Body Pains: నిద్రలేచిన వెంటనే ఒళ్ళు నొప్పులుగా ఉంటుందా? అందుకు కారణాలు ఇవే
ఒబేసిటీ దగ్గర నుంచి ఊబకాయం వరకు అనేక కారణాల వల్ల నిద్రలేచిన వెంటనే శరీర నొప్పులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.
నిద్రలేచిన వెంటనే మీకు కూడా ఒళ్ళు నొప్పులుగా అనిపిస్తుందా? చాలా సేపటి వరకు అవి తగ్గకపోగా ఇబ్బంది పెట్టేస్తాయి. కండరాలలో నొప్పులు, విపరీతమైన తలనొప్పి లేదంటే శరీరమంతా నొప్పులు అనిపించినప్పుడు ఏ పని చేయలేము. నిద్రలేచిన వెంటనే ఆ ఫీలింగ్ రావడానికి అనేక కారణాలు ఉన్నాయని నిపుణులు వివరిస్తున్నారు. పడుకునే పరుపు, నిద్ర స్థానం, బరువు, నిద్ర రుగ్మతలు, అంతర్లీన ఆరోగ్య పరిస్థితులు సహా అనేక కారణాలు ఉన్నాయి. వాటిలో కొన్ని ఇవి.
విటమిన్ డి లోపం: శరీరంలో తగినంత విటమిన్ డి లేనప్పుడు రక్తంలో కాల్షియం తక్కువగా ఉంటుంది. ఈ పరిస్థితిని హైపోకాల్సెమియా అంటారు. మూత్రపిండాలు, కండరాలు వంటి శరీరంలోని ముఖ్యమైన అవయవాలు సరిగ్గా పని చేయడానికి కాల్షియం అవసరం. ఎముకలు ఆరోగ్యంగా ఉండేందుకు కూడా కాల్షియం కావాలి. దీన్ని గ్రహించడంలో తగినంత విటమిన్ డి లేకపోతే అవయవాలు, ఎముకలలో నొప్పిని అనుభవిస్తారు. అందుకే నిద్రలేచిన వెంటనే ఒళ్ళు నొప్పులుగా అనిపిస్తుంది.
రక్తహీనత: శరీరంలో తగినంత ఎర్ర రక్తకణాలు సరిగా పని చేయనప్పుడు రక్తహీనత సంభవిస్తుంది. శరీర కణజాలాలకి ఆక్సిజన్ లభించదు. శరీర భాగాలు ఆరోగ్యంగా ఉండటానికి, సరిగ్గా పని చేయడానికి తగినంత ఆక్సిజన్ అందకపోతే అలిసిపోయినట్లుగా అనిపిస్తుంది.
రక్తహీనత లక్షణాలు
☀ అలసట
☀ హృదయ స్పందనలో మార్పులు
☀ మైకం
☀ తల లేదా ఛాతీలో నొప్పి
☀ చల్లని పాదాలు లేదా చేతులు
☀ చర్మం పాలిపోవడం
అధిక బరువు: అధిక బరువు వెన్ను, మెడపై ఒత్తిడి తీసుకొచ్చి నొప్పిని కలిగిస్తుంది. నిద్ర శ్వాస రుగ్మతలకు కూడా కారణమవుతుంది. నిద్ర నాణ్యతని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. బరువు తగ్గడం అనేది నిద్ర నాణ్యతను మెరుగుపరిచేందుకు సులభమైన మార్గం. ఒళ్ళు నొప్పులతో ఉండి బరువు తగ్గడం చాలా కష్టం.
నాణ్యత లేని పరుపు: స్లీప్ ఫౌండేషన్ ప్రకారం నాణ్యత లేని పరుపుపై పడుకోవడం శరీర నొప్పులకు ప్రధాన కారణాలలో ఒకటి. పరుపు ఎగుడు దిగుడుగా ఉంటే నిద్ర సరిగా పట్టదు. ఫలితంగా తలనొప్పి, ఒళ్ళు నొప్పులు వస్తాయి.
స్లీపింగ్ పొజిషన్: కొంతమంది బోర్లా పడుకుంటారు. మరికొంతమంది సైడ్ స్లీపింగ్ అలవాటు. అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా వంటి స్లీప్ బ్రీతింగ్ డిజార్డర్స్ ఉన్నవారికి నిద్రలేమి వల్ల శరీర నొప్పులు వస్తాయి. తల దిండు కూడా మరొక కారణం అవుతుంది. దిండు సరిగా లేకపోతే మెడ, వెన్నుపూస మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. బోర్లా పడుకోవడం మంచి పద్ధతి కాదని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేస్తే శరీరంలోని ముఖ్యమైన భాగాలపై తీవ్రమైన ఒత్తిడి పడుతుంది. వెన్నుపూస, ఎముకలు, ఊపిరితిత్తులు తీవ్రంగా ఒత్తిడికి లోనవుతాయి. ఒక్కోసారి నిద్రలోనే శ్వాస తీసుకోవడం కూడా కష్టంగా మారుతుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: పోషకాలు నిండిన ఈ బ్రేక్ ఫాస్ట్ తిన్నారంటే సులువుగా బరువు తగ్గుతారు