Mutton Pickel: మటన్ నిల్వ పచ్చడి, ఇలా చేస్తే ఆరునెలలైనా తాజాగా ఉంటుంది
మటన్ పచ్చడి తినే కొద్దీ తినాలనిపిస్తుంది. వేడి వేడి అన్నంతో తింటే ఆ రుచే వేరు.
నాన్‌వెజ్ ప్రియులకు చాలా ఇష్టమైన పచ్చళ్లు మటన్, చికెన్ నిల్వ పచ్చళ్లు. ఇప్పుడు మనం మటన్ నిల్వ పచ్చడి ఎలా చేయాలో తెలుసుకుందాం. మటన్ కర్రీ వండడం కన్నా మటన్ నిల్వ పచ్చడి చేయడమే సులువు. దీన్ని కేవలం అరగంటలో రెడీ చేసేయచ్చు. దీని రుచి కూడా అదిరిపోతుంది. ఇందులో మనం ఎముకల్లేని మటన్ ఉపయోగిస్తాం. కాబట్టి చక్కగా తినేయచ్చు.
కావాల్సిన పదార్థాలు
బోన్‌లెస్ మటన్ - అరకిలో
కారం - పావు కప్పు
అల్లం వెల్లుల్లి పేస్టు - అయిదు స్పూనులు
నూనె - పావు లీటరు
ఉప్పు - రుచికి సరిపడా
నిమ్మరసం - అయిదు స్పూనులు
గరం మసాలా - ఒక స్పూను
తయారీ ఇలా...
1. మటన్ శుభ్రంగా కడిగి తడి లేకుండా ముక్కలు విడివిడిగా ఆరబెట్టుకోవాలి. నీళ్లు ఉండనివ్వకూడదు. వీలైతే ముక్కలని పరిశుభ్రమైన వస్త్రంతో తుడిచేయాలి.
2. కళాయిలో నూనె వేసి మటన్ ముక్కలు వేయించాలి.
3. చిన్న మంట మీద వేయిస్తే చాలా సేపటికి మటన్ ముక్కలు ఉడుకుతాయి. సాధారణంగానే మటన్ ఉడకటానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది.
4. మటన్ ముక్కలు ఉడికాయని నిర్ధారించుకున్నాక వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి.
5. కళాయిలో ఉన్న మిగిలిన నూనెలో అల్లం వెల్లుల్లి ముద్ద వేసి వేయించాలి.
6. అల్లం వెల్లుల్లి ముద్ద వేగాక కారం, కాస్త గరం మసాలా, ఉప్పు వేసి వేయించాలి.
7. అన్నీ వేగాక స్టవ్ కట్టేసి మటన్ ముక్కలు అందులో వేసి కలపాలి.
8. మిశ్రమం చల్లారాక నిమ్మరసం కలపాలి.
9. అంతే మటన్ నిల్వ పచ్చడి రెడీ అయినట్టే.
దీన్ని గాలి చొరబడని సీసాల్లో వేసి దాస్తే ఆరునెలల వరకు తాజాగా ఉంటుంది.
మటన్ లో అధికంగా పోషకాలు లభిస్తాయి. అందుకే వారానికోసారైనా మటన్ తినడం చాలా అవసరం. ఇందులో బి1, బి2, బి3, బి9, బి12, అలాగే విటమిన్ కె, మాంగనీసు, కాల్షియం, జింక్, ఫాస్పరస్, సెలీనియం, సోడియం, పొటాషియం, ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, ఒమేగా 6 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా లభిస్తాయి. మటన్ తినడం వల్ల ఎర్ర రక్త కణాల ఉత్పత్తి పెరుగుతుంది. అంతేకాదు దెబ్బతిన్న కణాలు త్వరగా బాగవుతాయి. గర్భిణీలు మటన్ తినడం వల్ల పుట్టబోయే పిల్లల్లో నరాల అనారోగ్యాలు రాకుండా ఉంటాయి. రక్తపోటు అదుపులో ఉండడం, స్ట్రోకు అడ్డుకోవడం, మూత్రపిండాల సమస్యలు రాకుండా అడ్డుకోవడం వంటివి మటన్లోని పోషకాల వల్ల జరుగుతుంది.
Also read: పిల్లల కోసం మ్యాగీని ఇలా వండి హెల్తీ మీల్‌గా మార్చేయండి
Also read: మూడ్ బాగోలేదా? వెంటనే ఓ చాక్లెట్ ముక్కను నోట్లో వేసుకోండి