World Record: ఆ పిలగాడి వీపుపై సంతకాల మేళా... అదో ప్రపంచ రికార్డు
అతడో టాటూ ఆర్టిస్టు... అందుకే ఆ రంగంలోనే ఓ ప్రపంచరికార్డు స్థాపించాడు.
పుర్రెకో వెర్రి... అని ఊరకే అనరు. ఇదిగో ఇతడిని చూస్తే అది నిజమే అనిపిస్తుంది. ఏ పూలో, ఆకులో, దేవుళ్ల బొమ్మలో టాటూలుగా వేయించుకునే వాళ్లం చూశాం. ఇతడు మాత్రం ఏకంగా తనకు నచ్చిన వారందరి సంతకాలు వాళ్ల చేతే టాటూలుగా వేయించుకున్నాడు. పేరు ఫంకీ మటాస్. ఇది అతను పెట్టుకున్న పేరు, అసలు పేరు మాత్రం జూన్ మటాస్. ఉండేది ఫ్లోరిడాలో. టాటూలు వేయడం అతడి వృత్తి.
కొత్తగా ఏదైనా చేయాలనిపించి తనకు ఇష్టమైన స్నేహితులను టాటూల రూపంలో సంతకాలు చేయమని అడిగాడు. తరువాత తన కుటుంబసభ్యుల సంతకాలు చేయించాడు. అతడికి ఆ పని నచ్చింది. ఎవరూ చేయని కొత్త పని కావడంతో దాన్ని కొనసాగించాడు. సెలెబ్రిటీల వెంట పడి వారి చేత సంతకాలు చేయించుకోవడం మొదలుపెట్టాడు. షూటింగ్ జరిగే ప్రాంతాలకి వెళ్లి వీపు చూపిస్తూ వెంటపడతాడు. అతడి బాధ పడలేక చాలా మంది అమెరికా టీవీ స్టార్లు, సినిమా నటులు సంతకాలు చేసేస్తారు. ‘ఎవరైనా నా వీపుపై సంతకం చేశారు అంటే... వాళ్లు నాకు ఏదో ఒక విషయంలో స్పూర్తి నింపిన వారై ఉంటారు’అని చెబుతున్నాడు.
2019 నాటికి ఫంకీ వీపుపై 190 సంతకాలు చేయించుకున్నాడు. వీపుప అత్యధిక టాటూ సంతకాలు కలిగిన వ్యక్తిగా అతను గిన్నిస్ వరల్డ్ బుక్ లోకి ఎక్కాడు. ఆ తరువాత 225 సంతకాలు చేయించుకున్నాడు. ఇప్పుడతని శరీరంపై ఎన్ని సంతకాలు ఉన్నాయో సరిగ్గా సంఖ్య తెలియదు కానీ, త్వరలో 300 పూర్తి చేసే అవకాశం ఉందని అంటున్నాడు. ఫ్లోరిడాలో అతడో ఎంటర్ టైనర్. తన ఫోటోలను ఎప్పటికప్పుడు ఇన్ స్టాలో పోస్టు చేస్తుంటాడు. తన సంతకాలు చేయించుకున్న సెలెబ్రిటీల ఫోటోలను కూడా పోస్టు చేస్తాడు. హాలీవుడ్ సూపర్ స్టార్ల చేత సంతకాలు చేయించుకోవాలని అతడి కోరిక.
">