Period Hygiene Tips : ప్రతి అమ్మాయి పీరియడ్స్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. ఆ సమస్యలను దూరం చేసే టిప్స్ ఇవే
Menstrual Hygiene Guide : పీరియడ్స్ సమయంలో అమ్మాయిలు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. ఇవి డేట్ సమయంలోనే కాకుండా పూర్తి ఆరోగ్యానికి మద్ధతునిస్తాయని చెప్తున్నారు.

Period Hygiene Tips in Telugu : మహిళల పీరియడ్స్ సమయంలో శరీరాన్ని ఎంత శుభ్రంగా ఉంచుకుంటే అంత మంచిది. ఇది పూర్తి శ్రేయస్సుకి హెల్ప్ చేస్తుంది. సురక్షితమైన ఉత్పత్తి-వినియోగ పద్ధతులను పాటిస్తే.. రుతుక్రమం సమయంలో అసౌకర్యం, ఇన్ఫెక్షన్లు వంటివి తగ్గుతాయి. మరి పీరియడ్స్ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? శరీరాన్ని ఎలా చూసుకోవాలి? పరిశుభ్రతను ఎలా కాపాడుకోవాలి? నిపుణులు ఇస్తోన్న సూచనలు ఏంటి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ప్యాడ్‌ల విషయంలో..
చాలామంది మహిళలు ప్యాడ్ మార్చుకోవడం ఆలస్యం చేస్తారు. కొన్నిసార్లు సౌలభ్యం కోసం, మరి కొన్నిసార్లు అవగాహన లేక ఇలా జరుగుతుంది. కానీ ప్యాడ్‌ను ఎక్కువసేపు ఉంచుకోవడం వల్ల చికాకు, దద్దుర్లు లేదా ఈస్ట్ ఇన్ఫెక్షన్లు వస్తాయి. యోని దగ్గర నుంచి అసహ్యకరమైన వాసన వస్తుంది. నిపుణుల ప్రకారం ప్రతి నాలుగు నుంచి ఐదు గంటలకు ప్యాడ్‌లను మార్చాలి. శుభ్రమైన, స్టెరిలైజ్ చేసిన ఉత్పత్తులను ఉపయోగించాలని సిఫార్సు చేస్తున్నారు.
పరిశుభ్రత
ఋతుస్రావం సమయంలో పరిశుభ్రతను పాటించడం చాలా అవసరం. ప్యాడ్ మార్చిన తర్వాత, ముందు చేతులు కడుక్కోవడం.. క్రమం తప్పకుండా స్నానం చేయడం చేయాలి. ఆ ప్రదేశాన్ని క్లీన్ చేసేప్పుడు ముందు నుంచి వెనుకకు మాత్రమే క్లీన్ చేసుకోవాలి. దీనివల్ల ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. సున్నితంగా శుభ్రం చేసుకోవడానికి గోరువెచ్చని నీరు బాగా పనిచేస్తుంది. కానీ ఆ ప్రదేశాన్ని గట్టిగా రుద్దడం మానుకోవాలి.
వాటిని ఉపయోగించకండి
యోనికి దానంతట అదే సహజంగా శుభ్రపరిచే విధానం కలిగి ఉంటుంది. కాబట్టి ఆ ప్రాంతాన్ని సువాసనగల వాష్‌లు లేదా రసాయన ఆధారిత సబ్బులు ఉపయోగించాల్సిన అవసరం లేదు. అలాంటి ఉత్పత్తులు దాని సహజ pH సమతుల్యతకు అంతరాయం కలిగిస్తాయి. చికాకు కలిగిస్తాయి. నీటితో సాధారణంగా శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. డూచింగ్ లేదా అతిగా కడగడం ఎక్కువ ఇబ్బందిని కలిగిస్తుంది.
పోషకాలతో నిండిన ఆహారం
ఋతుస్రావం సమయంలో పోషకమైన ఆహారం తీసుకోవడం అవసరం. ఆకుకూరలు, పప్పులు, ఖర్జూరాల వంటి ఐరన్ అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల రక్త నష్టం తగ్గుతుంది. శక్తి స్థాయిలు పెరుగుతాయి. ఫోలేట్, విటమిన్ B12, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు కూడా మొత్తం శ్రేయస్సుకు దోహదం చేస్తాయి.
హైడ్రేషన్ ముఖ్యం
పీరియడ్స్ సమయంలో కడుపు ఉబ్బరం, తిమ్మిరి ఉంటుంది. ఆ సమస్యను తగ్గించుకోవాలంటే.. శరీరానికి తగినంత నీటిని అందించాలి. దీనివల్ల కడుపు ఉబ్బరం, తిమ్మిరి తగ్గుతుంది. మూత్రపిండాల ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని దూరం చేస్తుంది.
యాక్టివ్గా ఉండాలా? వద్దా?
పీరియడ్స్ సమయంలో యాక్టివ్గా ఉండాలి. కానీ మరీ శరీరాన్ని ఇబ్బంది పెట్టేంత యాక్టివ్గా ఉండనవసరం లేదు. నడక, యోగా లేదా రిలాక్సింగ్ స్విమ్మింగ్ వంటి తేలికపాటి నుంచి మితమైన శారీరక శ్రమ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. రక్త ప్రసరణను పెంచుతుంది. తిమ్మిరిని తగ్గిస్తుంది. అలసట ఎక్కువగా ఉన్నప్పుడు అధిక-తీవ్రతతో కూడిన వ్యాయామాలు నివారించవచ్చు.
నిద్ర, ఒత్తిడి
పీరియడ్స్ సమయంలో తగినంత నిద్ర ముఖ్యం. ప్రతి రాత్రి ఏడు నుంచి తొమ్మిది గంటలు నిద్రపోవడం వల్ల హార్మోన్లు స్థిరంగా ఉంటాయి. మూడ్ స్వింగ్స్ కంట్రోల్లో ఉంటాయి. ధ్యానం, డీప్ బ్రీత్ వంటి ఒత్తిడి ఉపశమన పద్ధతులు ఫాలో అయితే మంచిది.
పీరియడ్స్ సమయంలో వీటిని మీరు పాటిస్తే.. తర్వాతి రోజుల్లో కూడా మీ ఆరోగ్యం, శరీరం ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా ఉంటుంది. అంతేకాకుండా పూర్తి ఆరోగ్య శ్రేయస్సుకు హెల్ప్ చేస్తుంది.






















