Favourite Smell: ప్రపంచంలో ఎక్కువమంది ఇష్టపడే వాసన ఇదేనట, మీకు కూడా నచ్చుతుందేమో చూడండి
ఎన్నో వాసనలు వీచే ప్రకృతిలో ఎక్కువ మందికే నచ్చే వాసన ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేశారు పరిశోధకులు.
మీకు నచ్చే వాసన ఏది? అని అడిగితే ఒక్కో మనిషికి ఒక్కో వాసనను చెబుతారు. కొంతమందికి మల్లె గుభాళింపు నచ్చుతుంది. మరికొందరికి పైనాపిల్ వాసన ముక్కుపుటాలను అదరగొడుతుంది. మరికొందరికి చికెన్ బిర్యానీ వాసన మత్తెక్కిస్తుంది. మరికొందరికి ఆల్కహాల్ వాసన కూడా నచ్చుతుంది. ఇలా ఒక్కొక్కరికి ఒక్కో వాసన నచ్చే అవకాశం ఉంది. అయితే ప్రపంచంలో ఉన్న అధికశాతం మంది ప్రజలకు ఏది నచ్చుతుంది? అనే అంశంపై సర్వేలు చేశారు ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు.దీని కోసం వివిధ దేశాలు, ప్రాంతాలు, సంస్కృతులకు చెందిన 239 మందిని ఎంపిక చేశారు.వారిలో అమెరికా, మెక్సికో, థాయిలాండ్, ఆసియాలోని అడవుల్లో నివసించే రైతులు, పర్వత ప్రాంతాల్లో నివసించే వారు, పట్టణ ప్రజలు, వేటగాళ్లు, మత్య్సకారులు ఇలా చాలా మంది ఉన్నారు. వారికి అనేక రకాల వాసనలను చూపించారు. చివరికి బావున్న 10 వాసనలను షార్ట్ లిస్టు చేసి అందులో వారికి బాగా నచ్చే వాసనను చెప్పమన్నారు.
ఆ వాసనదే మొదటి స్థానం
షార్ట్ లిస్టు చేసిన పది వాసనల్లో లవంగాలు, పుట్టగొడుగులు, వెనిల్లా ఎక్స్ టాక్ట్, పైనాపిల్, గులాబీ సెంటు, ఎరుపు క్యాప్సికమ్, చెమట పట్టే పాదాలు, కుళ్లిపోతున్న చేపలు, లావెండర్.. ఇలా రకరకాల వాసనలు ఉన్నాయి. వీటన్నింటిలో అధికశాతం మందికి నచ్చిన వాసన వెనిల్లా ఎక్స్‌ట్రాక్ట్. చాలా మంది వెనిల్లా వాసనను ఆస్వాదించారు, బావుందని మళ్లీ మళ్లీ వాసన చూశారు. ఇక రెండో స్థానంలో నిలిచింది, పైనాపిల్ నుంచి వచ్చే వాసన. అది కూడా వారికి నచ్చింది. మూడో స్థానంలో లావెండర్ వాసన, నాలుగో స్థానంలో లవంగాలు, అయిదో స్థానంలో పుట్టగొడుగుల వాసన నిలిచాయి.
రెండో దశలో...
ప్రపంచంలో ఎక్కువ మందికి నచ్చే వాసనను కనిపెట్టిన పరిశోధకులు ఇప్పుడు రెండో దశ అధ్యయనానికి సిద్ధమవుతున్నారు. ఒక నిర్ధిష్టమైన వాసనను చూసినప్పుడు మెదడులో ఏమి జరుగుతుందో తెలుసుకోవడమే రెండో దశ అధ్యయనం. ఈ అధ్యయనంలో ఆ వాసనే ఎందుకు నచ్చుతుందో తెలుసుకోవచ్చని చెబుతున్నారు పరిశోధకుల్లో ఒకరైన అర్షమియన్.
చాలా పవర్‌ఫుల్
మన ముక్కు ఎంత శక్తివంతమైనదంటే దాదాపు పదివేల రకాల వాసనలను గుర్తించగలదు. ప్రతి 30 నుంచి 60 రోజులకు వాసనను గ్రహించే కణాలు కొత్తగా పుడుతుంటాయి. మగవారితో పోలిస్తే ఆడవారికి వాసన చూసే శక్తి అధికమని చెబుతున్నారు పరిశోధకులు. మనతో పోల్చుకుంటే కుక్కల్లో వాసన చూసే శక్తి 44 శాతం అధికంగా ఉంటుంది.
Also read: ఈ అలవాట్లు మిమ్మల్ని అంధులను చేస్తాయి, మానేస్తేనే బెటర్
Also read: సహోద్యోగుల గౌరవాన్ని, స్నేహాన్ని పొందాలా? ఇలా చేస్తే సాధ్యమే