Relationships: జీవిత భాగస్వామితో వాదన అయ్యాక మళ్లీ ఇలా కనెక్ట్ అయిపోండి
భార్యాభర్తల మధ్య గొడవలు జరగడం చాలా సాధారణమైన విషయం.
ప్రతి ఇంట్లో భార్యాభర్తల మధ్య ఏదో ఒక విషయంలో గొడవలు రావడం, మనస్పర్ధలు రావడం వంటివి జరుగుతూనే ఉంటాయి. వాదన అయ్యాక ఆ కోపాన్ని కొనసాగించకుండా తిరిగి జీవిత భాగస్వామితో అందంగా కనెక్ట్ అయితే ఎలాంటి సమస్యా ఉండదు. లేకుంటే గొడవలు పెద్దవిగా మారే అవకాశం ఉంది. అలా గొడవను పొడిగించకుండా తక్కువ సమయంలోనే సరిదిద్దుకుంటే వారి జీవితం అందంగా, ఆనందంగా ఉంటుంది. ఇందుకోసం ఇద్దరిలో ఎవరో ఒకరు చొరవ తీసుకోవాలి. చేదు విషయాలను ఎక్కువ కాలం పాటు గుర్తుపెట్టుకోకూడదు. భార్య భర్తల్లో ఎవరో ఒకరు ముందుగా కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నించాలి. రెండు మూడు రోజులపాటు మాట్లాడుకోకపోవడం, ఒకరిని ఒకరు పట్టించుకోకపోవడం వంటివి చేయడం వల్ల ఇద్దరి మధ్య దూరం పెరుగుతుందే కానీ తరగదు. మానసికంగా ముందుగా ఒకరిపై ఒకరు ఆధారపడేలా ఉండాలి. ఏ భార్యాభర్తలు అయితే మానసికంగా ఒకరిపై ఒకరు ఆధారపడతారు. వారు గొడవలు అయినా కూడా వెంటనే సర్దుకుపోయి ఒక్కటైపోతారు. గొడవలు అయ్యాక భార్య లేదా భర్త చొరవ తీసుకొని ఆ పరిస్థితులను సద్దుమణిగేలా చేయాలి.
మాట్లాడకపోవడం అనేది గొడవను పెంచుతుంది. కానీ తగ్గించదు. కాబట్టి వాదన పూర్తయ్యాక ఆ వాతావరణంలో చల్లబరిచేలా చొరవ తీసుకుని ఎవరో ఒకరు మాట్లాడాలి. అవసరమైతే సారీ చెప్పాలి. సారీ చెప్పడం వల్ల జరిగే నష్టం ఏమీ లేదు, జీవిత భాగస్వామి కోసం ఒక మెట్టు దిగడం బంధాన్ని కాపాడుకోవడమే అవుతుంది. మీ తప్పు ఉంటే వెంటనే ఆ విషయాన్ని అంగీకరించండి. మీ తప్పు లేకపోతే ఆ విషయాన్ని సున్నితంగా చెప్పండి. అంతే తప్ప వాదనకు దిగకండి. గొడవ జరగడానికి కారణం ఏదో ఒకటి ఉంటుంది, ఆ కారణంలో మీ తప్పు ఎంతో ఎదుటివారి తప్పు కూడా అంతే ఉండొచ్చు. కాబట్టి ఇద్దరు సర్దుకు పోతేనే జీవితం ముందుకు సాగుతుంది.
గొడవ జరుగుతున్నప్పుడు జీవిత భాగస్వామి చేతిని గట్టిగా పట్టుకోండి. ఆ స్పర్శ ఈ మధ్య ఉన్న ప్రేమను గుర్తు చేస్తుంది. లేదా కౌగిలించుకోండి. ఆ వాదన అక్కడితో ఆగిపోతుంది లేదా కొంత సమయం తీసుకోండి. ఇద్దరు మానసికంగా ప్రశాంతంగా మారాక మళ్ళీ మాట్లాడుకోవడానికి ప్రయత్నించండి. అంతే తప్ప ఇద్దరు ఆవేశంలో ఉన్నప్పుడు మాటలు అనుకుంటే అవి తూటాల్లా మనసును గాయపరుస్తాయి. దూరాన్ని పెంచుతాయి. కాబట్టి కోపం, ఆవేశం ఉన్నప్పుడు మౌనాన్ని పాటించడమే ఉత్తమం. ఆ తరువాత టీ లేదా కాఫీ చేసుకొని మీ భాగస్వామితో కలిసి తాగండి. దీనివల్ల మీ భార్య లేదా భర్త కూడా కూల్ అయ్యే అవకాశం ఉంది. అలాగే వారికి ఇష్టమైన చిరుతిండిని వండి తీసుకెళ్లి ఇవ్వండి. గొడవలు అయ్యాక ఇలా కనెక్ట్ అవ్వడం వల్ల మీ మధ్య బంధం మరింత బలంగా మారుతుంది.
Also read: లావుగా ఉన్న ఉద్యోగులు సరిగా పనిచేయలేరు, కంపెనీ ఖర్చులు పెంచుతారంటున్న కొత్త అధ్యయనం
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.