Relationships: నా భార్య ఇంట్లో అలాంటి దుస్తులతో తిరుగుతోంది, నాకు ఏమాత్రం నచ్చడం లేదు
తన భార్య డ్రెస్సింగ్ తనకు నచ్చడం లేదని, ఆమెను ఎలా మార్చాలో చెప్పమని అడుగుతున్నా ఒక భర్త కథనం ఇది.
ప్రశ్న: మాది పెద్దలు కుదర్చిన వివాహం. ఆర్థికంగా, అన్ని రకాలుగా మేము మంచి స్థాయిలోనే ఉన్నాము. నా భార్య కూడా మంచిది. ఇంటి పనులతో పాటు ఉద్యోగమూ చేస్తుంది. ఇద్దరు చక్కటి పిల్లలు ఉన్నారు. అంతా బాగానే ఉంది కానీ ఆమెకున్న ఒక అలవాటు నన్ను మానసిక ఒత్తిడికి గురిచేస్తుంది. ఆమె ఆఫీసు నుంచి ఇంటికి వచ్చాక సాయంత్రం వరకు పద్ధతిగానే ఉంటుంది. ఆ తర్వాత మాత్రం కేవలం లోదుస్తులతోనే ఉంటుంది. ఇంట్లో అలానే తిరుగుతుంది. నాకు అది ఏ మాత్రం నచ్చడం లేదు. ముఖ్యంగా పిల్లల ముందు అలా తిరగడం ఇబ్బందికరంగా ఉంది. నేను ఎన్నోసార్లు చెప్పి చూశాను. కానీ తను మారడం లేదు. తనకు అలానే ఫ్రీగా ఉంటుందని అంటుంది. ఉదయం నుంచి బిగుతుగా ఉండే డ్రెస్సులు వేసుకొని ఉండలేకపోతున్నాను అని చెబుతోంది. కానీ పిల్లల ముందు అలా అరకొర డ్రెస్సులు వేసుకొని తిరుగుతూ ఉంటే వారి ఆలోచన శైలిపై, జీవితంపై ఎలాంటి ప్రభావం పడుతుందో అని నాకు భయంగా ఉంది. ఆమెకు స్వేచ్ఛ అవసరమే... ఒప్పుకుంటాను, కానీ పిల్లల ను కూడా దృష్టిలో పెట్టుకోవాలి కదా, ఆమెను మార్చడం ఎలా?
జవాబు: ఒకరి దుస్తులు వేసుకునే విధానం వారి స్వేచ్ఛకు ప్రతీకగా చెప్పుకుంటారు. నచ్చిన దుస్తులు వేసుకొనే స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి ఉండాలి. ఆ స్వేచ్ఛను వారికి ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. కానీ మీ కేసులో మాత్రం కాస్త భిన్నత్వం ఉంది. ఆమె తన స్వేచ్ఛ మాత్రమే చూసుకుంటుంది. పిల్లల ఆలోచన తీరు ఎలా మారుతుందో అన్నది ఆమె అర్థం చేసుకోవడం లేదు. మీది ఉన్నత స్థాయి కుటుంబమే అని చెబుతున్నారు. కాబట్టి ఇంట్లో ఏసీలు వంటివి ఉండే అవకాశం ఉంది, ఉదయం ఎంత బిగుతైన డ్రెస్సులు వేసుకున్నా ఇంటికి వచ్చాక ఏసీలు వేసుకుని సేదతీరవచ్చు. చెమట పట్టే అవకాశం ఉండదు. ఇంట్లో వదులుగా ఉండే వస్త్రాలు వేసుకొని తిరగమని చెప్పండి.
అలాగే పిల్లలు గురించి కూడా ఆలోచించమని చెప్పండి. వారి ముందు ఎంత పద్ధతిగా ఉంటే వారు కూడా అంతే పద్ధతిగా పెరిగే అవకాశం ఉందని వివరించండి. తల్లిదండ్రులు చేసే ప్రతి పనిని పిల్లలు గమనిస్తారు. వారు గమనిస్తున్న సంగతి మనం కూడా గుర్తించలేం. కాబట్టి ఇంట్లో మనం చేసే ప్రతి పనిని జాగ్రత్తగా చేయాల్సిన అవసరం ఉంది. ఈ విషయాన్ని ఆమెకు అర్థమయ్యేలా చెప్పండి. ఆమె స్వేచ్ఛకు భంగం కలిగించకుండానే ఆమె మారేలా మీరే చేయాలి. లోదుస్తులతో కాకుండా వదులుగా ఉండే దుస్తులు వేసుకోమని సలహా ఇవ్వండి. ముఖ్యంగా మీ పిల్లల్లో ఆడపిల్లలు ఉంటే వారు కూడా పెద్దయ్యాక ఇలానే ప్రవర్తించే అవకాశం ఉంది. ఆ విషయాన్ని ఆమెకు అర్థమయ్యేలా చెప్పండి. ఇంటికి ఎవరైనా హఠాత్తుగా వస్తే పరువు పోతుందని వివరించండి. ఉద్యోగం చేసి వచ్చాక కాస్త రిలాక్స్ అవ్వమని చెప్పండి, లేదా ఆమెకు మీరు ఇంటి పనుల్లో సహాయం చేయండి. ఆమెను ప్రేమతోనే మీ మాట వినేలా చేయాలి. కోపంతోనో, పంతంతోనో చేస్తే ఆమె మారదు.
Also read: పీతలు ఇప్పుడు తింటున్నాం కానీ ఒకప్పుడు పొలాలకు ఎరువుగా వాడేవారు, ఎందుకో తెలుసా?
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.