(Source: ECI/ABP News/ABP Majha)
Tomato soup: స్పెర్మ్ కౌంట్‌ను పెంచే టొమాటో మిరియాల సూప్, ఎలా చేయాలంటే
రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం చాలా అవసరం. అందుకే ఈ సూప్ రెసిపీ.
టొమాటోల్లో ఉండే పోషకాలన్నీ మన శరీరానికి అవసరమైనవే. వీటిలో ఉండే లైకోపీన్ క్యాన్సర్‌ను కూడా అడ్డుకుంటుందని అధ్యయనాలు తేల్చాయి. ఫైబర్, పొటాషియం, కాపర్, సెలీనియం, విటమిన్స్ ఏ, సి, కె లు ఇందులో నిండుగా ఉంటాయి. ఇవన్నీ గుండె సంబంధిత వ్యాధులను దూరంగా ఉంచుతాయి. మగవారు టొమాటోలతో చేసిన సూప్ తాగితే స్పెర్మ్ కౌంట్ కూడా పెరుగుతుంది. తద్వారా లైంగిక సామర్థ్యం మెరుగుపడుతుంది. మధుమేహంతో బాధపడుతున్నవారు టమాటో మిరియాల సూప్ తాగితే రక్తంలో చక్కెర స్థాయిలు సమతుల్యంగా ఉంటాయి. ఇందులో వాడే మిరియాలు కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. క్యాన్సర్ కణాలను పెరగకుండా అడ్డుకునే శక్తి మిరియాలకు ఉంది. క్యాన్సర్ నివారణలో ఇవి ప్రధాన పాత్ర వహిస్తాయి. ఆర్డరైటిస్ ఉన్నవారు టొమాటో మిరియాల సూప్ చేసుకుని తాగితే చాలా మంచిది. వీటిలో ఉండు యాంటీ ఆక్సిడెంట్లు చాలా వ్యాధులను తగ్గించడంలో, రాకుండా అడ్డుకోవడంలో ముందుంటాయి. మిరియలు బరువు తగ్గడానికి కూడా సహాయపడతాయి. కేలరీలను బర్న్ చేస్తాయి. ఈ సూప్ తాగడం వల్ల మలబద్ధకం సమస్య తగ్గిపోతుంది. పేగులు చురుగ్గా కదిలేందుకు ఈ సూప్ సహకరిస్తుంది.
కావాల్సిన పదార్థాలు
టొమాటోలు - మూడు
మిరియాల పొడి - ఒక టీస్పూను
దాల్చిన చెక్క పొడి - పావు టీస్పూను
వెల్లుల్లి రెబ్బలు - నాలుగు
అల్లం తరుగు - అర టీస్పూను
ఉల్లిపాయ తరుగు - మూడు స్పూనులు
పుదీనా తరుగు - రెండు స్పూనులు
నూనె - ఒక స్పూను
తయారీ ఇలా
1. ఒక పాత్రలో నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టాలి.
2. అవి వేడెక్కాక టొమాటో ముక్కలు, అల్లం తరుగు వేసి బాగా మరిగించాలి.
3. టొమాటో ముక్కలు మెత్తగా ఉడికాక స్టవ్ కట్టేయాలి.
4. టొమాటో ముక్కలను మెత్తగా గుజ్జులా చేసుకోవాలి.
5. ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి.
6. నూనె వేడెక్కాక వెల్లుల్లిరెబ్బలు, ఉల్లిపాయల తరుగు వేసి వేయించాలి.
7. అవి వేగాక టొమాటో, అల్లం తరుగు గుజ్జును వేసేసి కలపాలి.
8. రుచికి తగినంత ఉప్పు వేయాలి. మిరియాల పొడి, దాల్చిన చెక్క పొడి వేసి కలపాలి.
9. పుదీనా తరుగును పైన చల్లి స్టవ్ కట్టేయాలి. అంతే టొమాటో మిరియాల సూప్ సిద్ధమైనట్టే.
10. దీన్ని గోరువెచ్చగా తింటే ఎంతో రుచిగా ఉంటుంది.
Also read: మధుమేహులు ఈ ఆహారాలను రాత్రి తినకపోతే బెటర్, ఎక్కువ కాలం జీవించే ఛాన్స్
Also read: ఆ బీచ్‌లో గుసగుసలు వినిపిస్తాయి, మాట్లాడేదెవరో తెలియదు, అదో మిస్టరీ