Male Fertility Issues : ప్రపంచవ్యాప్తంగా మగవారిలో వేగంగా తగ్గుతోన్న స్పెర్మ్ కౌంట్.. ఈ అపోహలే ప్రధాన కారణమంటోన్న నిపుణులు
Sperm Count : పురుషుల సంతానోత్పత్తి తగ్గుతోంది. ప్రపంచవ్యాప్తంగా వీర్యకణాల సంఖ్య 60% తగ్గిందని భారతీయ అధ్యయనాలు చెబుతున్నాయి.

Male Fertility Myths vs Facts : ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్.. తన హ్యూమన్ రిప్రొడక్షన్ అప్‌డేట్‌లో ఓ అధ్యయనం గురించి ప్రచురించింది. 2017కు చెందిన ఓ సమగ్ర గ్లోబల్ మెటా-విశ్లేషణ దానిలో పొందుపరిచింది. ఉత్తర అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లోని పురుషులలో 1973-2011 మధ్య స్పెర్మ్ కౌంట్ 50–60% తగ్గిందనేది దాని సారాంశం. ఈ తగ్గుదల సంవత్సరానికి సుమారు 1.4%గా ఉంది. ఈ సమస్యలో భారతదేశం ఏమి మినహాయింపు కాదు. లక్నోలోని మేల్ రిప్రొడక్టివ్ బయాలజీ లాబొరేటరీ.. రీప్రొడక్టివ్ బయాలజీ అండ్ ఎండోక్రినాలజీ (2018)లో '37 సంవత్సరాల వ్యవధిలో ఉన్న భారతీయ పురుషులలో వీర్య నాణ్యత గణనీయంగా క్షీణించిందని' ప్రచురించింది.
ఆందోళనలో నిపుణులు
ది గార్డియన్ ఇటీవల చేసిన కవరేజ్ ప్రకారం.. 2000 నుంచి ప్రపంచవ్యాప్తంగా స్పెర్మ్ కౌంట్ మరింత వేగంగా తగ్గుతోందని గుర్తించారు. సంవత్సరానికి 2% కంటే ఇది ఎక్కువగా ఉన్నట్లు తెలిసి షాక్ అయ్యారు. ప్లాస్టిక్‌లలో కనిపించే ఫథాలేట్స్, బిస్‌ఫెనోల్స్ వంటి పర్యావరణ టాక్సిన్‌లు.. హార్మోన్లను, పునరుత్పత్తి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయంటూ శాస్త్రవేత్తలు షాకింగ్ విషయాలు తెలిపారు.
“ఫెర్టిలిటీ సమస్యలను చాలా కాలంగా మహిళల సమస్యగా చూస్తున్నారు. కానీ వాస్తవానికి, ప్రపంచవ్యాప్తంగా సంతానలేమి కేసులలో దాదాపు సగం పురుషులే కారకాలు అవుతున్నారు.” అని ప్రైమ్ IVF హెడ్ డాక్టర్ నిషి సింగ్ అన్నారు. శాస్త్రీయ ఆధారాలు ఉన్నప్పటికీ.. పురుషుల్లో సంతానోత్పత్తి గురించి అపోహలు, అపార్థాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని.. ఇవి వారిలో ఒత్తిడిని కలిగిస్తుందని ఆమె చెప్పారు.
పురుషుల సంతానోత్పత్తి గురించి అపోహలు vs వాస్తవాలు
- అపోహ : 50 ఏళ్ల తర్వాత మాత్రమే పురుషుల్లో సంతానోత్పత్తి తగ్గుతుంది..?
“పురుషులు లేటు వయస్సులో కూడా పిల్లలకు తండ్రి కాగలిగినప్పటికీ.. స్పెర్మ్ నాణ్యత అనేది 35 ఏళ్లలో క్షీణించడం ప్రారంభమవుతుంది. 40 తర్వాత మరింత దిగజారుతుంది.” అని డాక్టర్ నిషి సింగ్ తెలిపారు. వృద్ధాప్యంలో పురుషులు తక్కువ చలనశీలతను, అధిక DNA బ్రేక్స్ ఎదుర్కొంటారు. దీనివల్ల గర్భస్రావం, జన్యుపరమైన ప్రమాదాలు పెరుగుతాయి.
- స్కలనం స్పెర్మ్ కౌంట్‌ను శాశ్వతంగా తగ్గిస్తుంది..?
