Sankranthi 2023: సంక్రాంతి రోజు వీటిని కచ్చితంగా తినాల్సిందే - తింటేనే పండుగ చేసుకున్నట్టు
సంక్రాంతి పండుగ అంటేనే స్పెషల్. ఆ రోజు ప్రత్యేక వంటకాలు ఉండాల్సిందే.
కొత్త సంవత్సరానికి స్వాగతం పలికిన కొన్ని రోజులకే వచ్చేస్తుంది పెద్ద పండుగ సంక్రాంతి. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు చాలా రాష్ట్రాల్లో ఈ పండుగ వైభవంగా జరుగుతుంది. శీతాకాలపు ఆకాశాన్ని రంగురంగుల గాలిపటాలతో నింపే వేడుక మకర సంక్రాంతి. ఈ పండుగ ప్రాంతీయ వంటకాల సమ్మేళనంతో నిండిపోతుంది. ప్రతి రాష్ట్రంలోనూ ఈ పండగకు కొన్ని ప్రత్యేక వంటకాలు ఉన్నాయి.ఆంధ్రప్రదేశ్లో అరిసెలు, పాకుండలు, పొంగనాలు, బూరెలు ఎంత ప్రత్యేకమో... మిగతా రాష్ట్రాల్లో కూడా ఆ రోజున ఖచ్చితంగా తినే కొన్ని వంటకాలు ఉన్నాయి. ఈ వంటకాలు తింటేనే వారికి సంక్రాంతి వేడుక చేసుకున్నట్టు. ఆ ప్రత్యేక వంటకాలు ఏంటో చూద్దాం.
మకర చౌల
ఒరిస్సాలో మకర సంక్రాంతికి ఖచ్చితంగా ప్రతి ఇంట్లో ఉండే వంటకం. మకర చౌల అనేది ఒక స్వీటు. తాజా బియ్యం, బెల్లం, పాలు, అరటిపండు, చెరుకు రసం, యాలకుల పొడి కలిపి చేసే ఒక తీయని పదార్థం ఇది. దీని వాసనకే నోరూరిపోతుంది. ఒడిశాలో సంక్రాంతి రోజున ప్రతి ఇంట్లో మకరచౌల ఘుమఘుమలాడుతుంది.
పిన్ని
పిన్ని స్వీట్ కు పంజాబీ ఇల్లు పెట్టింది. చలికాలంలో ప్రతి పంజాబీ కుటుంబం పిన్ని స్వీట్ ను కచ్చితంగా తింటుంది. ఇది రుచికరమైనదే కాదు, ఆరోగ్యకరమైనది కూడా. శరీరానికి శీతాకాలంలో ఇది వేడిని అందిస్తుంది. గోధుమ పిండి, బొంబాయి రవ్వ, నట్స్, పంచదార, నెయ్యి వేసి దీన్ని తయారు చేస్తారు.
నువ్వుల లడ్డు
మరాఠాలకు మకర సంక్రాంతి అతి పెద్ద పండుగ. ఆ రోజున నువ్వుల లడ్డు కచ్చితంగా తింటారు. నువ్వులు, బెల్లం కలిపి చేసే ఈ లడ్డూలు శీతాకాలంలో తింటే శరీరంలోని ఉష్ణోగ్రతలు పడిపోకుండా కాపాడతాయి. మహారాష్ట్రలో సంక్రాంతి స్పెషల్ ఈ నువ్వుల లడ్డూ ఉండాల్సిందే.
కిచిడి
కిచిడి సాధారణంగా అందరి ఇళ్ళలో చేసుకునేదే కదా అనుకుంటారు. కానీ బీహార్లో మాత్రం ఇది చాలా స్పెషల్ వంటకం. మకర సంక్రాంతి నాడు బిహారీలు కిచిడీని నెయ్యితో ఉండి వడ్డిస్తారు. ఆ రోజున ప్రతి ఇంట్లో కచ్చితంగా కిచిడి ఉంటుంది.
పాయేష్
బెంగాలీలకు స్వీట్ అంటే ప్రాణం. రసమలై, రసగుల్లాలు వంటివన్నీ వారి స్పెషల్ వంటకాలే. అలాగే పాయేష్... దీన్నే ఖీర్ అని పిలుస్తారు. బెంగాలీలో మకర సంక్రాంతికి కచ్చితంగా చేసే స్వీట్ పాయసం ఇది. వండుతుంటేనే సువాసన వచ్చేస్తుంది. సంక్రాంతి రోజున ఇతర వంటకాలతో పాటు కచ్చితంగా డైనింగ్ టేబుల్ పై పాయేష్ ఉండాల్సిందే.
View this post on Instagram
Also read: మొఘల్ చక్రవర్తులకు ఎండు అల్లం అంటే ఎందుకంత ప్రేమ? ఆయుర్వేదం ఏం చెబుతోంది?