Papaya in Summer: వేసవిలో బెస్ట్ ఫ్రూట్ ఇదే - బొప్పాయిలో ఇన్ని ప్రయోజనాలను మీరు ఊహించి ఉండరు
ఈ వేసవిలో ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా హాయిగా గడిపేయాలని అనుకుంటున్నారా? అయితే, బొప్పాయి తినండి. దీనివల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు.
వేసవిలో ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా శరీరానికి వేడి చేసే ఆహారాన్ని అస్సలు ముట్టకూడదు. వీలైనంత వరకు శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచే పండ్లు, పదార్థాలు తీసుకోవాలి. ఈ సీజన్‌లో పుచ్చకాయతో బోలెడన్ని ప్రయోజనాలు లభిస్తాయి. అయితే, దీన్ని డయాబెటిస్ బాధితులు ఎక్కువగా తినకూడదు. అందుకే అందరూ తినగలిగే ‘బొప్పాయి’నే తీసుకోవడం బెటర్. దీనివల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరతాయి. మరి, బొప్పాయితో మీకు ఎలాంటి మేలు కలుగుతుందో చూసేయండి మరి.
బొప్పాయి రుచితోపాటు ఎన్నో పోషకాలను అందిస్తుంది. ఇందులో ఫైబర్, లైకోపీన్, విటమిన్లు ఎ, ఇ, సి, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, భాస్వరం వంటి ఖనిజాలు ఉంటాయి. అందుకే, సమతుల్య ఆహారంలో బొప్పాయిని కూడా చేర్చాలని ఆహార నిపుణులు తెలుపుతున్నారు. బొప్పాయి ఆకులను టీగా చేసుకుని తాగవచ్చని చెబుతున్నారు. బొప్పాయి విత్తనాలు సైతం వివిధ వ్యాధులు, సూక్ష్మజీవులను చంపే చికిత్సలో ఉపయోగిస్తారని చెబుతున్నారు.
⦿ బొప్పాయి జీర్ణక్రియను సులభతరం చేస్తుంది.
⦿ పేగులను శుభ్రంగా ఉంచుతుంది.
⦿ బొప్పాయి చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది.
⦿ కాలేయంలోని విషతుల్య పదార్థాలను బొప్పాయి నివారిస్తుంది.
⦿ బొప్పాయి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది.
⦿ అల్జీమర్స్, పార్కిన్సన్, చిత్తవైకల్యం(జ్ఞాపకశక్తి కోల్పోవడం) వంటి మెదడు, నాడీ సంబంధిత సమస్యలను నివారిస్తుంది.
⦿ డయాబెటిస్‌ను నివారించడంలో సహాయపడుతుంది.
⦿ బొప్పాయిలోని బీటా కెరోటిన్ వేసవిలో కళ్ళపై పడే ఒత్తిడి, మంటను తగ్గిస్తుంది.
⦿ బొప్పాయిలోని యాంటీ ఆక్సిడెంట్లు మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.
⦿ బొప్పాయిలో నీటి శాతం కూడా ఎక్కువే. కాబట్టి, వేసవిలో మిమ్మల్ని డీహైడ్రేషన్‌కు గురికాకుండా కాపాడుతుంది.
⦿ వేసవిలో బొప్పాయిని తినడం వల్ల శరీరానికి చలువ చేస్తుంది.
బొప్పాయి రోజూ తినొచ్చా?: బొప్పాయి ఈ పండ్లలో ఉండే ‘పాపైన్’ కొందరికి అలర్జీలను కలిగిస్తుంది. ఆ సమస్య లేకపోతే, ప్రతిరోజూ బొప్పాయిని తీసుకోడానికి ఆలోచించకక్కర్లేదు. అయితే బొప్పాయి అతిగా తింటే బరువు కూడా పెరుగుతారు. పేగులను సాఫీగా ఉంచడం వల్ల విరేచనాలకు కూడా కారణమవుతుంది. కాబట్టి, బొప్పాయిని ఉద్యమంలా బోలెడన్ని ముక్కలు తినకుండా.. రోజుకు రెండు, మూడు ముక్కల చొప్పున తీసుకోవడం శ్రేయస్కరం.
గమనిక: ఈ కథనాన్ని కేవలం మీ అవగామన కోసమే అందించాం. ఇది వైద్యానికి ప్రత్యామ్నాయం కాదు. కొన్ని పండ్లు, ఆహారాలు కొందరికి అలెర్జీలు కలిగిస్తాయి. కాబట్టి, వైద్యులు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాత దీన్ని డైట్‌లో చేర్చుకోవాలి. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ బాధ్యత వహించదని గమనించగలరు.