Jonna Dosa: జొన్న దోశెల రెసిపీ, మధుమేహులకు ఉత్తమ బ్రేక్‌ఫాస్ట్
జొన్నలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. కానీ వాటిని తినేవాళ్లు తగ్గిపోయారు.
చిరు ధాన్యాల్లో జొన్నలు ముఖ్యమైనవి. పూర్వం జొన్నలనే ప్రధాన ఆహారంగా తినేవారు. కాలం గడిచేకొద్దీ వాటి వాడకం తగ్గిపోయింది. పూర్తిగా తెల్ల అన్నానికి అలవాటు పడ్డారు. బియ్యంతో పోలిస్తే జొన్నల్లోనే చాలా పోషకాలు లభిస్తాయి. వీటితో జొన్నన్నం మాత్రమే చేసుకోగలమేమో అనుకుంటారు చాలా మంది. ఆ అన్నం చప్పగా, గట్టిగా ఉంటుంది కాబట్టి తినలేక మానేస్తున్నారు. జొన్నలతో టేస్టీ వంటకాలు చాలా చేసుకోవచ్చు. ముఖ్యంగా జొన్న దోశెలు రుచిగా ఉంటాయి. ఇవి డయాబెటిక్ రోగులుకు ఉత్తమమైనవి.
కావాల్సిన పదార్థాలు
జొన్న పిండి – మూడు కప్పులు
అటుకులు – పావు కప్పు
మినప పప్పు – ఒక కప్పు
మెంతులు – ఒక టీ స్పూన్
నూనె – పావు కప్పు
ఉప్పు – తగినంత
తయారీ ఇలా...
1. మినపప్పు, మెంతులు కలిపి ముందుగా నానబెట్టుకోవాలి. దాదాపు నాలుగ్గంటల పాటూ నానితేనే అవి మెత్తగా అవుతాయి.
2. అటుకులు కూడా వండడానికి ఒక అరగంట ముందు నానబెటితే చాలు.
3. అన్ని బాగా నానిన తరువాత మినపప్పు, మెంతులు, అటుకులు వేసి కాస్త ఉప్పు చేర్చి మెత్తగా రుబ్బుకోవాలి.
4. ఆ రుబ్బులో జొన్నపిండిని కూడా కలిపి కాస్త నీళ్లను పోసి బాగా కలపాలి.
5. అలా కలిపాక ఓ పది గంటల పాటూ పులియ బెట్టాలి. పులిసిన రుబ్బు మరింత ఆరోగ్యం.
6. గరిటెతో బాగా కలిపి పెనంపై దోశెల్లా పోసుకోవాలి. పల్చటి దోశెల్లా వేసుకుంటే రుచిగా ఉంటాయి.
7. ఈ దోశెలను కొబ్బరి చట్నీ, వేరుశెనగ పలుకుల చట్నీతో తింటే చాలా రుచిగా ఉంటుంది.
మధుమేహులకు...
మధుమేహ రోగులకు ఈ జొన్న దోశెలు ఎంతో మేలు చేస్తాయి. జొన్న పిండిలో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇవి తిన్నాక చాలా నెమ్మదిగా అరుగుతాయి. కాబట్టి రక్తంలో ఒకేసారి గ్లూకోజ్ స్థాయిలు పెరిగే అవకాశం ఉండదు. కాబట్టి జొన్న దోశెలను తరచూ తింటే మరీ మంచిది. ఇందులో ప్రొటీన్ కూడా ఉంటుంది. ఇది శరీరానికి శక్తినిస్తుంది. జొన్నలు ఫ్రీ రాడికల్స్‌తో పోరాడతాయి. జొన్నల్లో యాంటీ క్యాన్సర్ లక్షణాలు అధికంగా. రోగినిరోధక శక్తికి కూడా పెంచుతుంది. ఇందులో మెగ్నీషియం, కాల్షియం, కాపర్, ఐరన్ అధికంగా లభవిస్తాయి. ఇందులో ఉండే ఐరన్ రక్తంలో హిమోగ్లోబిన్ ఉత్పత్తికి సహకరిస్తుంది. ఇందులో ఉండే మినపప్పు వల్ల కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు.
Also read: ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త పడండి, గుండె పోటు వచ్చే అవకాశం ఉందని అర్థం
Also read: వేల ఏళ్ల క్రితం నదిలో మునిగిన ఊరు, ఇప్పుడు బయటపడింది