పీతలు ఇప్పుడు తింటున్నాం కానీ ఒకప్పుడు పొలాలకు ఎరువుగా వాడేవారు, ఎందుకో తెలుసా?
ఇప్పుడు పీతలు ఖరీదైన ఆహారం. ఒకప్పుడు వాటిని పొలంలో చల్లేవారు.
ఇప్పుడు ప్రపంచంలో పీతలు చాలా ఖరీదైన ఆహారం భావిస్తారు. విలాసవంతమైన భోజనంలో ఇది కూడా ఒక భాగంగా మారిపోయింది. పీతల కూర రుచి అద్భుతంగా ఉంటుంది. అందుకే వీటిని తినే వారి సంఖ్య అధికంగా ఉంది. ఇప్పుడు వీటిని ఖరీదైన భోజనంలో భాగంగా చూస్తున్నారు, కానీ ఒకప్పుడు వీటిని పొలాలకు ఎరువుగా వాడేవారు.
పీతలను ఎరువుగా ఉపయోగించాలనే ఆలోచన న్యూ ఇంగ్లాండు తీరంలో నివసించిన ప్రాచీన ప్రజలకు వచ్చింది. ఈ ప్రజలు సముద్రం నుండి పీతలను పట్టి తమ పంటలకు సహజ ఎరువుగా ఉపయోగించేవారు. ఎందుకంటే పీతల్లో నత్రజని పుష్కలంగా ఉంటుంది. ఈ నత్రజని మొక్కలకు చాలా అవసరం. అందుకే పీతలను నేరుగా అలా పొలంలో చల్లడం లేదా వాటిని కుళ్లబెట్టి పొలంలో చల్లడం వంటివి చేసేవారు. అమెరికాలోని వలస రాజ్యాలు ఉన్న కాలంలో పీతలు సమృద్ధిగా ఉండేవి. దీంతో వాటి ధరలు చాలా తక్కువగా ఉండేవి. ఆ పీతలను పేదలు మాత్రం తినేవారు. ధనవంతులు వాటిని అసహ్యించుకునేవారు. జైల్లో ఉన్న ఖైదీలకు పీతలను ఆహారంగా ఇచ్చేవారు. అంతగా పీతలు లభించేవి. అందుకే వాటిని ఎరువుగా వాడేవారు.
రైతులు ఎండ్రకాయలను సేకరించి వాటిని కుప్పలుగా పోసేవారు. అవి మరణించి, కుళ్లిపోయే దశలో పొలంలో వేసేవారు. వాటిలోని నత్రజని భూమిలోని పోషకాలను సుసంపన్నం చేసేది. పంట దిగుబడి కూడా ఎక్కువగా వచ్చేది. దీంతో పీతలను ఎరువుగా ఉపయోగించే పద్ధతి చాలా ఏళ్ల పాటు కొనసాగింది. పీతలు లభించడం తక్కువగా మారాక ప్రజలు వాటిని ఎరువుగా వాడడం మానేసి ఆహారంగా తినడం మొదలుపెట్టారు. అవి దొరకడం కష్టంగా మారడంతో వాటి విలువను కూడా పెరిగిపోయింది. పీతల రుచి ధనవంతులకు కూడా నచ్చడంతో వారి విలాసవంతమైన భోజనంలో ఇది భాగంగా మారింది.
నేటి కాలంలో పీతలను ఎరువుగా వాడడం చాలా అరుదుగా కనిపిస్తుంది. కృత్రిమంగా తయారు చేసే ఎరువులతో పోలిస్తే పీతలను ఎరువుగా వాడడం చాలా మంచి పద్ధతి. ఇది పర్యావరణం పై ఎలాంటి హానికరమైన ప్రభావాలను చూపించదు. పీతలు సముద్రపు ఆహారం నుంచి మిగిలే వ్యర్ధాలు వంటివి ఎరువుగా ఉపయోగించవచ్చు. పంటల దిగుబడి కూడా పెరుగుతుంది.
పీతలు తినడం వల్ల ఆరోగ్యానికి కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. వీటిలో విటమిన్ బి12, ఫోలేట్, ఇనుము, సెలీనియం, నియాసిన్, జియాంక్సంతిన్ వంటి పోషకాలు ఉన్నాయి. పీతలు ప్రొటీన్ తో నిండి ఉంటుంది. ఇది కండర నిర్మాణానికి సహకరిస్తాయి. వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల గుండెకు ఎంతో మేలు జరుగుతుంది.
Also read: కేవలం వేసవిలోనే ఈ పండు లభిస్తుంది, కనిపిస్తే కచ్చితంగా తినాల్సిందే
Also read: హైబీపీ బారిన పడకుండా ఉండాలంటే చేయాల్సిన పనులు ఇవే
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.