“స్పెర్మ్ ఉత్పత్తి ఎప్పుడూ ఆగదు. స్కలనం తర్వాత స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండవచ్చు. అది త్వరగా తిరిగి వస్తుంది. వాస్తవానికి సాధారణ స్కలనం పాత స్పెర్మ్‌ను బయటకు పంపడం ద్వారా స్పెర్మ్ నాణ్యతను మెరుగుపరుస్తుంది.”
- లోదుస్తులు టైట్‌గా వేస్తే సంతాన సమస్యలు వస్తాయి..?
ఆ ప్రాంతం ఎక్కువసేపు వేడిగా ఉంటే తాత్కాలికంగా స్పెర్మ్‌ను తగ్గవచ్చు. కానీ ప్రతిరోజూ బిగుతైన లోదుస్తులను ఉపయోగించడం వల్ల సంతానలేమి రాదు. మీరు అలా అనుకున్నప్పుడు లూజ్ బాక్సర్‌లు వేసుకోవచ్చు. కానీ లోదుస్తుల వల్ల సంతాన సమస్యలు రావు అంటూ సింగ్ క్లారిటీ ఇచ్చారు.
- ఆల్కహాల్, ధూమపానం స్పెర్మ్‌పై ప్రభావం చూపించవు
“ధూమపానం DNAని దెబ్బతీస్తుంది. చలనశీలతను తగ్గించి.. స్పెర్మ్ కౌంట్‌ను తగ్గిస్తుంది. అధికంగా మద్యం సేవించడం వల్ల హార్మోన్ల స్థాయిలు దెబ్బతింటాయి. లైంగిక పనితీరును దెబ్బతీస్తుంది. మోస్తరుగా మద్యం సేవించడం సురక్షితం కావచ్చు. కానీ గర్భం దాల్చడానికి ప్రయత్నించేటప్పుడు అధికంగా మద్యం సేవించకూడదు. స్మోకింగ్ కూడా అంతే.
- స్పెర్మ్‌పై ఒత్తిడి ప్రభావం ఉండదు
మానసిక, శారీరక ఒత్తిడి టెస్టోస్టెరాన్‌ను తగ్గిస్తుంది. దీని వలన లిబిడో తగ్గుతుంది. లైంగికంగా పనిచేసే సామర్థ్యం తగ్గుతుంది. వ్యాయామం, ధ్యానం, సరైన నిద్ర లేదా కౌన్సెలింగ్ ద్వారా ఒత్తిడిని కంట్రోల్ చేసుకోవచ్చని డాక్టర్ సింగ్ సలహా ఇస్తున్నారు.
స్పెర్మ్ ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అంశాలివే
రోజూవారి అలవాట్లు : యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు (సి, డి, ఇ), ఖనిజాలు (జింక్, సెలీనియం) అధికంగా ఉండే ఆహారాలు స్పెర్మ్ ఆరోగ్యానికి మద్దతు ఇస్తాయి. ఊబకాయం, అన్‌హెల్తీ ఫుడ్స్ స్పెర్మ్ నాణ్యతను దెబ్బతీస్తాయి.
వైద్య సమస్యలు : వేరికోసెల్ (వృషణ సిరలు), ఇన్ఫెక్షన్లు, ఎండోక్రైన్ అసమతుల్యత, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులు స్పెర్మ్ ఉత్పత్తిని దెబ్బతీస్తాయి.
ముందస్తు పరీక్షలు : ప్రెగ్నెన్సీ సంవత్సరం కంటే ఎక్కువ కాలం ట్రై చేస్తూ.. సక్సెస్ అవ్వని జంటలు.. ఇద్దరూ పరీక్షలు చేయించుకోవాలి. “వీర్య విశ్లేషణ చాలా సులభం. పూర్తి సమాచారం ఇస్తుంది. సరైన చికిత్సకు మార్గనిర్దేశం చేస్తుంది.” అని డాక్టర్ సింగ్ తెలిపారు.
గుర్తించుకోవాల్సిన విషయాలు
సంతానలేమి అనేది కేవలం మహిళల ఆరోగ్య సమస్య మాత్రమే కాదని.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాదాపు సగం కేసులకు పురుషులే కారణమని గుర్తించాలి. నిజమైన ప్రమాద కారకాలను తెలుసుకోవాలి. అపోహలను వదిలి వైద్య సహాయం తీసుకుంటే తక్కువ సమయంలోనే మంచి ఫలితాలు చూస్తారని సూచిస్తున్నారు వైద్యులు.






















