Phool Makhana: పిల్లలకు ఖచ్చితంగా పెట్టాల్సిన ఆహారం ఫూల్ మఖానా
ఫూల్ మఖాన వాడకం చాలా తక్కువగా ఉంది. నిజానికి అవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
పూల్ మఖాన లేదా ఫాక్స్ నట్స్... ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఆహారం. కానీ వీటి వాడకం చాలా తక్కువగా ఉంది. వాల్ నట్స్, బాదంపప్పు, జీడిపప్పులాగే ఇవి కూడా ఒక రకమైన నట్స్. వీటిలో మన శరీరానికి అత్యవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ప్రోటీన్, ఫైబర్, పొటాషియం, కాల్షియం, ఐరన్, ఫాస్పరస్, మెగ్నీషియం వంటివన్నీ వీటిలో దొరుకుతాయి. వీటితో స్వీట్స్, స్నాక్స్ తయారు చేసుకోవచ్చు. పిల్లలకు వీటితో తయారుచేసిన స్నాక్స్ తినిపించడం వల్ల వారికి అన్ని విధాలా మంచే జరుగుతుంది. ఇవి చర్మ ఆరోగ్యానికి, జీర్ణక్రియకు అద్భుతంగా పనిచేస్తాయి. ఆరోగ్యకరమైన చిరుతిండిగా పూల్ మఖానాను చెప్పుకోవచ్చు.
ఫూల్ మఖానాను నెయ్యిలో వేయించి పిల్లలకు ఇస్తే చాలు... చాలా సింపుల్ గా ఈ స్నాక్స్ తయారైపోతాయి. వారి మెదడు ఎదుగుదలకు, శరీర ఆరోగ్యానికి ఇవి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో యాంటీ ఏజింగ్ లక్షణాలు ఎక్కువ. కాబట్టి చర్మం మెరుపు సంతరించుకుంటుంది. దీంట్లో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థను మెరుగ్గా పనిచేసేలా చేస్తుంది. మలబద్ధకం వంటి సమస్యలు రాకుండా అడ్డుకుంటుంది. కాబట్టి పిల్లలకు వీటిని కచ్చితంగా తినిపించాలి. వీటిలో ఉండే ఫైటోన్యూట్రియంట్లు శరీరాన్ని అనేక సీజనల్ వ్యాధుల నుంచి కాపాడతాయి. గుండెకు రక్తప్రసరణ, ఆక్సిజన్ సరిగా అందేలా చేస్తాయి. ఇతర అవయవాలకు కూడా ఆక్సిజన్ పోషకాలు అందేలా చేస్తాయి. దీనివల్ల గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. మూత్రపిండాలను కాపాడడంలో కూడా పూల్ మఖానా ముందుంటుంది. దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు అధికం. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి.
పూల్ మఖానాలో థయామిన్ అధికంగా ఉంటుంది. ఇది మెదడు పనితీరుకు సహాయపడుతుంది. నరాల ఆరోగ్యాన్ని కాపాడతుంది. వీటి గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. వీటిని తిన్న తరువాత గ్లూకోజ్‌ను ఒకేసారి రక్తంలో విడుదల అయ్యేలా చేయదు. ఎక్కువసేపు పొట్ట నిండిన ఫీలింగ్‌ను ఇస్తుంది. కాబట్టి డయాబెటిస్ రోగులు కచ్చితంగా వీటిని తినాలి. పిల్లలు పుట్టక ఇబ్బంది పడుతున్న మహిళలు కూడా వీటిని తినడం వల్ల మంచి ఫలితాలు వస్తాయని చెబుతున్నాయి అధ్యయనాలు. మగవారు కూడా వీటిని తింటే వీర్య నాణ్యతపెరుగుతుంది. శరీరంలోని వ్యర్ధాలను బయటికి పంపడంలో ఇవి ముందుంటాయి. చక్కెర స్థాయిలను నియంత్రించి ఆరోగ్యాన్ని కాపాడతాయి.
ఫూల్ మఖానా తినడం వల్ల పిల్లల ఎముకలు బలంగా మారుతాయి. వీటిలో ఉండే కాల్షియం ఎముకలకు మేలు చేస్తుంది. శాఖాహారులు వీటిని తింటే పుష్కలంగా ప్రొటీన్ అందుతుంది. ఒకసారి నెయ్యిలో వీటిని వేయించుకుని గాలి చొరబడని డబ్బాలో వేసి దాచుకుంటే... వారం రోజుల పాటూ వాటిని నచ్చినప్పుడు తీసుకుని తినవచ్చు. దీనిలో ఉండే కేలరీలు కూడా చాలా తక్కువ.
Also read: డయాబెటిస్ అదుపులో ఉండాలంటే రోజూ కొత్తిమీర తినండి
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.