Recipe: చేదు లేకుండా గుత్తి కాకరకాయ వేపుడు - మధుమేహుల కోసం బెస్ట్ వంటకం
డయాబెటిక్ రోగులకు కాకరకాయ ఎంతో మంచిది. తింటే చాలా ఆరోగ్యం.
కాకరకాయతో చేసిన వంటకాలు ఆరోగ్యానికి మంచివని చెబుతారు పోషకాహార నిపుణులు. కానీ చేదుకు భయపడి చాలా తినరు. కానీ గుత్తి కాకరకాయ వండుకుంటే మీకు చేదు రుచి తెలియదు. రుచి అదిరిపోతుంది. సాంబారు, పప్పు వంటివి తిన్నప్పుడు సైడ్ డిష్‌గా అదిరిపోతుంది.
కావాల్సిన పదార్థాలు
కాకరకాయలు - పావుకిలో
నూనె - తగినంత
ధనియాలు - ఒక స్పూను
జీలకర్ర - ఒక స్పూను
ఎండు కొబ్బరి - చిన్న ముక్క
కారం - ఒకటిన్నర స్పూను
పసుపు - పావు స్పూను
వెల్లుల్లి రెబ్బలు - పది
ఉప్పు - రుచికి సరిపడా
తయారీ ఇలా
1. కాకర కాయలను నిలువుగా కోసుకుని గుత్తి వంకాయలు గాటు పెట్టినట్టే మధ్యలో గాటు పెట్టాలి.
2. కాకరకాయ పొట్టలో ఉన్న గింజలన్నీ తీసి వేయాలి.
3. కాకరకాయల పొట్టలో ఉప్పును రుద్ది అలా పదినిమిషాలు ఉంచాలి.
4. తరువాత వచ్చి కాయలను చేతులతో పిండితే నీరు బయటికి పోతుంది.
5. ఆ నీటితో పాటూ చేదు కూడా బయటికి పోతుంది.
6. ఇప్పుడు కళాయిలో నూనె వేసి అందులో కాకరకాయలను వేయించి, తీసి పక్కన పెట్టుకోవాలి.
7. ఇప్పుడు మిక్సీలో ధనియాలు, కారం, ఎండుకొబ్బరి, పసుపు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు వేసి రుబ్బుకోవాలి. నీళ్లు వేయాల్సిన అవసరం లేదు.
8. ఆ మసాలాను కాకరకాయల్లో స్టఫ్ చేసుకోవాలి.
9. స్టవ్ పై కళాయి పెట్టి రెండు చెంచాల నూనె వేసి, స్టఫ్ చేసిన కాకర కాయలను వేయించాలి.
10. చిన్న మంట మీద వేయిస్తే పావుగంటలో చక్కగా వేగుతాయి.
కాకరకాయలు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఇది వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. జలుబు, దగ్గు, ఆస్తమా వంటి సమస్యల బారిన తరచూ పడుతున్న వారు కాకరకాయను రెండు రోజులకోసారి తింటే చాలా మంచిది. ఎక్కువ తింటే వేడి చేసే ప్రమాదం ఉంది కాబట్టి, కాకరకాయతో భోజనం చేశాక మజ్జిగ తాగితే మంచిది. బరువు తగ్గాలనుకునేవారు, చర్మం మెరిసిపోవాలని కోరుకునే వారు కాకరను తినాలి. కాకర రసం తాగితే చర్మం అందంగా మారుతుంది. కంటి సమస్యలకు ఇది చెక్ పెడుతుంది. కాకర కాయ తినడం వల్ల రక్తం శుద్ధి అవుతుంది. కాలిన గాయాలకు కాకర ఎంతో బాగా పనిచేస్తుంది. కొవ్వును త్వరగా కరిగేలా చేస్తుంది. అజీర్ణం, పొట్టలో మంట వంటివి తగ్గేలా సహకరిస్తుంది. మధుమేహులకు ఇది ఉత్తమ వంటకం అని చెప్పుకోవచ్చు. ఎంత తిన్నా రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవు. ఉప్పులో నానబెట్టుకున్నా, లేక పసుపు కలుపుకున్నా చేదు పోతుంది. కాబట్టి చేదు కారణంగా కాకరకాయను పక్కన పెట్టడం మానేయండి.
Also read: మయోన్నెస్ రోజూ తింటున్నారా? ఇది మీ ఆరోగ్యాన్ని ఎలా దెబ్బతీస్తుందో తెలుసా
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.