Mutton: మటన్ బోన్ సూప్, వారానికోసారైనా తినాల్సిందే
నాన్ వెజ్ ప్రియులు కచ్చితంగా తినాల్సిన రెసిపీ ఇది. దీంతో శరీరం శక్తిమంతంగా తయారవుతుంది.
మటన్ బోన్ సూప్ ఆరోగ్యానికి ఎంతో మంచిది. దీన్ని వారానికోసారైనా తింటే ఆరోగ్యానికి మేలు. ఈ సూప్ తినడం వల్ల ఎముకలు, దంతాలు బలంగా మారుతాయి. రోగనిరోధక శక్తిని పెంచడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. శరీరంలో హానికరమైన టాక్సిన్లను ఇది బయటికి పంపి అవయవాల పనితీరును మెరుగుపడేలా చేస్తుంది. మానసిక ఆందోళలనకు చెక్ పెడుతుంది. అందానికి కూడా ఇది ఎంతో మేలు చేస్తుంది. జుట్టు, చర్మం మెరిసేలా చేస్తుంది. గోళ్లు ఆరోగ్యంగా ఎదుగేందుకు సహకరిస్తుంది. సీజన్ మారినప్పుడు వర్షాకాలంలో, శీతాకాలంలో ఈ సూప్ ను గోరువెచ్చగా తాగడం వల్ల దగ్గు, జలుబు, గొంతులో ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు తగ్గుతాయి.
కావాల్సిన పదార్థాలు
మటన్ బోన్స్ - అరకిలో
ఉల్లిపాయలు - రెండు
పచ్చిమిర్చి - మూడు
టమాటోలు - రెండు
పసుపు - అర స్పూను
కారం - ఒక స్పూను
ధనియాల పొడి - అర స్పూను
జీలకర్ర పొడి - అర స్పూను
అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక స్పూను
కొత్తిమీర తరుగు - మూడు స్పూనులు
పుదీనా తరుగు - మూడు స్పూనులు
జొన్న పిండి - రెండు స్పూనులు
మిరియాల పొడి - అరస్పూను
ఉల్లికాడల తరుగు - రెండు స్పూనులు
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - ఒక టీస్పూను
బిర్యానీ ఆకు - రెండు
లవంగాలు - అయిదు
దాల్చిన చెక్క - ఒకటి
షాజీరా - ఒక స్పూను
మిరియాలు - పది
తయారీ ఇలా...
1. స్టవ్ పై కుక్కర్ పెట్టి నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడెక్కాక బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చినచెక్క, షాజీరా, మిరియాలు వేసి వేయించాలి.
2. నిలువుగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేయించాలి. ఇవి వేగాక మటన్ బోన్స్ వేసి బాగా కలిపి మూత పెట్టాలి. ఇలా చేయడం వల్ల మసాలా దినుసుల ఫ్లేవర్ ఎముకలకు పడుతుంది.
3. అయిదు నిమిషాల తరువాత అందులో అల్లం వెల్లుల్లి పేస్టు వేసి నిమిషం పాటు వేయించాలి.
4. టమాటో ముక్కలు వేసి మెత్తగా అయ్యేవరకు వేయించాలి. అవి మెత్తగా అయ్యాక కారం, ఉప్పు, ధనియాల పొడి, పుదీనా తరుగు, కొత్తి మీర తరుగు కూడా వేసి కలపాలి.
5. అన్నింటినీ బాగా కలిపి నీళ్లు పోయాలి. కుక్కర్ మీద మూత పెట్టి అయిదు విజిల్స్ దాకా ఉంచాలి.
6. మరోపక్క గిన్నెలో జొన్న పిండి వేసి నీళ్లు పోస్తూ ఉండల్లేకుండా కలుపుకోవాలి.
7. ఇప్పుడు కుక్కర్ మూత తీసి మళ్లీ స్టవ్ మీద పెట్టాలి. అందులో కలుపుకున్న జొన్నపిండిని వేసి బాగా కలపాలి.
8. మిరియాల పొడి కూడా వేసి బాగా కలపాలి. చివర్లో ఉల్లికాడల తరుగుతో గార్నిష్ చేసి స్టవ్ కట్టేయాలి.
9. దీని టేస్టు చాలా బావుంటుంది. నాన్ వెజ్ ప్రియులకు చాలా నచ్చుతుంది.
Also read: పెళ్లితో ఆయుష్షు పెరుగుతుంది, తేల్చిన కొత్త అధ్యయనం
Also read: జొన్న దోశెల రెసిపీ, మధుమేహులకు ఉత్తమ బ్రేక్‌ఫాస్ట్