Veg Bread Omelette Recipe : టేస్టీ వెజ్ బ్రెడ్ ఆమ్లెట్.. బ్రేక్‌ఫాస్ట్‌కి సింపుల్, పర్ఫెక్ట్ ఎంపిక, రెసిపీ ఇదే
Vegetarian Omelette : చాలామంది ఆమ్లెట్ అంటే నాన్‌వెజ్ మాత్రమే ఉంటుందనుకుంటారు. కానీ వెజ్ ఆమ్లెట్ కూడా వేసుకోవచ్చు. మరి టేస్టీ వెజ్ బ్రెడ్ ఆమ్లెట్‌ను ఎలా చేయాలో తెలుసా?
Vegetarian Breakfast Recipes : వెజ్ బ్రెడ్ ఆమ్లెట్. ఎప్పుడూ వినలేదా? కానీ ఎలాంటి ఎగ్స్ లేకుండా ఈ టేస్టీ ఐటమ్‌ని సింపుల్‌గా రెడీ చేసుకోవచ్చు. ఎగ్ లేకుండా ఆమ్లెట్ ఎలా చేయాలి అని డౌట్ ఉంటే మీరు కూడా ఈ రెసిపీని చూసేయండి. ఈ టేస్టీ వెజ్ బ్రెడ్ ఆమ్లెట్‌ను ఎలా తయారు చేయాలి? కావాల్సిన పదార్థాలు ఏమిటి? ఏ టిప్స్ ఫాలో అయితే రెసిపీ మరింత టేస్టీగా వస్తుంది? వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
శనగపిండి - ఒకటిన్నర కప్పు
బియ్యం పిండి - అర కప్పు
చాట్ మసాలా - అర టీస్పూన్
పసుపు - పావు టీస్పూన్
బేకింగ్ పౌడర్ - 1 టేబుల్ స్పూన్
సాల్ట్ - రుచికి తగినంత
టమోటో - 1 (మీడియం)
ఉల్లిపాయ - 1 (చిన్నది)
పచ్చిమిర్చి - 1
కొత్తిమీర - చిన్న కట్ట
నెయ్యి - 1 టీస్పూన్
నీళ్లు - ఒకటి పావు కప్పు
బ్రెడ్ - 5
తయారీ విధానం
ముందుగా టమోటో, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీరను బాగా కడగాలి. ఇప్పుడు వాటిని సన్నగా తురుముకోవాలి. పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకోండి. దానిలో శనగపిండి తీసుకోండి. దానిలోనే బియ్యం పిండి వేసుకోవాలి. చాట్ మసాలా వేయాలి. ఇది మంచి టేస్ట్ ఇస్తుంది. అలా అని కచ్చితంగా వేయాలని రూల్ లేదు. ఉప్పు, పసుపు, బేకింగ్ పౌడర్ వేసి.. పొడులను బాగా కలపాలి. అనంతరం దానిలో కాస్త నీరు వేసి కలుపుకోండి. అనంతరం ఉండలు లేకుండా పిండిని కలపాల్సి ఉంటుంది.
పిండిని ఎంత బాగా కలిపితే ఆమ్లెట్ అంత మంచిగా వస్తుంది. అందుకే పిండిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దానిలో టమోటో ముక్కలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీరను వేసి బాగా కలుపుకోవాలి. అన్ని కలిసేలా ముక్కలకు శనగపిండి పట్టేలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టౌవ్ వెలిగించుకోవాలి. దానిలో కొంచెం నెయ్యి తీసుకుని దానిపై బ్రెడ్ ముక్కను ఉంచుకోవాలి. అది ఒకవైపు రోస్ట్ అయిన తర్వాత.. కాస్త నెయ్యి వేసి మరోవైపు రోస్ట్ చేసుకోవాలి. టోస్టర్ ఉంటే ఇది మరింత సులువు. మిగిలిన బ్రెడ్ ముక్కలను కూడా ఇదే విధంగా క్రిస్పీగా రోస్ట్ చేసుకోవాలి.
స్టౌవ్ వెలిగించి దానిపై ఆమ్లెట్ పాన్ పెట్టి దానిలో బటర్ వేయాలి. ఇప్పుడు ముందుగా బాగా మిక్స్ చేసుకుని పెట్టుకున్న శెనగపిండి మిశ్రమాన్ని మరోసారి కలపాలి. ఇప్పుడు పెద్ద గరిటతో తీసుకోవాలి. దానిని పెనంపై వేసి.. గుండ్రంగా తిప్పాలి. పిండిని మరీ పలుచగా వేయకూడదు. అలా అని మరీ మందంగా కూడా వేయకూడదు. ఇప్పుడు దాని అంచుల వెంబడి నూనె లేదా నెయ్యి వేసుకుని.. దానిని రోస్ట్ చేసుకోవాలి. పిండి కాస్త తడిగా ఉన్నప్పుడు దానిపై ముందుగా రోస్ట్ చేసుకున్న బ్రెడ్ పెట్టుకోవాలి.
బ్రెడ్‌ని నాలుగువైపుల నుంచి మూసివేసి.. పైన కాస్త బటర్ వేయాలి. అంతే టేస్టీ, సింపుల్ వెజ్ ఆమ్లెట్ రెడీ. ఇలా మిగిలిన వాటిని కూడా వేసుకోవాలి. అయితే ఈ వెజ్ బ్రెడ్ ఆమ్లెట్‌ను వేడి వేడిగా తింటే రుచి చాలా బాగుంటుంది. చల్లారితే అంతగా రుచించదు. దీనిని టమోటో కెచప్, పుదీనా చట్నీతో తీసుకుంటే రుచి మరింత పెరుగుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం. ఈ టేస్టీ వెజ్ బ్రెడ్ ఆమ్లెట్‌ను తయారు చేసుకుని.. హాయిగా లాగించేయవచ్చు. దీనిని మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌గా లేదా సాయంత్రం స్నాక్‌గా తీసుకోవచ్చు.
Also Read : టేస్టీ, హెల్తీ గార్లిక్ రైస్.. లంచ్ బాక్స్కోసం ఈ సింపుల్ రెసిపీని ఫాలో అయిపోండి