(Source: Poll of Polls)
Weight Loss: బరువు తగ్గాలనుకుంటున్నారా? రోజూ ఈ పిండితో చేసిన రోటీలు తినండి - ఆ నటి డైట్ ఇదేనట!
సులభంగా బరువు తగ్గాలని అనుకునే వాళ్ళకి చక్కని ఎంపిక రాగి రొట్టెలు. మధుమేహులకి కూడా ఎంతో మేలు చేస్తాయి. అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
ఆరోగ్యాన్ని అందించే సిరిధాన్యాల్లో రాగులకి మొదటి స్థానం ఉంటుంది. రాగి పిండితో ఏ వంటకాలు చేసుకుని తిన్నా కూడా పోషకాలు సమృద్ధిగా అందుతాయి. రాగి జావ, రాగి ఇడ్లీ, రాగి దోశ, రాగి రొట్టెలు.. ఇలా ఏది చేసినా కూడా చాలా రుచిగా ఉంటుంది. దీన్నే ఫింగర్ మిల్లెట్ అని కూడా అంటారు. దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, బీహార్, మహారాష్టలో సుమారు 4 వేల సంవత్సరాల నుంచి సాగు చేయబడుతోంది. ఈ పంటకి రసాయన ఎరువులు, పురుగు మందులు అవసరం ఉండదు. అందుకే ఇది సురక్షితమైన ఆహారంగా ప్రసిద్ధి చెందింది.
ప్రోటీన్, ఐరన్, కాల్షియం, ఫైబర్, అమైనో ఆమ్లం నిండిన గొప్ప మూలం. బరువు తగ్గించే దగ్గర నుంచి మధుమేహులకి కూడా రాగులు ఎన్నో ప్రయోజనాలు అందిస్తున్నాయి. బాలీవుడ్ నటి కియారా అద్వానీ కూడా తన మధ్యాహ్న భోజనంలో రాగి రొటీలు తీసుకుంటానని పలు సందర్భాల్లో చెప్పింది. రాగిలో పోషకాలు అధికంగా ఉంటాయి. ప్రకృతి మనకి అందించిన గొప్ప ఆహారపదార్థం ఇది.
పొటాషియం, పాలీఫెనాల్ ఉంటాయి. ఇందులో కార్బోహైడ్రేట్ కంటెంట్ 70%, ప్రోటీన్ 8%, క్రూడ్ ఫైబర్ 3.4%, మినరల్స్ 2.7% ఉన్నాయి. గోధుమ, వరి బియ్యంతో పోలిస్తే రాగిలో పీచు, ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. ఇతర తృణధాన్యాలలో కంటే రాగిలో లైసిన్, థ్రెయోనిన్, వాలైన్‌లను కలిగి ఉంటుంది. కొవ్వు పదార్థాలు(1.3%) తక్కువగా ఉన్నప్పటికీ ఇందులో పాలి అన్ శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి.
మధుమేహులకి మంచిది
వైట్ రైస్ కంటే రాగి రొట్టెలు.. మధుమేహులకి చాలా మేలు చేస్తుంది. ఫైబర్, మినరల్స్, అమినో యాసిడ్ ఎక్కువగా ఉన్నందున వైట్ రైస్ కంటే ఇది మంచి ఎంపిక అని పరిశోధనలు చెబుతున్నాయి. ఇది తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. అయితే ప్రాసెస్ చేసిన ఫింగర్ మిల్లెట్లకి మాత్రం దూరంగా ఉండాలి. తెల్లని పాలిష్ చేసిన బియ్యం మాదిరిగానే ప్రాసెస్ చేసిన రాగులు కూడా గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉండే పదార్థం.
బరువు తగ్గడానికి అనువైనది
రాగిలో గ్లూటెన్ ఉండదు. కాబట్టి చక్కెర పదార్థం తక్కువగా ఉంటుంది. ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల కడుపులో జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఫలితంగా ఇది ఎక్కువ సేపు పొట్ట నిండుగా ఉంచుతుంది. ఆహారం ఎక్కువగా తీసుకోవాలనే కోరికని నిలిపివేస్తుంది. తద్వారా అదనపు కేలరీల వినియోగం తగ్గుతుంది.
గుండె ఆరోగ్యానికి ఉత్తమమైనది
తరచూ రాగితో చేసిన పదార్థాలు తినడం వల్ల గుండె జబ్బుల ప్రమాదాన్ని నివారించవచ్చు. డైటరీ ఫైబర్ తో నిండి ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ ని నియంత్రించడంలో సహాయపడుతుంది.
గట్ హెల్త్ మెరుగుపరుస్తుంది
రాగుల్లోని పీచు జీర్ణక్రియ ఆరోగ్యానికి సహాయపడుతుంది. గట్ లోని మంచి బ్యాక్టీరియాని వృద్ధి చేస్తుంది. బరువు నిర్వహణకు తోడ్పడుతుంది.
రాగి రొట్టె తయారీ
ఒక గిన్నెలో అరకప్పు రాగిపిండిని వేయాలి. చిటికెడు ఉప్పు, నీళ్లు వేసి చపాతీ పిండిలా కలపుకోవాలి. చిన్న ఉండలుగా చేసుకుని, ఒత్తుకుని కాల్చుకోవాలి. దీన్ని ఏ కూరతో తిన్నా టేస్టుగా ఉంటుంది. రోజుకి రెండు రొట్టెలు తిన్నా చాలు పోషకాహార లోపం రాదు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Also Read: ఇయర్ బడ్స్‌తో చెవులు శుభ్రం చేస్తున్నారా? ఈ పొరపాట్లు చేశారంటే వినికిడి లోపం రావొచ్చు