Weird: వీడు మామూలోడు కాదు, ఫోన్ మింగేసి... ఆరునెలలు బిందాస్‌గా బతికేశాడు
ఎందుకో మింగాడో తెలియదు కానీ, ఏకంగా చిన్న నోకియా ఫోన్ ను మింగేశాడు ఓ మహానుభావుడు.
ఈజిప్టులోని అస్వాన్ యూనివర్సిటీ ఆసుపత్రికి ఓ వింత కేసు వచ్చింది. ఓ వ్యక్తి కడుపు నొప్పిగా ఉందంటూ వచ్చాడు. ఎందుకు కడుపునొప్పి వచ్చిందని అడిగితే... తెలిసి కూడా కారణం చెప్పలేదు. తనకు తెలియదని, కొన్ని రోజులుగా కడుపు నొప్పితో బాధపడుతున్నట్టు చెప్పాడు. ఆ వ్యక్తి పేరును చెప్పేందుకు ఆసుపత్రి వర్గాలు అంగీకరించలేదు కనుక, మేము కూడా అతని పేరు చెప్పడం లేదు. నొప్పికి కారణం తెలుసుకునేందుకు అతడి పొట్టని స్కాన్ చేశారు వైద్యులు. పొట్టలో ఉన్న వస్తువును చూసి అదిరిపడ్డారు. కడుపునొప్పి ఎందుకు వస్తుందో తెలియదంటూ అమాయకంగా ముఖం పెట్టిన ఆ రోగిని చెడామడా తిట్టారు. ఇంత ప్రమాదకరమైన వస్తువును కడుపులో దాచుకుని అబద్ధాలడతావా అని దుమ్ముదులిపారు. ఆ వ్యక్తి కడుపులో సన్నగా ఉండే ఫోన్ ఉంది.
ఆ వ్యక్తి మాత్రం ఆ ఫోన్ ను తాను మింగేసి ఆరు నెలలైంది తాపీగా సమాధానం చెప్పాడు. అది విని మళ్లీ షాకయ్యారు వైద్యులు. ఇన్నాళ్లు ఎందుకు ఆసుపత్రికి రాలేదని అడిగితే... ఆ ఫోన్ సహజపద్దతిలో మూత్రవిసర్జన సమయంలో వచ్చేస్తుందని వెయిట్ చేస్తున్నట్టు చెప్పాడు. కానీ అది రాకపోగా కొన్ని రోజుల నుంచి కడుపునొప్పి మొదలైందని, ఇక భరించలేక వచ్చానని తెలిపాడు. ఇలాంటి మూర్ఖులు కూడా ప్రపంచంలో ఉంటారా అని తలలు పట్టుకున్నారు వైద్యులు. ఆ ఫోన్ వల్ల పెద్దపేగులు, పొట్టలో ఇన్ఫెక్షన్ వచ్చేసింది. దీంతో అతనికి సర్జరీ చేయాల్సి వచ్చింది. ఆ ఫోన్ ను పొట్టలోంచి తొలగించారు వైద్యులు. అసలు ఎందుకు మొబైల్ ఫోన్ మింగాల్సి వచ్చిందో మాత్రం తెలియరాలేదు.
మరోచోట...
గతనెలలో కూడా ఇలాంటి కేసే కోసావో దేశంలో బయటపడింది. ఒక వ్యక్తి నోకియా 3310 మోడల్ ఫోన్ మింగేశాడు. కడుపునొప్పి రావడంతో ఆసుపత్రికి వెళ్లాడు. వైద్యులు ఎక్స్ రే తీసి చూడగా ఫోన్ మూడు ముక్కలుగా విడిపోయి కనిపించింది. ఫోన్ బ్యాటరీ అతని పొట్టలోనే పేలిపోతుందేమోనని వైద్యులు చాలా ఆందోళన చెందారు. రెండు గంటల పాటూ ఆపరేషన్ చేసి ఫోన్ భాగాలను బయటికి తీశారు. కానీ ఫోను ఎందుకు మింగాడో మాత్రం కనుక్కోలేకపోయారు.
Also read: గంటలు గంటలు కూర్చుని నిద్రపోవడం.. ప్రాణానికే ప్రమాదమా?
Also read: మగవారికి గట్టి షాకిచ్చిన జైపూర్ రెస్టారెంట్... ఇప్పుడు ఎలా తింటారో చూద్దాం
Also read: మీ నడకే మీకు చెప్పేస్తుంది... ఈ మహమ్మారి గురించి
Also read: ఇరవై, ముఫ్పైలలోనే బట్టతల? కారణాలు ఇవే కావచ్చు...
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి