Morning Walk: మార్నింగ్ వాక్‌ను తక్కువ అంచనా వేయొద్దు - ఈ ప్రయోజనాలు తెలిస్తే ఈ రోజే మొదలుపెట్టేస్తారు!
నడక ఆరోగ్యానికి మంచిది. వాకింగ్ చేస్తే దీర్ఘకాలిక రోగాల బారిన పడే అవకాశాలు తక్కువగా ఉంటాయని వైద్యులు సూచిస్తున్నారు.
నడక ఆరోగ్యానికి చాలా మంచిది. ఇక మార్నింగ్ వాక్ అయితే మీ గుండెని భద్రంగా ఉంచుతుంది. మనసుకి ప్రశాంతతనిస్తుంది. కఠినమైన వ్యాయామం చేయడం కంటే పొద్దున్నే కాసేపు ఎండలో నడవడం చాలా సులభం. శక్తిని ఇస్తుంది. రోగనిరోధక శక్తి స్థాయిలు పెంచడమే కాదు బలమైన ఎముకలు, కండరాలు బలంగా మారుస్తుంది. మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. ఇంటికి దగ్గరలో ఉన్న పచ్చని వాతావరణం ఉండే పార్కులో చల్లని గాలిలో నడుస్తూ ఉంటే హాయిగా అనిపిస్తుంది. ఆరుబయట నడక వల్ల రోగనిరోధక శక్తిని పెంచి అంటువ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
మానసిక స్థితి మెరుగు
బయటకి రావడం స్వచ్చమైన గాలి పీల్చుకోవడం ప్రకృతి మధ్య షికారు చేయడం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గుతుంది. రోజుని సానుకూలంగా ప్రారంభించడంలో సహాయపడుతుంది. మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఎన్విరాన్ మెంటల్ రీసెర్చ్ అండ్ పబ్లిక్ హెల్త్ లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం క్రమంగా వ్యాయామం చేయని వారి కంటే క్రమం తప్పకుండా నడవడం లేదా ఇతర శారీరక వ్యాయామాలలో పాల్గొనే వారి మానసిక ఆరోగ్యం బాగుంటుందని తేలింది.
కేలరీలు కరుగుతాయి
బరువు తగ్గించే లక్ష్యాలని నిర్ధేశించుకున్నట్టయితే మార్నింగ్ వాక్ మీకు సహాయపడుతుంది. రాత్రి నిద్ర తర్వాత నడక జీవక్రియని పెంచుతుంది. తద్వారా కేలరీలను వేగంగా బర్న్ చేస్తుంది. 150 కేలరీలు వరకు బర్న్ చేయడానికి అరగంట వరకు మితమైన వేగంతో నడవాలి.
ఎముకలు బలోపేతం
కొత్త ఎముకల్ని తయారు చేయడం, పాత ఎముకలను విచ్చిన్నం చేయడం శరీర స్థిరమైన ప్రక్రియలో ఒక భాగం. 50 సంవత్సరాల తర్వాత పాత ఎముకలు వేగంగా విరిగిపోతాయి. ఫలితంగా ఎముక ద్రవ్యరాశి కోల్పోతుంది. సమతుల్య, ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు రెగ్యులర్ నడక ఎముకలను బలపరుస్తుంది. బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
గుండెకి మేలు
రాత్రంతా పడుకుని పొద్దున్నే లేచినప్పుడు శరీరం రాబోయే రోజుకి సిద్ధం అవుతుంది. రక్తపోటు పెరగడం ప్రారంభమవుతుంది. పల్స్ పెరుగుతుంది. ఎండోక్రైన్ గ్రంథులు ఎక్కువ మొత్తంలో హార్మోన్లను విడుదల చేస్తుంది. ప్రతిరోజూ ఉదయం నడవడం వల్ల హృదయ స్పందన రేటు, రక్తపోటు అదుపులో ఉంటాయి. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
ఉదయం శరీరం, మెదడు తాజాగా ఉంటాయి. సూర్యరశ్మి శరీరాన్ని తాకడం వల్ల శరీరానికి కావాల్సిన విటమిన్ డి పుష్కలంగా అందుతుంది. రోజులో కనీసం అరగంట సేపు చెమటలు పట్టేలా నడిస్తే ఆరోగ్యానికి చాలా మంచిది. నడిచేటప్పుడు చేతులు అటూ ఇటూ కడుపుతూ నడిస్తే మంచి ఫలితాలు పొందుతారు. క్యాన్సర్ ముప్పు తగ్గడంతో పాటు, హృదయ సంబంధ వ్యాధుల ముప్పు తగ్గుతుంది. గుడేకి రక్షణ కలుగుతుంది. వేగంగా వాకింగ్ చేసే వారిలో గుండె పోటు వచ్చే ప్రమాదం చాలా తక్కువ. నడక రోజులో ఎప్పుడైనా చేసుకోవచ్చని సూచిస్తున్నారు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: నిద్రలేచిన వెంటనే ఒళ్ళు నొప్పులుగా ఉంటుందా? అందుకు కారణాలు ఇవే