Marriage: పెళ్లితో ఆయుష్షు పెరుగుతుంది, తేల్చిన కొత్త అధ్యయనం
పెళ్లి చేసుకుంటే ఆయుష్షు పెరగుతుందని చెబుతోంది ఓ కొత్త పరిశోధన.
వైవాహిక స్థితి వ్యక్తుల ఆయుష్షుపై ప్రభావం చూపిస్తుందని ఒక కొత్త అధ్యయనం తేల్చింది. ఈ అధ్యయనం తాలూకు వివరాలు జామా నెట్‌వర్క్ ఓపెన్ జర్నల్‌లో ప్రచురించారు. ఈ అధ్యయనం ప్రకారం పెళ్లి కాని వారితో పోలిస్తే వివాహితులు ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉంది. అవివాహితులు వివిధ కారణాల వల్ల పెళ్లి అయిన వారితో పోలిస్తే త్వరగా మరణించే అవకాశం 15 శాతం ఎక్కువ. అంతేకాదు పెళ్లి అయిన వారు ప్రమాదాలు, గాయాలు జరిగినప్పుడు, గుండె జబ్బుల వల్ల మరణించే అవకాశం 20 శాతం తక్కువగా ఉంటుంది. ఈ అధ్యయనాన్ని బట్టి పెళ్లి చేసుకోవడం వల్ల దీర్ఘాయువు కలుగుతుందని అర్థమవుతోంది.
కారణాలు ఎన్నో...
వివాహితుల్లో దీర్ఘాయువు కలగడానికి కారణం ఎన్నో ఉంటాయని చెబుతోంది అధ్యయనం. ఒకరికి ఒకరు తోడుండడం వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపుతుందని, ధైర్యాన్ని కలిగిస్తుందని, అలాగే అనారోగ్య పరిస్థితుల్లో కూడా వారికి అండగా బంధం నిలుస్తుందని... ఇలాంటి కారణాల వల్ల వివాహితులు పెళ్లి కాని వారితో పోలిస్తే మరింత ఆరోగ్యంగా ఉంటారని అధ్యయనం తేల్చింది.అంతేకాదు భార్యభర్తలిద్దరూ ఉద్యోగస్థులు అయినప్పుడు, ఒకరి నుంచి ఒకరికి ఆర్ధిక సాయం అందుతుంది. దీని వల్ల ఆర్ధిక ఒత్తిళ్లు తక్కువగా ఉంటాయి. మంచి ఆర్ధిక పరిస్థితులు, ఆరోగ్యకరమైన జీవనశైలి వివాహం వల్ల కలుగుతుందని జపాన్ నేషనల్ క్యాన్సర్ సెంటర్ పరిశోధకులు తెలిపారు.
2010లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఇదే విషయాన్ని ధ్రువీకరించింది. ఒంటరి వ్యక్తులతో పోలిస్తే వివాహం చేసుకున్నవారిలో నిరాశ, మానసిక ఆందోళన వంటివి త్వరగా కలగవని తేల్చింది. తమకంటూ ఒక వ్యక్తి ఉన్నాడనే భావనే వారిలో కొండంత ధైర్యాన్నిస్తుందని చెబుతోంది అధ్యయనం. వివాహం కాని మగవారు అధికంగా చెడు అలవాట్లకు గురవుతారని, మధ్యపానం, ధూమపానం, అనారోగ్యకరమైన ఆహారం వల్ల ప్రమాదకరమైన సమస్య బారిన పడతారని చెబుతున్నారు. అదే ఒంటరి ఆడవారు ఒంటరితనాన్ని భరించలేక మానసిక ఆందోళనకు గురవుతారని తెలిపారు.
అధ్యయనం ఇలా...
అధ్యయనం కోసం పరిశోధకులు 54 ఏళ్ల వయసున్న 6,23,140 వ్యక్తుల డేటాను పరిశీలించారు. వారి వైవాహిక స్థితిని బట్టి ఆరోగ్యాన్ని అంచనా వేశారు. వారిలో అత్యధికులు 86.4 శాతం మంది వివాహం చేసుకున్నవారు. మిగతా వారంతా ఒంటరి వారే. వారిలో విడాకులు తీసుకున్నవారు, వితంతువులు కూడా ఉన్నారు. పదిహేను సంవత్సరాల పాటూ సాగిన ఈ అధ్యయనంలో మొత్తం 1,23,264 మంది మరణించారు. వీరిలో 41,362 మంది క్యాన్సర్, 14,563 మంది సెరెబ్రోవాస్కులర్ వ్యాధులు, 13,583 మంది శ్వాసకోశ వ్యాధులు కారణంగా మరణించినట్టు గుర్తించారు.
ఈ అధ్యయనంలో పెళ్లి కాని వ్యక్తులు సెరెబ్రోవాస్కులర్ డిసీజ్ తో చనిపోయే అవకాశం 12 శాతం ఎక్కువ. అవివాహితులు గుండెపోటు, గుండెజబ్బులు, గుండె పోటు వంటి సమస్యలతో మరణించే అవకాశం 17 శాతం అధికం. అలాగే ప్రమాదాలు జరగడం వల్ల గాయాలు తగిలి మరణించే అవకాశం 19 శాతం. ప్రమాదాలు జరిగినప్పుడు, గాయాలు తగిలినప్పుడు జాగ్రత్తగా చూసుకునే వ్యక్తుల్లేక, ఆహారం విషయంలో జాగ్రత్త లేక గాయాలు ముదిరి ప్రాణాలు కోల్పోయే అవకాశం పెళ్లి కాని వారిలో ఎక్కువ. అందుకే పెళ్లి చేసుకుంటే దీర్ఘాయువు సిద్ధిస్తుందని చెబుతోంది ఈ అధ్యయనం.