Paratha Recipe: పనీర్-బఠానీ పరాటా, పిల్లలకు నచ్చే బ్రేక్‌ఫాస్ట్
Paratha Recipe: పిల్లలకు సులువుగా, టేస్టీ ఉండే బ్రేక్‌ఫాస్ట్ కోసం చూస్తున్నారా? అయితే మీకు ఇది బెస్ట్ ఆప్షన్.
Paratha Recipe: చపాతీలు అందరి ఇళ్లలో చేసుకుంటారు.ఇక పరాటాలు మాత్రం చాలా తక్కువ ఇళ్లల్లోనే చేసుకుంటారు. అవి చేయకుండా కష్టం అనుకుంటారు కానీ నిజానికి చాలా సులువు. చపాతీ కన్నా పరాటా ద్వారానే అనేక రకాల పోషకాలు అందుతాయి. అలా అందేలా మనం పరాటాని నచ్చినట్టు వండుకోవచ్చు. ఇక్కడ ఇచ్చిన రెసిపీ పనీర్ - బఠాణీ పరాటా. దీనిలో ఆరోగ్యకరమైన ఎన్నో పదార్థాలు ఉన్నాయి. పనీర్, పచ్చిబఠాణీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పిల్లలకు తినిపించడం వల్ల వారికి తగినంత శక్తి అందుతుంది.
కావాల్సిన పదార్థాలు
గోధుమ పిండి - ఒక కప్పు
పనీర్ ముక్కలు - రెండు కప్పులు
పచ్చిబఠానీలు - రెండు కప్పులు
పచ్చిమిర్చి - మూడు
గరం మసాలా - అరస్పూను
జీలకర్ర పొడి - అరస్పూను
కారం - అర స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - తగినంత
కొత్తిమీర తరుగు- రెండు స్పూన్లు
తయారీ ఇలా
1. మెత్తని చపాతీలను పిల్లలు ఇష్టంగా తింటారు. వాటిని మరింత పోషకాహారంగా మారిస్తే చాలా మంచిది.
2. గోధుమపిండిని ఎప్పటిలాగే చపాతీ ముద్దలా కలుపుకోవాలి. కలిపి ఒక గిన్నెలో వేసి మూత పెట్టి పదినిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ముద్ద కలిపేటప్పుడు కాస్త నూనె వేసి కలిపితే మెత్తగా వచ్చాయి.
3. ఇప్పుడు ఉడకబెట్టిన పచ్చి బఠాణీలు, పనీర్ ముక్కలు, కొత్తిమీర తరుగు పచ్చిమిర్చి తరుగు, జీలకర్ర పొడి, గరం మసాలా, కారం, ఉప్పు అన్నీ వేసి బాగా కలపాలి. పనీర్ ని, బఠాణీలను చేత్తో నొక్కి మెత్తటి ముద్దలా చేయాలి.
4. ఇప్పుడు చపాతీ ముద్దని తీసుకుని చిన్న పూరీలా ఒత్తి దాని మధ్యలో బఠాణీ-పనీర్ మిశ్రమాన్ని పెట్టి మడతబెట్టేయాలి.
5. దాన్ని గుండ్రంగా ఒత్తుకుని పెనంపై రెండు వైపులా కాల్చుకోవాలి.
ఇందులో వాడిన పనీర్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇది రొమ్ము క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటుంది. గుండెకు ఎంతో మేలు చేస్తుంది. మధుమేహం ఉన్న వారు దీన్ని తినడం వల్ల రక్తంలోని చక్కెర స్థాయిలను కంట్రోల్ చేస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఎముకలకు బలాన్ని అందిస్తుంది. ప్రొటీన్లు కూడా పుష్కలంగా ఉంటాయి. శాకాహారులకు ప్రొటీన్లను అందించే ఉత్తమ ఆహారం ఇది.
ఇక పచ్చిబఠాణీల్లో విటమిన్ ఎ, సి, ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉంటాయి. వీటని తినడం వల్ల పిల్లలకు కావాల్సినంత శక్తి అందుతుంది. బరువు తగ్గడం నుంచి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించడం వరకు ఇది ఎంతో ప్రయోజనకరంగా పనిచేస్తుంది. శరీరంలో ఐరన్ లోపం ఉన్నవారికి గ్రీన్ పీస్ వల్ల ఆ సమస్య దూరమవుతుంది. వీటిలో ఉండే విటమిన్ సి వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీనివల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది.
Also read: రాత్రి ఆలస్యంగా నిద్రపోయేవారికి అలెర్ట్, ఈ జబ్బులు అతి త్వరగా వచ్చే అవకాశం
Also read: బంగాళాదుంపలు తొక్క తీసి వండడం వల్ల ఆరోగ్యానికి ఎంతో నష్టం, ఈ లాభాలన్నీ కోల్పోవాల్సిందే