Coffee: ఈ ఆరోగ్య సమస్యలు ఉన్న వారు కాఫీకి దూరంగా ఉండాల్సిందే
కాఫీ అంటే ఎంతో మందికి ప్రాణం. టీ కన్నా కాఫీకే డిమాండ్ ఎక్కువ.
కాఫీ తాగనిదే తెలవారదు కాఫీ ప్రియులకు. కాఫీ తాగడం మంచిదే కానీ, కొన్ని ఆరోగ్యసమస్యలు ఉన్న వారు మాత్రం కాఫీ తాగడం తగ్గించాలి, లేదా మానేయాలి. ఎందుకంటే అందులో ఉండే కొన్ని సమ్మేళనాలు వారి ఆరోగ్యపరిస్థితిని మరింత దిగజార్చవచ్చు. కాఫీ కొందరికి వ్యసనం అనడంలో ఎలాంటి సందేహం లేదు. రోజుకు ఒక కప్పు లేదా రెండు కప్పులు తాగడం వల్ల సమస్య లేదు కానీ, అంతకు మించితేనే సమస్యలు వస్తాయి. కాఫీలో కెఫీన్ ఉంటుంది. అందుకే మీకు కాఫీ తాగగానే ఉత్సాహంగా ఉంటుంది.అయితే కాఫీ తాగే ముందు మీరు తాగవచ్చో లేదో తెలుసుకుని సేవిస్తే మంచిది.
ఎవరు తాగకూడదంటే...
1.అరిథ్మియా అనే ఆరోగ్యసమస్యతో బాధపడుతున్న వ్యక్తులు కాఫీని మానేయాలి.అరిథ్మియా అనేది ఒక గుండె సంబంధ వ్యాధి. గుండె విద్యుత్ వ్యవస్థలో మార్పుల కలిగి అసాధారణంగా గుండె కొట్టుకుంటుంది. దీన్నే అరిథ్మియా అంటారు. కాఫీలో ఉండే కెఫీన్ రక్తపోటును పెంచుతుంది. అరిథ్మియా వ్యాధిగ్రస్తులు కాఫీని తాగడం వల్ల సమస్య పెరుగుతుంది. కాబట్టి వీరు కాఫీని తాగడం తగ్గించాలి లేదా మానేయాలి.
2. గర్భిణిలు కూడా కాఫీని తాగడం మానేస్తే మంచిది. లేదా రోజుకు ఒక కాఫీతో సరిపెట్టుకోవాలి. ఎందుకంటే కాఫీ అతిగా తాగడం వల్ల గర్భస్రావం కావడం లేదా, ముందస్తు ప్రసవ ప్రమాదం పెరుగుతుంది. గర్భిణులు కాఫీని మానేయడం వల్ల వచ్చే పోషకాహార లోపం కూడా ఏమీ లేదు.
3. బాలింతలు కూడా కాఫీకి దూరంగా ఉండాలి. పాలిచ్చే తల్లులు కాఫీని తాగడం వల్ల వారి శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. కెఫీన్ వల్ల మూత్రవిసర్జన పెరుగుతుంది. మూత్ర విసర్జనలో నీళ్లు అధికంగా బయటికి పోతాయి. అందువల్ల కాఫీని తాగడం తగ్గిస్తే వీరిలో ఏ సమస్య ఉండదు.
4. నిద్రలేమి వంటి నిద్ర సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారు కూడా కాఫీ తాగడం తగ్గించాలి. కాఫీ తాగడం వల్ల మీకు శక్తి వచ్చినట్టు అనిపిస్తుంది కానీ నాడీ వ్యవస్థ చాలా చురుకుగా మారి సులభంగా నిద్రపట్టకుండా చేస్తుంది. అందుకే స్లీపింగ్ డిజార్డర్స్ తో బాధపడే వారు కాఫీని తాగడం పోవడం ఉత్తమం లేదా తాగాల్సి వస్తే కేవలం పగటి పూట మాత్రమే తాగాలి. మధ్యాహ్నం రెండు తరువాత తాగితే రాత్రికి వారికి నిద్రపట్టడం కష్టంగా మారుతుంది.
Also read: భారతదేశంలో పెరిగిపోతున్న బ్రెయిన్ అనూరిజం మరణాలు, ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం వద్దు
Also read: చామదుంపలో ఉండే ఈ గుణం గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటుంది
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.