Tea Benefits: బొజ్జ తగ్గాలా? పరగడుపున ఇది తాగితే బెల్లి ఫ్యాట్ ఇట్టే కరిగిపోతుంది, ఇలా తయారు చేయండి
పొద్దున్నే లేవగానే టీ తాగనిదే కొందరికి రోజు గడవదు.. కొంతమంది అయితే బెడ్ మీద నుంచి టీ తాగిన తర్వాతే లేస్తారు. ఆరోగ్యానికి మంచి చేసే చాలా రకాల టీల గురించి చూస్తూనే ఉంటాం.
పొద్దున్నే టీ తాగనిదే కొందరికి రోజు గడవదు. కొంతమంది టీ తాగిన తర్వాతే బెడ్ మీద నుంచి లేస్తారు. టీ తాగితే బద్దకం వదిలి, కాస్త ఫ్రెష్‌గా ఉంటుంది. అయితే, ఉదయాన్నే టీ తాగడం వల్ల మీకు మరో ప్రయోజనం కూడా లభిస్తుంది. ముఖ్యంగా బొజ్జతో బాధపడేవారికి ఇది గుడ్ న్యూస్. మీ బెల్లీ ఫ్యాట్ కరగాలంటే రోజూ ఈ ఐదు రకాల పదార్థాలతో టీ తయారు చేసుకుని తాగండి. తప్పకుండా ఫలితం ఉంటుంది.
దనియాలు, సోంపు, జీలకర్ర, వామ్ము, దాల్చిన చెక్కతో తయారు చేసే ఈ మసాలా టీను మీరు ఖాళీ కడుపునే తాగాలి. అప్పుడే తగిన ఫలితం కనిపిస్తుందని పోషకాహార నిపుణులు అంటున్నారు. ఈ ప్రత్యేకమైన టీను థైరాయిడ్, డయాబెటిస్‌తో బాధపడే వాళ్ళు కూడా తీసుకోవచ్చు. అయితే, చక్కెర ఎక్కువ లేకుండా తాగాలి.
మసాలా టీ తయారీకి కావలసిన పదార్థాలు
దనియాలు - 2 టేబుల్ స్పూన్లు
సోంపు గింజలు- 2 టేబుల్ స్పూన్లు
జీలకర్ర- 2 టేబుల్ స్పూన్లు
వామ్ము- 2 టేబుల్ స్పూన్లు
దాల్చిన చెక్క - 1 అంగుళం ముక్క
తగినంత నీరు
తయారీ విధానం
ఈ మసాలా దీనుసులన్నీ ఒక పాన్ లోకి తీసుకుని మంచి సువాసన వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. అవి బాగా అరిపోయిన తర్వాత వాటిని మిక్సీ చేసుకుని మెత్తగా పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలో 2 కప్పుల నీళ్ళు తీసుకుని స్టౌ మీద చిన్న మంట పెట్టి వాటిని మరిగించుకోవాలి. తర్వాత అందులో పొడి చేసుకున్న మిశ్రమం ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకుని బాగా మరిగించుకోవాలి. సుమారు 5 – 10 నిమిషాల పాటు వాటిని మరిగించాక నీళ్ళు కూడా తగ్గుతాయి. అప్పుడు స్టౌ ఆపేసి వాటిని ఒక కప్పులోకి వడకట్టుకోని కొద్దిగా నిమ్మరసం కలుపుకోవాలి. ప్రతి రోజు ఉదయం పరగడుపున దీన్ని తాగితే మీ పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు తగ్గిపోవడం ఖాయం. ఇది రుచికి కొంచెం చేదుగా అనిపిస్తుంది. అలా తాగలేని వాళ్ళు కొద్దిగా తేనె జోడించుకోవచ్చు. కానీ, చక్కెర మాత్రం కలపొద్దు. చక్కెర వల్ల కొత్త సమస్యలు వస్తాయి.
ఈ టీ మసాలా దినుసుల వల్ల ప్రయోజనాలు
ఈ మసాలా దినుసులు బరువు తగ్గించడానికి చాలా సహాయపడతాయి. అంతే కాదు జీర్ణక్రియ, జీవక్రియని మెరుగుపరుస్తుంది. శరీరంలోని అదనపు కొవ్వుని తొలగించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. జీలకర్ర అధిక జీర్ణశక్తిని కలిగి ఉంటుంది. ఇందులో మాంగనీస్, ఇనుము పుష్కలంగా ఉంటాయి. కడుపు సంబంధిత సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. దాల్చిన చెక్కలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. డయేరియా, గ్యాస్ సంబంధ చికిత్సలు ఇది గొప్ప ఔషధంగా పని చేస్తుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించి రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. ఇక వామ్ములో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉన్నాయి. కొలెస్ట్రాల్ స్థాయిలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. జీర్ణ వ్యవస్థని మెరుగుపరిచి బరువు తగ్గించడంలో సహాయకారిగా ఉంటుంది. సోంపు గింజలలో ఫైబర్ ఎక్కువ. దీని వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. రోజంతా ఫిట్ గా ఉండటానికి సహాయపడుతుంది. దనియాల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అవి కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: జుట్టు చివర్ల కత్తిరిస్తే నిజంగానే పెరుగుతుందా? నిపుణులు ఏం చెప్తున్నారంటే?
Also Read: డయాబెటిక్ బాధితులకు నోరూరించే బ్రేక్ ఫాస్ట్ వంటకాలు ఇవిగో