(Source: ECI/ABP News/ABP Majha)
dమలబద్ధకంతో బాధపడుతున్నారా? ఈ ఇంటి చిట్కాలతో ఉపశమనం పొందొచ్చు
పొట్టలో అసౌకర్యంగా ఉంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. గ్యాస్, మలబద్ధకం నుంచి బయటపడే మార్గాలు ఇవే.
మలబద్ధకం సమస్య బయటకి చెప్పుకోలేరు. కానీ బాధ భరించడం మాత్రం చాలా కష్టం. చాలా మంది వ్యక్తులు వారానికి మూడు లేదా నాలుగు సార్లు మాత్రమే మలవిసర్జన చేస్తారు. వారానికి 3 సార్లు కంటే తక్కువగా వెళ్తుంటే మాత్రం మీరు మలబద్ధక సమస్యతో బాధపడుతున్నట్టే. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 10% నుంచి 20% మంది పెద్దలు తమ జీవితంలో ఏదో ఒక సమయంలో మలబద్ధకం సమస్యతో బాధపడేవాళ్ళు. ఇది దీర్ఘకాలం పాటు కొనసాగితే ఇతర అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
పెద్ద పేగు విషపూరిత వ్యర్థాలని తొలగించకపోతే అది శరీరంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. పైల్స్ సమస్య, బరువు తగ్గలేకపోవడం, ఆహారం తీసుకోవడం కూడా కష్టంగా ఉంటుంది. నిశ్చల జీవనశైలి, పీచుపదార్థం తక్కువగా ఉండే ఆహారం, టీ లేదా కాఫీ అధికంగా తాగడం, డీహైడ్రేషన్, ఎక్కువ యాంటాసిడ్ లు తీసుకోవడం, ఐరన్, కాల్షియం సప్లిమెంట్లు అతిగా వాడటం, ఒత్తిడి, నిద్రలేమి వంటి సమస్యల వల్ల కూడా మలబద్ధకం ఏర్పడుతుంది. ఈ సమస్య నుంచి బయట పడేందుకు మంచి ఆహారం తీసుకోవాలి.
నీరు ఎక్కువ తీసుకోవాలి
శీతాకాలంలో ఈ సమస్య ఎక్కువగా ఎదురవుతుంది. నీరు సరిగా తీసుకోకపోవడం వల్ల డీహైడ్రేట్ కి గురవుతారు. దీని వల్ల జీర్ణ సమస్యలు, మలబద్ధకం వస్తాయి. సరైన చికిత్స తీసుకోకపోతే అంతర్లీన సమస్యలకి దారి తీస్తుంది. ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. తృణధాన్యాలు, నారింజ, జామ, ద్రాక్ష పండ్లు, ఓట్స్ తో పాటు కాలానుగుణ కూరగాయలు తీసుకోవాలి. ఫైబర్ రిచ్ ఫుడ్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఇది పెద్ద పేగుని శుభ్రం చేస్తుంది.
మలబద్ధకం తగ్గించే ఇంటి చిట్కాలు
సైలియం పొట్టు: దీన్నే ఇసాబోల్గ్ అని కూడా పిలుస్తారు. బరువు తగ్గడాన్ని ప్రోత్సహించే ఫైబర్ ఫుడ్. 2 నుండి 3 టీస్పూన్ల సైలియం పొట్టుని ఒక గ్లాసు నీళ్ళలో కలుపుకుని తాగితే సమస్య నుంచి బయటపడొచ్చు.
త్రిఫల చూర్ణం: శరీరం నుంచి అదనపు వాత, పిత్త, కఫ దోషాలని త్రిఫల చూర్ణం సమర్థవంతంగా తొలగిస్తుంది. పేగులని శుభ్రం చేసుకునేందుకు 1 టేబుల్ స్పూన్ త్రిఫల చూర్ణాన్ని నీటిలో కలుపుకుని పడుకునే ముందు తాగితే చక్కని ఫలితం పొందుతారు.
నల్ల ఎండు ద్రాక్ష: ఇందులో కరగని ఫైబర్ ఉంటుంది. పడుకునే ముందు నాలుగు లేదా ఐదు నానబెట్టిన ఎండు ద్రాక్ష తినొచ్చు. లేదంటే రెండు టేబుల్ స్పూన్ల ఎండు ద్రాక్షని గోరువెచ్చని నీటితో కలిపి తిన్నా కూడా మలబద్ధకం నివారించవచ్చు.
వామ్ము: కడుపు సమస్యలకి చక్కని పరిష్కారం వామ్ము. జీర్ణక్రియకి సహాయపడుతుంది. కడుపులో ఆహారాన్ని విచ్చినం చేస్తుంది. ½ టీ స్పూన్ వామ్ముని వేడి నీటిలో నానబెట్టుకుని తాగాలి.
ఆముదం: ఆముదంలో రిసినోలీక్ యాసిడ్ ఉంటుంది. ఇది మల వ్యర్థాలని తొలగించడానికి సహాయపడుతుంది. నిద్రపోయే ముందు ఒక టేబుల్ స్పూన్ ఆముదం తాగడం మంచిది. గర్భిణీ స్త్రీలు, రుతుక్రమం ఉన్న మహిళలు మాత్రం ఇది చెయ్యకూడదు.
కొబ్బరినూనె: కొబ్బరి నూనెలో మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయని నిరూపితమైంది. పేగు కదలికలని ప్రోత్సహిస్తాయి. ఒక టేబుల్ స్పూన్ తాజా కొబ్బరి నూనె తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: చలికాలంలో చర్మం పొడిబారిపోతుందా? ఈ బాడీ వాష్ ట్రై చేయండి