(Source: ECI/ABP News/ABP Majha)
Viral: అంటార్కిటికాలో ఉద్యోగం, ఎవరైనా అప్లయ్ చేయచ్చు, ఆ విషయంలో మాత్రం సర్దుకుపోవాల్సిందే
విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకునేవారికి ఇది మంచి అవకాశం.
విదేశాల్లో ఉద్యోగం చేయడం మీ కల? అయితే ఈ ఉద్యోగ ప్రకటన మీ కోసమే. బ్రిటన్ కు చెందిన ఓ స్వచ్ఛంద సంస్ధ మూడు ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతోంది. దీనికి యూకే నుంచే కాదు ఏ దేశస్థులైనా అప్లయ్ చేయచ్చు. ఇలాంటి ఉద్యోగం చేసే అవకాశం ఒక్కసారి మాత్రమే వస్తుంది. ఎంపికైతే కొన్ని నెలల పాటూ ఉద్యోగం చేస్తారు. తరువాత మళ్లీ వెనక్కి వచ్చేయాలి. కనీసం ఏడాది పాటూ కూడా ఈ ఉద్యోగం చేయలేరు. ఎందుకో తెలుసా? మీరు పనిచేయాల్సింది బ్రిటన్లో కాదు, మంచు ఖండమైన అంటార్కిటికాలో. అక్కడ గౌడియర్ అనే దీవిలో. ఆ దీవిలోనే ఒక పోస్టాఫీసు ఉంది. పేరు పోర్ట్ లాక్ రాయ్ పోస్టాఫీసు. ఇది చాలా ప్రసిద్ధమైనది, ఎందుకంటే ప్రపంచంలో జనాల్లేని చోట ఉన్న పోస్టాఫీసు ఇది. అలాగే చిన్న మ్యూజియం, గిఫ్ట్ షాపు కూడా ఉంది. వాటిల్లో పనిచేసేందుకు సీజనల్ ఉద్యోగులను వెతుకుతోంది యూకేకు చెందిన సంస్థ.
ఒక్కసారే అవకాశం...
యూకేకు చెందిన ‘అంటార్కిటిక్ హెరిటేజ్ ట్రస్ట్’ ఆ పోస్టాఫీసు బాధ్యతలను నిర్వహిస్తోంది. పోర్ట్ లాక్‌రాయ్ పోస్టాఫీసు, అంటార్కిటిక్ ద్వీపకల్పంలో స్థాపించిన మొదటి శాశ్వత బ్రిటిష్ స్థావరం. మొదట 1944 నుంచి 1962 వరకు ఉపయోగించారు. 2006లో దీని బాగోగులు చూసేందుకు యూకే అంటార్కిటిక్ ట్రస్ట్ స్వాధీనం చేసుకుంది. అప్పటి నుంచి ఈ ప్రదేశాన్ని పర్యాటక స్థలంగా మార్చారు. ఏటా మంచు అధికంగా లేని సీజన్ లో పర్యాటకులు వస్తుంటారు. ఇక్కడున్న పోస్టాఫీసు, మ్యూజియం తదితరాలు నవంబర్ నుంచి మార్చి మధ్య తెరిచి ఉంటాయి. అప్పుడు అక్కడ వేసవి కాలం. ఆ సమయంలోనే వేలాది మంది పర్యాటకులు తరలి వస్తారు. ఆ అయిదు నెలల పాటూ పనిచేసేందుకు దరఖాస్తులను కోరుతోంది సంస్థ. బేస్ లీడర్, షాప్ మేనేజర్, జనరల్ అసిస్టెంట్ ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి. 2022 నవంబర్ నుంచి 2023 మార్చి వరకు పనిచేసేందుకు ఉద్యోగులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
నీళ్లు లేకుండా...
వీరు అక్కడ ఉండి పర్యాటకులకు కావాల్సిన సమాచారాన్ని అందించాలి. వచ్చే ఉత్తరాలను కూడా అందించాలి. అలాగే పెంగ్విన్లు సంఖ్యను ఎప్పటికప్పుడు లెక్కపెట్టాలి. అక్కడ గతంలో పనిచేసిన వ్యక్తి విక్కీ ఇంగ్లిస్. ఆయన మాట్లాడుతూ ‘అలాంటి ఉద్యోగం చేసే అవకాశం జీవితంలో ఒక్కసారే వస్తుంది. సాహసాలు చేసే వారికి ఈ ఉద్యోగం సరైనది. నేను మొదటిసారి ఆ పోస్టాఫీసును చేరుకోవడానికి వెళ్లేందుకు మంచును తవ్వుకుంటూ వెళ్లాల్సి వచ్చింది. అక్కడ కొళాయిలు ఉన్నా నీళ్లు రాదు. ఎందుకంటే నీరు గడ్డకట్టేసి ఉంటుంది. టాయిలెట్లలో కూడా నీళ్లు రావు. విలాసాలేవి ఉండదు. అక్కడ అంతా మంచుప్రాంతమే కాబట్టి, స్నానం చేయాల్సిన అవసరం కూడా రాదు. తాగడానికి మాత్రం నీళ్లు కాస్త దొరకుతాయి’ అని చెప్పుకొచ్చాడు. కాబట్టి నీళ్లతో పాటూ మిగతా విలాసాలేవీ అక్కడ దొరకవు. సర్దుకుపోయే లక్షణం ఉన్నవారే ఆ ఉద్యోగాలకు సెట్ అవుతారన్నమాట.
ఆసక్తి ఉన్నవారు కింద ఇచ్చిన వెబ్ సైట్లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు.
https://www.ukaht.org/
ఆల్ ది బెస్ట్
Also read: స్పెర్మ్ కౌంట్‌ను పెంచే టొమాటో మిరియాల సూప్, ఎలా చేయాలంటే