Recipes: వారానికోసారి నువ్వులన్నం ఇలా చేసుకుని తినండి చాలు - ఎంతో బలం
నువ్వులు ఎంతో బలం. వాటితో ఇలా నువ్వులన్నం చేసుకుంటే రుచే వేరు.
ఎప్పుడూ పులిహోర, ఫ్రైడ్ రైస్ వంటివి రైస్ ఐటెమ్స్ మాత్రమే తింటే బోరు కొడుతుంది. అప్పుడప్పుడు ఇలా నువ్వుల అన్నం చేసుకుని తింటే ఎంతో ఆరోగ్యం కూడా. నువ్వులు తినడం పిల్లలకు, పెద్దలకు ఎంతో అవసరం కూడా.
కావాల్సిన పదార్థాలు
నువ్వులు - అయిదు టేబుల్ స్పూన్లు
వండిన అన్నం - రెండు కప్పులు
మినపప్పు - ఒక టీస్పూను
శెనగపప్పు - ఒక టీస్పూను
వేరు శెనగపలుకులు - గుప్పెడు
వెల్లుల్లి - నాలుగు రెబ్బలు
ఎండు మిర్చి - నాలుగు
ఆవాలు - అర టీస్పూను
కరివేపాకులు - గుప్పెడు
పసుపు - పావు టీస్పూను
నూనె - రెండు టేబుల్ స్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడా
తయారీ ఇలా
1. స్టవ్ మీద కళాయి పెట్టి వేడెక్కాక శెనగపప్పు, మినపప్పు, ఎండు మిర్చి, నువ్వులు వేసి వేయించాలి. తీసి పక్కన పెట్టుకోవాలి.
2. వాటిని పొడి చేసి పక్కన పెట్టుకోవాలి.
3. ఇప్పుడు అదే కళాయిలో నూనె వేసి ఆవాలు, వెల్లుల్లి, కరివేపాకులు, పసుపు, కొంచెం వేరుశెనగపప్పు, కొంచెం మినపప్పు వేసి వేయించాలి.
4. ఇందులో వండి పెట్టుకున్న అన్నం వేయాలి.
5. అలాగే ముందుగా చేసిపెట్టుకున్న నువ్వుల పొడిని,ఉప్పుని వేసి బాగా కలుపుకోవాలి. ఈ అన్నం చాలా టేస్టీగా ఉంటుంది.
తింటే ఎంతో బలం...
నువ్వులు తినడం మహిళలకు చాలా అవసరం. రుతుక్రమంలో వచ్చే సమస్యలకు నువ్వులు చెక్ పెడతాయి. అయితే రుతుస్రావం జరిగే అయిదు రోజులు వీటిని తినకపోవడమే మంచిది. మిగతా రోజుల్లో తింటే మాత్రం రుతుస్రావ సమయంలో వచ్చే పొట్ట నొప్పి, తిమ్మిరి వంటివి తగ్గుతాయి. వీటిలో ఐరన్, జింక్, కాల్షియం, థయామిన్, విటమిన్ ఇ అధికంగా ఉంటాయి. ఇవన్నీ కూడా మనకు అత్యవసరం అయినవే. దీనిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. గుండె జబ్బులు, క్యాన్సర్లు, టైప్ 2 డయాబెటిస్ వంటివి రాకుండా అడ్డుకునే శక్తి వీటికి ఉంది. అలాగే నువ్వులను తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుందని ఇప్పటికే అధ్యయనాలు తేల్చాయి. హైబీపీ ఉన్నవారు కూడా నిత్యం నువ్వులను తినడం మంచిది. బీపీ అదుపులో ఉంటుంది. రక్త సరఫరా కూడా మెరుగుపడుతుంది. నువ్వుల నూనె ఒంటికి రాసుకుంటే నొప్పులు తగ్గుతాయి.
View this post on Instagram
Also read: మూత్రం దుర్వాసన వస్తుందా? ఈ వ్యాధులు ఉన్నాయేమో చెక్ చేసుకోండి