Varalakshmi Vratam Fasting Mistakes : వరలక్ష్మీ వ్రతం చేస్తూ ఉపవాసం ఉంటున్నారా? ఆ తప్పు చేస్తే వ్రత ఫలితం ఉండదట, జాగ్రత్త
Varalakshmi Vratam Upavasam : వరలక్ష్మీ వ్రతం చేసుకుంటున్నారా? అయితే మీరు ఉపవాసముంటే ఆ తప్పు అస్సలు చేయవద్దని.. అలా చేస్తే దరిద్రమని చెప్తున్నారు. ఇంతకీ ఆ తప్పు ఏంటి?

Sravana Masam Varalakshmi Vratham Rituals : శ్రావణమాసంలో పూజలు, నోములు చేసుకునేవారు కచ్చితంగా ఉపవాసం ఉంటారు. ముఖ్యంగా శ్రావణ శుక్రవారం రోజు చాలామంది మహిళలు వరలక్ష్మీ వ్రతం చేసుకుంటూ ఉపవాసం ఉంటారు. అమ్మవారికి పూజ చేసుకుని.. వాయినాలు ఇస్తూ.. రోజంతా ఉపవాసం ఉంటూ నిష్టగా ఉంటారు. అయితే పూజ సమయంలో ఉపవాసం పేరుతో చాలామంది శరీరం ఇబ్బంది పడుతున్నా ఏమి తినకుండా అదే చాలా తప్పు అని.. అలా ఉపవాసం ఎప్పుడూ చేయవద్దని సూచిస్తున్నారు శ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు.
అలా చేయడం దరిద్రం..
"చాలామంది దృష్టిలో అన్నం మానేయడం ఉపవాసం. అది ఉపవాసం కాదు. అశనం. నువ్వు ఒక జన్మలో వేరొకరికి పెట్టలేదు కనుక.. ఈ జన్మలో తినక దరిద్రమనుభవిస్తున్నావు. కడుపు నిండా తినేస్తే కన్ను పడిపోతుంది కాబట్టి.. కన్ను పడిపోనంత సాత్వికమైన పదార్థం.. శరీరం నిలబడేంతవరకు దైవానుగ్రహంగా తిని.. ఆ ఓపికతో భగవదారాధన చేయడం ఉపవాసం." అని తెలిపారు.
ఈ విషయాన్ని చాలామంది వేరుగా తీసుకుంటున్నారని.. శరీరం అలసటతో ఊగిపోతున్నా.. షుగర్ ఉన్నా.. అలా ఉండొద్దని వైద్యులు సూచించినా.. భగవంతుడి పేరు చెప్పి తినకపోవడం ఫ్యాషన్‌గా మారిపోయిందని తెలిపారు. అది నిజమైన ఉపవాసం కాదని.. అలా చేయడం దరిద్రం అనుభవించడం కిందనే వస్తుందని తెలిపారు చాగంటి.
ఆరోగ్య సమస్యలు ఉంటే..
నిజానికి చాలామంది మహిళలు ఐరన్ డెఫీషియన్సీతో, విటమిన్ డి లోపంతో, రక్తం తక్కువగా ఉండటం వంటి సమస్యలతో ఇబ్బంది పడతారు. మరికొందరికి షుగర్, బీపి వంటి దీర్ఘకాలిక సమస్యలు కూడా ఉంటాయి. అలాంటి వారు ఉపవాసం పేరుతో ఏమి తినకుండా, తాగకుండా ఉంటే శరీరం నీరసించిపోతుంది. కొన్ని పరిస్థితుల్లో తీవ్రమైన ఇబ్బందులు పడాల్సి వస్తుంది.
పైగా పూజ లేదా వ్రతం చేయాలనుకున్నప్పుడు ఉదయాన్నే లేచి ఇంటిని శుభ్రం చేసుకుని.. పూజ చేసుకుని.. నైవేద్యాలు, ప్రసాదాలు వండి.. వ్రతంలో పాల్గొని.. ఇలా హడావిడిగా ఉంటారు. అప్పటికే శరీరంలో ఓపిక అయిపోతూ ఉంటుంది. మరికొందరు వ్రతం చేసుకుంటూ ఆఫీస్ వర్క్స్, ఇతర వర్క్స్ కూడా చూసుకోవాల్సి వస్తుంది. అవి చేసుకోవడానికి అయినా ఓపిక చాలా అవసరం. అలాంటప్పుడు కూడా ఏమి తినకుండా ఉండడమనేది సబబు కాదని గుర్తించాలి.
దైవానుగ్రహం కోసం చేయాల్సిన పని అదొక్కటే
చివరిగా పూజ అనేది ఎప్పుడూ శుద్ధితో చేయాలి. అంతేకానీ ఆరోగ్యాన్ని త్యాగం చేస్తూ కాదు. ఆరోగ్యంగా ఉండి, భక్తిగా జీవించడమే నిజమైన వ్రత ఫలితం. కాబట్టి.. వ్రతం చేసుకునేప్పుడు లేదా ఇతర పూజా కార్యక్రమాల్లో ఉన్నప్పుడు ఇతర పనులు పెట్టుకోకపోవడం మంచిది. ఆ సమయంలో దైవానికి దగ్గరగా ఉండేలా చూసుకోవాలి. అలా చేస్తేనే మీరు చేసిన వాటికి మంచి ఫలితం దక్కుతుంది. అంతేకానీ శరీరాన్ని కష్టపెడుతూ ఉపవాసం చేస్తే.. వ్రత ఫలితం మీకు దక్కకపోవచ్చు. కాబట్టి దైవానుగ్రహం పొందేందుకు శరీరానికి కావాల్సినంత సాత్వికమైన ఆహారాన్ని అందించి.. ఆరోగ్యంతో దైవానుగ్రహం పొందవచ్చు.






















