Brain Aneurysm: భారతదేశంలో పెరిగిపోతున్న బ్రెయిన్ అనూరిజం మరణాలు, ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం వద్దు
మనదేశంలో ఎమెర్జెన్సీ విభాగాల్లో చేరుతున్న కేసుల్లో బ్రెయిన్ అనూరిజం కేసులు కూడా పెరిగిపోతున్నాయి.
బ్రెయిన్ అనూరిజం అన్న పదం చాలా తక్కువ మంది విని ఉంటారు. కానీ ఎక్కువ మందిలో ఇప్పుడు దీని లక్షణాలు కనిపిస్తున్నాయి. మనదేశంలో ఎమర్జెన్సీగా ఆసుపత్రుల్లో చేరిన కేసుల్లో బ్రెయిన్ అనూరిజం రోగులు కూడా అధికంగా ఉంటున్నారు. అధిక కొలెస్ట్రాల్, డయాబెటిస్,అధిక రక్తపోటు వంటి సాధారణ పదం బ్రెయిన్ అనూరిజం కాకపోవచ్చు,కానీ ఎక్కువ మందిలోనే దీని లక్షణాలు కనిపిస్తాయి. చాలా మంది హాలీవుడ్ నటీనటులు ఈ వ్యాధి బారిన పడి బయటపడిన వారే.
న్యూరాలజీ ఇండియా పబ్లికేషన్లో ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం... భారతదేశంలో దీని గణాంకాలు దారుణంగా ఉన్నాయి. మనదేశంలో దీని బారినపడిన వారిలో 40 శాతం మందికి ప్రాణాంతక పరిస్థితులు ఎదురయ్యాయి. నిజానికి ఇది సాధారణ వ్యాధే. కానీ సరైన చికిత్స తీసుకోకపోవడం, సకాలంలో స్పందించకపోవడం వల్ల ప్రాణాంతకంగా మారిపోతోంది. ప్రస్తుతం మనదేశంలో ప్రతి వందమందిలో ఒకరికి బ్రెయిన్ అనూరిజం వస్తోంది.
ఏంటి ఈ వ్యాధి?
అనూరిజం అనేది మెదడులోని రక్తనాళంలో వాపు రావడం. రక్తనాళంలో బెలూన్ లేదా బుడగను ఏర్పరస్తుంది. ఇది పగలకముందే చికిత్స ఆరంభించాలి. ఇది బాగా పెరిగి పగిలితే రక్తనాళాలు చిట్లి రక్తస్రావం అవుతుంది. అప్పుడు పరిస్థితి చేయిదాటి పోయి ప్రాణాంతకంగా మారుతుంది. ఇలా బుడగ పగిలి పేలినప్పుడే చాలా మంది కుప్పకూలి చనిపోతారు. టీ తాగుతున్నప్పుడు, పేపర్ చదువుతున్నప్పుడు, నిద్రపోతున్నప్పుడు ఎప్పుడైనా కూడా ఇది జరగవచ్చు. బుడగ పేలాక కూడా కొంత మంది రోగులు సకాలంలో ఆసుపత్రిలో చేరినప్పటికీ కోమాలోకి వెళ్లడం, పక్షవాతం బారిన పడం, వెంటిలేటర్ పై ఉండడం జరగవచ్చు. బుడక పేలాక ఆకస్మిక మరణం సంభవించడమే అధికంగా జరుగుతుంది.
లక్షణాలు...
బ్రెయిన్ అనూరిజం ఉన్నప్పుడు కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. ముఖ్యంగా తీవ్రమైన తలనొప్పి, వికారం, మెడ భాగంలో గట్టిగా మారడం, చూపు మసకబారడం, వెలుగు చూడలేకపోవడం, కళ్ల వెనుక నొప్పి పెట్టం, గందరగోళంగా అనిపించడం, స్పృహ కోల్పోవడం వంటి సమస్యలు కలుగుతాయి.వీటిని నిర్లక్ష్యం చేయకూడదు ఏ లక్షణమైనా మూడు రోజులకు మించి ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. ముఖ్యంగా తలనొప్పి అనేది శరీరం మనకు ఇచ్చే ఓ హెచ్చరిక. రోజులో ఎక్కువ సమయం తలనొప్పిగా ఉంటే నిర్లక్ష్యం చేయవద్దు. మనదేశంలో ఏటా 76,500 నుంచి 204,100 వరకు అనూరిజం కేసులు బయటపడుతున్నాయి. సకాలంలో మెదడు స్క్రీనింగ్ చేయడం వల్ల చాలా మంది ప్రాణనష్టాన్ని నివారించవచ్చు.
Also read: చామదుంపలో ఉండే ఈ గుణం గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటుంది
Also read: నీరు కాదు విషం, భూగర్భజలాల్లో ప్రమాదకర లోహాలు ఉన్నాయని చెబుతున్న ప్రభుత్వ డేటా, ఇలా తాగితే సేఫ్
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.