్ వస్తాయి. అలాగే భోజన సమయాన్ని విస్మరించకూడదు. ఇలా కొన్ని మార్పు చేస్తే బరువు అదుపులో ఉంటుందని తెలిపారు. మరి ఆ మార్పులు ఏంటో చూసేద్దాం.
చలికాలంలో బరువు పెరగకూడదంటే..
చలికాలంలో ఫుడ్ విషయంలో పోషకమైన మార్పులు చేయడం అవసరం. కేలరీలను తగ్గించడం కంటే కొన్ని మార్పులు చేస్తే మంచి ఫలితాలు ఉన్నాయని చెప్తున్నారు. దానిలో భాగంగా శీతాకాలంలో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయవద్దని చెప్తున్నారు. రోజుకు 6 సార్లు తినాలి. కానీ తక్కువ కేలరీల ఆహారంతో సరైన ఆహారం తీసుకోవాలి. అంటే సింపుల్‌గా అతిగా తినకుండా శరీరానికి కావాల్సిన పోషకాలు అందించాలి. అలాగే రోజుకు కనీసం 40 నిమిషాలు నడవాలి. ఇది రక్త ప్రసరణ పెంచుతుంది. బరువును అదుపులో ఉంచుతుంది.
బ్రేక్‌ఫాస్ట్ - లంచ్
ఉప్పుతో కూడిన అల్పాహారం తీసుకోండి. దీనివల్ల మీరు నిండుగా భావిస్తారు. కార్బ్స్, ప్రోటీన్, ఫైబర్ ఉండేలా ప్రతీ మీల్ ఉండాలి. మధ్యాహ్న భోజనం, సాయంత్రం స్నాక్స్, డిన్నర్ ఇలా దేనిని స్కిప్ చేయకూడదు. అలాగే టైమ్ టూ టైమ్ తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే నైట్ డెజర్ట్‌లు తీసుకుంటే మంచిదని చెప్తున్నారు అరోరా.
ప్రోటీన్ ముఖ్యం
ప్రోటీన్ కూడా శీతాకాలంలో బరువు తగ్గడంలో పెద్ద పాత్ర పోషిస్తుంది. పాలు, పెరుగు, చేపలు, గుడ్లు, పనీర్, టోఫు వంటి అధిక ప్రోటీన్ ఆహారాలలో కనిపించే అదృశ్య కొవ్వులను తీసుకోవడం వల్ల శరీరం పొడిబారకుండా రక్షణ కల్పిస్తుంది. మోకాళ్లకు శక్తి అందుతుంది. ఒమేగా కొవ్వు ఆమ్లాలతో పాటు.. జీర్ణక్రియ, శోషణ కోసం ఫైబర్ కూడా ముఖ్యమని చెప్తున్నారు. అందుకే బ్యాలెన్స్‌గా ఫుడ్ తీసుకోవడం ముఖ్యమంటున్నారు.
నైట్ డెజర్ట్స్..
రాత్రుళ్లు డెజర్ట్‌లు తీసుకుంటే.. మీకు సంతృప్తి కలుగుతుంది. ఇది మీరు హాయిగా విశ్రాంతి తీసుకోవడానికి సహాయపడుతుంది. రాత్రిపూట డెజర్ట్‌లు జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తాయని అరోరా చెప్తున్నారు. దీనివల్ల మంచి నాణ్యమైన నిద్ర వస్తుంది. ఉదయాన్నే తాజాగా మేల్కొంటారు. మలబద్ధకం దూరమవుతుంది. విశ్రాంతి పెరుగుతుంది. ఒత్తిడిని తగ్గించి.. బరువును అదుపులో ఉంచుతుంది. మఖానా, ఖర్జూరాలు వంటివి తీసుకోవచ్చు.
రోజువారీ అలవాట్లలో మార్పులు
రోజంతా వేడి నీరు తాగడం కొవ్వును కరిగిస్తుందని చాలా మంది నమ్ముతారు. అయితే వేడి నీరు రోజంతా తీసుకోవడం మంచిది కాదని చెప్తున్నారు అరోరా. ఎందుకంటే ఇది కృత్రిమ జీర్ణక్రియను సృష్టిస్తుంది. దీనివల్ల మరింత ఆకలి అవుతుంది. సూక్ష్మపోషకాల నష్టం కూడా జరగవచ్చు. కాబట్టి 1–2 గ్లాసుల వేడి నీరు తీసుకోవడం మంచిది. రాత్రిపూట ఆల్కహాల్ తాగడం, భారీగా భోజనం తీసుకోవడం చేయకూడదు. రాత్రి నిద్రపోయే ముందు వేడి నీరు తీసుకోవాలి. ఇది కాలేయాన్ని డీటాక్స్ చేయడంలో హెల్ప్ చేస్తుంది.
సాయంత్రం స్నాక్స్ చాలా ముఖ్యం. ఇది రాత్రుళ్లు అతిగా తినకుండా కాపాడుతుంది. మఖానా, నట్స్ & సీడ్స్ లేదా లో కేలరీలు ఉండే ముర్మురా, పాప్‌కార్న్ వంటివి తీసుకోవచ్చు. సలాడ్ కూడా మంచి ఆప్షన్ అవుతుంది. నీటితో పాటు నిమ్మరసం, మజ్జిగ, టీ లేదా కాఫీ లేదా గ్రీన్ టీ స్నాక్స్ టైమ్‌లో తీసుకుంటే కడుపు నిండుగా ఉంటుంది. హైడ్రేషన్ ముఖ్యమని గుర్తించాలి. ఇవన్నీ బరువును కంట్రోల్ చేస్తాయి. తేలికపాటి వ్యాయామం, యోగా వంటివి చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని చెప్తున్నారు అరోరా. మీరు కూడా బరువు తగ్గాలంటే మీ ఫుడ్, లైఫ్స్టైల్లో ఈ మార్పులు చేసేయండి.
గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.






















