Fathers Day 2022: నాన్న ఎందుకు అర్థం కాడు, ఆయన మనసులో ఏముంటుందో కనిపెట్టలేమా
నాన్న పైకి కనిపించినంత కఠినాత్ముడా..? ఆయన ఆవేశానికి ఏ అర్థమూ ఉండదా..?
నాన్నంతే, అసలు అర్థం కాడు..!
"అబ్బబ్బ మా నాన్నతో పడలేక పోతున్నారా. ఏది అడిగినా వద్దు, కాదు, కుదరదు అనే అంటాడు. తెలుగులో ఆయనకు ఈ పదాలు తప్ప మరేవీ రావేమో" అని చాలా విసుగ్గా అన్నాడు అజయ్.
"సర్లే అక్కడి మా నాన్నేదో గొప్పోడు అన్నట్టు మాట్లాడతావ్. బైక్ కొను నాన్న అంటే అసలు పట్టించుకోడే. పైగా లక్ష రూపాయల జీతం. ఏం చేసుకుంటాడో ఏమో ఆ డబ్బులన్నీ" అని విసుక్కున్నాడు విజయ్.
ఇలాంటి అజయ్, విజయ్‌లు మనలో చాలా మందే ఉన్నారు. "ఇంత హార్డ్‌గా బిహేవ్ చేయాల్సిన అవసరమేముంది ఈయనకు" అని లోలోపలే
తిట్టుకుంటాం. నాన్న ఇంట్లో ఉంటే మన ఆటలు చెల్లవు. అలా బయటకు వెళ్లగానే ఎగిరి గంతులేస్తాం. నాన్నతో చెప్పుకోలేనివి, చెప్పొద్దు అనుకున్నవి అమ్మతో చెవిలో ఊదేస్తాం. మొత్తంగా నాన్నను మనం విలన్‌గా ఫిక్స్ అయిపోయాం. మామూలుగా కూడా కాదు "ఉత్తమ విలన్" అని బిరుదు కూడా ఇచ్చేసుకున్నాం. కానీ నిజంగా నాన్న విలనేనా..? నాన్న పైకి కనిపించినంత కఠినుడా..? పిల్లలు చెప్పేది ఏమీ అర్థం చేసుకోడా..? ఈ ప్రశ్నలకు సమాధానం నాన్నకు మాత్రమే తెలుసు. "వద్దు" అని బాధ పెడుతున్నాడని మాత్రమే మనకు తెలుసు. కానీ ఆ సమాధానం చెప్పే ముందు నాన్న ఎంత బాధ పడి ఉంటాడో ఊహించగలమా..? పిల్లలకు ఏది అవసరమో, ఏది అనవసరమో నాన్నకు బాగా తెలుసు. పైగా ఆయనో బడ్జెట్ పద్మనాభం కదా. అందుకే చాలా లెక్కలు వేసుకుంటాడు. పిల్లోడికి బైక్ కొనివ్వటం కన్నా బస్‌పాస్‌కి డబ్బులిస్తే చాలనుకుంటాడు. నువ్వు ఫైనల్ ఎగ్జామ్స్‌లో పాస్ అయిన తరవాత బైక్ కొనిస్తానని కండీషన్ పెట్టి కొన్ని రోజులు నీ పోరు నుంచి
తప్పించుకుంటాడు. చాలా తెలివైన వాడు కదా మరి.
