(Source: ECI/ABP News/ABP Majha)
Colleagues: సహోద్యోగుల గౌరవాన్ని, స్నేహాన్ని పొందాలా? ఇలా చేస్తే సాధ్యమే
ఆఫీసులో సహోద్యోగుల ప్రేమను, స్నేహాన్ని,గౌరవాన్ని పొందితే ఉద్యోగ జీవితం ప్రశాంతంగా, ఆనందంగా సాగుతుంది.
పనిచేసే చోట ప్రశాంతంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. అందమైన పరిచయాలు, చక్కటి స్నేహాలు ఉంటు ఉద్యోగ జీవితం హ్యాపీగా సాగిపోతోంది. పనిచేసిన కష్టం కూడా తెలియకుండా రోజులు గడిచిపోతాయి. మీతో సహోద్యోగులంతా మంచిగా, మీకు సహాయం చేసేవారిగా, ప్రేమించేవారిగా ఉండాలంటే కొన్ని మార్గాలు ఉన్నాయి. వాటిని ఫాలో అయితే ఆఫీసు కూడా మీకు ఇంటిని మించిన ఆనందాన్ని ఇస్తుంది.
పలకరింపు
ఆఫీసుకు రాగానే మీ కంటికి కనిపించే వారిని చిరునవ్వుతో పలకరించాలి. చిరునవ్వు గుండెను తాకుతుంది. ఎండార్ఫిన్లు విడుదలవుతాయి. మెదడుకు కూడా హాయిగా అనిపిస్తుంది. అలాగే ఇంటికి వెళుతున్నప్పుడు మీ చుట్టుపక్కల కూర్చున్నవారికి చెప్పి వెళ్లాలి. ఇలా చేస్తే సహోద్యోగులు మిమ్మల్ని ఎక్కువగా గుర్తుంచుకుంటారు.
చిన్న చిన్న చిట్‌చాట్లు
కాఫీ తాగేందుకు వెళ్లినప్పుడు, ఆఫీసు నుంచి బయటికి వెళుతున్నప్పుడు కాసేపు చిట్ చాట్ చేయండి. చిన్న చిన్న విరామాలు తీసుకుని మాట్లాడుకుంటే మీకు, వారికి కూడా రిఫ్రెష్మెంట్ వచ్చినట్టు అవుతుంది. మీకు, మీ సహోద్యోగికి మధ్య ఉన్న కామన్ ఆసక్తులను ఏంటో తెలుసుకుని వాటి గురించి మాట్లాడుకోవాలి. ఇవి మీ మధ్య బంధాన్ని బలోపేతం చేస్తాయి.
వివాదాలకు దూరంగా
వివాదాస్పదమైన విషయాలకు, తీవ్ర వాదనలకు దూరంగా ఉండాలి. అలాంటి పరిస్థితులు వచ్చినా దాటవేత ధోరణిని చూపించడం ఉత్తమం. ముఖ్యంగా ఇతరుల గురించి మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి. మీరే మాట్లాడే విషయాలే మీపై ఒక అభిప్రాయాన్ని ఏర్పడేలా చేస్తాయి.
చూపు ముఖ్యం
మీరు ఏ విషయం మాట్లాడినా సహోద్యోగి కళ్లలోకి నేరుగా చూస్తూ మాట్లాడాలి. అది మీ నిజాయితీని, ధైర్యాన్ని ఎధుటి వారికి కనిపించేలా చేస్తుంది. పక్క చూపులు, నేల చూపులు మీపై అభిప్రాయాన్ని చెడుగా మార్చేస్తాయి.
అంకెలను లెక్కపెట్టండి
ప్రతిచోటా సంతోషాలు, కోపతాపాలు సహజం. మీకు ఆఫీసు అంశాలపై చాలా కోపం వచ్చినప్పుడు దాన్ని ప్రదర్శించకుండా ఉండడమే మంచిది. కంట్రోల్ చేసుకునేందుకు అంకెలను లెక్కపెట్టుకోవడం లేదా మీ ఫోన్లో మీకు కుటుంబసభ్యుల ఫోటోలను చూడడం వంటివి చేయండి. మనసు కొంచెం స్థిమిత పడుతుంది. అంతేకానీ వాదనకు మాత్రం దిగకండి. కోపంలో స్పందించకపోవడం చాలా ఉత్తమం. ఎందుకంటే కోపం మనచేత ఏ మాటనైనా అనిపిస్తుంది. తరువాత మీరే పశ్చాత్తాపం పడాల్సి వస్తుంది.
నవ్వే మంత్రం
మూడీగా ఉండే వ్యక్తులతో మాట్లాడేందుకు, స్నేహం చేసేందుకు ఎవరూ ఇష్టపడరు. కాబట్టి నవ్వుతూ ఉండేందుకు ప్రయత్నించండి. జోవియల్ గా ఉండడం మీకు మరింత మందిని దగ్గర చేస్తుంది. నవ్వు ఒక చికిత్సలాంటిది.
Also read: మీ ఆరోగ్యం కోసం ఆహారం విషయంలో ఈ జాగ్రత్తలు పాటించక తప్పదు
Also read: అంటార్కిటికాలో ఉద్యోగం, ఎవరైనా అప్లయ్ చేయచ్చు, ఆ విషయంలో మాత్రం సర్దుకుపోవాల్సిందే