నాన్న ఓ కాలిక్యులేటర్
నలుగురిలో మనల్ని ఎవరైనా పొగిడితే తెగ పొంగిపోతాం. మనకు తెలియకుండా గర్వం తలకెక్కుతుంది. తరవాత ఏదైనా తప్పు చేస్తే ఆ పొగిడిన నలుగురే మనల్ని తిడతారు. అప్పుడు కుంగిపోతాం. ఇది తెలుసు కాబట్టే నాన్న మనల్ని అందరి ముందు పొగడడు. నాన్న కాలిక్యులేటర్ అయితే, అమ్మ మానిప్యులేటర్. ప్రతిపైసా లెక్క వేసుకుని నాన్న ఖర్చు పెడుతుంటే, అమ్మ చాలా తెలివిగా ఒక్కో రూపాయి కూడబెట్టి పిల్లలకు ఇచ్చేస్తుంది. ఇద్దరూ పిల్లల్ని చాలా బ్యాలెన్స్‌డ్‌గా మోసేస్తారు ఇద్దరూ. కానీ మన మొగ్గు మాత్రం అమ్మ వైపే. ఇద్దరూ సరిసమానంగా మనల్ని మోస్తున్నా..నాన్న శ్రమకు విలువ ఉండదు. ఆయన శ్రమకే కాదు. ఆయన ప్రేమకు, ఆవేశానికి, మాటలకు, నిర్ణయాలకు కూడా విలువ ఉండదు. కాదు కాదు..మనం ఉండదు అనుకుంటాం అంతే. అయినా ఆయన విలువను అంత సులువుగా లెక్క కట్టలేం.
నాన్నను అర్థం చేసుకుంటున్నామా..?
అమ్మ పిల్లల్ని ఓ మాట అనే ముందు మథన పడుతుంది. నాన్న ఆ మాట అనేశాక మథన పడతాడు. ఇద్దరి కోపంలోనూ ప్రేమ ఉంటుంది. ఇద్దరి ప్రేమలోనూ కోపం ఉంటుంది. కానీ మనకు నాన్న కోపం మాత్రమే గుర్తుంటుంది. ఆయన కన్నెర్ర చేసిన సందర్భాలనే చూస్తాం. మనెవ్వరికీ తెలియకుండా ఆయన ఎక్కడో డాబా మీద తిరుగుతూనో, బెడ్‌రూమ్‌లో ఒంటరిగా పడుకున్నప్పుడో కన్నీరు కారుస్తాడు. ఆ కన్నీళ్లకు కాలమే సాక్ష్యం. ఒకవేళ నాన్న ఏడవటాన్ని అమ్మ చూసినా మనకు చెప్పదు. పిల్లాడిని ఓ దెబ్బ కొట్టాక అంతకు పదింతల నరకం అనుభవిస్తాడు నాన్న. అది చెప్పినా అర్థం చేసుకునే స్థాయి మనకు ఉండదు. "హృదయం శిల, శిలలో శిల్పం చెలిమే" అని అంటారు వేటూరి. ఇది నాన్నకు ఆపాదించుకోవచ్చేమో. ఆయన హృదయం శిలే కావచ్చు. కానీ అందులో చెలిమి అనే శిల్పాన్ని మనం చూడలేం. మనం చూడాలని ప్రయత్నించే నాటికి మన కళ్లకు మసకలు వచ్చేస్తాయి. మనమూ ముసలి వాళ్లమైపోతాం. చివరకు నాన్న "అర్థం కాని పుస్తకం" అనే ముద్ర వేయించుకుని వెళ్లిపోతాడు. మనం ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయ్యే టైమ్‌లో కొన్ని అర్థం కాని కాన్సెప్ట్‌లను ఆప్షనల్‌గా పెట్టుకుంటాం. ఎగ్జామ్‌లో వచ్చినా ఆప్షనల్ కింద వదిలేసి సులువైన క్వశ్చన్స్‌కి ఆన్సర్ రాసేస్తాం. పాస్ అయిపోతాం. ఓ పదేళ్ల తరవాత ఉద్యోగాల కోసం చూసే రోజుల్లో మనం ఆప్షనల్‌గా పెట్టుకున్న ఆ కాన్సెప్ట్‌నే మళ్లీ చదవాల్సి వస్తుంది. అవి నేర్చుకుంటే తప్ప ఉద్యోగం రాని టఫెస్ట్ సిచ్యుయేషన్ వచ్చేస్తుంది. మనల్ని పాస్ చేయించే సులువైన ప్రశ్న అమ్మ అయితే, మనకు ఓ దారి చూపించి మనల్ని నిలబెట్టే ఆ అర్థం కాని కాన్సెప్ట్ నాన్న. ఇది అర్థం చేసుకునే రోజే నీకు నాన్న అర్థమవుతాడు. అట్‌లీస్ట్ అర్థమైనట్టు అనిపిస్తాడు.