High Blood Pressure : బీపీని తగ్గించుకోవడానికి ఈ మార్పులు చేయండి.. ఆ ఒక్కటి మానేయాలి, ఈ ఫుడ్స్ తినేయాలి
Hypertension : రక్తపోటును కంట్రోల్ చేయడానికి లేదా రాకుండా ఉండేందుకు చూస్తున్నారా? అయితే మీ లైఫ్స్టైల్లో ఈ మార్పులు చేసేయండి. నిపుణులిచ్చే విలువైన సలహాలు ఇవే.
High Blood Pressure/Hypertension : బీపీ అనేది సైలంట్ కిల్లర్ అని అందరికీ తెలుసు. ముఖ్యంగా గుండె సమస్యలను ప్రేరేపించి.. ప్రాణాలను హరించడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా ఇది డయాబెటిస్‌కి కజిన్ బ్రదర్ లాగా. బీపీ ఉంటే షుగర్ రావడం అనేది చాలామందిలో కనిపిస్తుంది. అందుకే బీపీ ఉన్నవారు కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. బీపీని కంట్రోల్ చేయాలన్నా.. రాకుండా ఉండాలన్నా లైఫ్స్టైల్లో, డైట్లో కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది.
సాధారణంగా బీపీ అనేది 120/90 mm Hg ఉండాలి. కానీ బీపీతో ఉండేవారిలో అది 130/80 mm Hg ఉండడం లేదా అంతకంటే ఎక్కువ ఉంటుంది. ఇలా ఉంటే గుండెలో రక్తం ప్రెజర్ ఎక్కువై .. హార్ట్‌పై ప్రెజర్ పడుతుంది. దీనివల్ల హార్ట్ స్ట్రోక్ వంటివి సంభవిస్తాయి. అయితే దీనిని మందుల సహాయంతో పాటు.. సహజంగా కూడా కంట్రోల్ చేయవచ్చు. మరి లైఫ్స్టైల్లో ఎలాంటి మార్పులు చేస్తే బీపీ కంట్రోల్ అవుతుందో.. రాకుండా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
కచ్చితంగా చేయాల్సిన మార్పులివే..
బీపీ రాకూడదు.. వచ్చినా సహజంగా కంట్రోల్లో ఉండాలనుకుంటే కచ్చితంగా లైఫ్స్టైల్లో కొన్ని మార్పులు చేయాలి. దానిలో మొదటిది ఏంటంటే..
బరువు : మీరు ఎక్కువ బరువు ఉంటే బీపీ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. మీకు ఆల్రెడీ బీపీ వచ్చేస్తే.. కచ్చితంగా బరువు తగ్గడంపై ఫోకస్ చేయాలి. దీనివల్ల గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. మధుమేహం కూడా కంట్రోల్లో ఉంటుంది. హెల్తీ లైఫ్ లీడ్ చేయడంలో బరువు ముఖ్యపాత్ర పోషిస్తుందని గుర్తించుకోవాలి.
ధూమపానం : స్మోకింగ్ అలవాటు ఉంటే వెంటనే దానిని మానేయాలి. ఇది మీ ఆరోగ్యాన్ని అన్ని విధాలుగా దెబ్బతీస్తుంది. ఇది మీ శరీరంలో రక్తనాళాలను దెబ్బతీసి.. ఇన్ఫ్లమేషన్కు దారి తీస్తుంది. దీనివల్ల ఆర్టరీలు దెబ్బతిని గుండె సమస్యలు పెరుగుతాయి. కాబట్టి వీలైనంత తొందరగా స్మోకింగ్‌ను తగ్గించుకోండి.
ఒత్తిడి : స్ట్రెస్ ప్రభావం బీపీపై ఎక్కువగా ఉంటుంది. వివిధ రకాలుగా వచ్చే ఒత్తిడిని డీప్ బ్రీతింగ్, వాకింగ్, బుక్స్ చదవడం, పాటలు వినడం, మెడిటేషన్ వంటి వాటితో దూరం చేసుకోవచ్చు. ఇష్టమైనవారితో మాట్లాడడం వల్ల కూడా స్ట్రెస్ కంట్రోల్ అవుతుంది.
నిద్ర : శరీరానికి మంచి నిద్ర అందితే దాదాపు అన్ని ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. నిద్ర లేకుంటే రిపైర్ సిస్టమ్ యాక్టివ్ కాదు. దీనివల్ల ఉన్న సమస్యలు కూడా ఎక్కువ అవుతాయి. బీపీ ఉన్నా లేకున్నా రోజుకు కనీసం 8 గంటలు నిద్రపోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
వ్యాయామం..
లైఫ్స్టైల్లో మార్పులు చేసిన తర్వాత ఫాలో అవ్వాల్సింది వ్యాయామం. ఆరోబిక్స్, వ్యాయామం రెగ్యులర్‌గా చేయడం వల్ల బీపీ కంట్రోల్లో ఉంటుందని పలు అధ్యయనాలు వెల్లడించాయి. వ్యాయమం చేసిన తర్వాత బీపీ దాదాపు రోజుపాటు కంట్రోల్లో ఉంటుందట.
రోజూ వ్యాయమం చేయడం వల్ల హార్ట్ రేట్, బ్రీతింగ్ రేట్ పెరుగుతుంది. దీనివల్ల గుండె ఆరోగ్యంగా మారుతుంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా రక్తాన్ని పంప్ చేస్తుంది. బీపీ కూడా సహజంగా కంట్రోల్ అవుతుంది. వారానికి కనీసం 2.5 గంటలు వ్యాయామం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. దానితో పాటుగా రోజు అరగటం నడవాలని సూచిస్తున్నారు. సైక్లింగ్, రన్నింగ్, స్విమ్మింగ్ కూడా చేయవచ్చు.
ఫుడ్ విషయంలో చేయాల్సిన మార్పులివే
బీపీ ఉన్నవారు డైట్‌ను కచ్చితంగా మార్చుకోవాలి. షుగర్, కార్బోహైడ్రేట్స్‌ను కంట్రోల్ చేయాలి. పోటాషియం ఎక్కువగా ఉండే ఫుడ్స్ తీసుకుంటూ సాల్ట్‌ని తగ్గించుకోవాలి. సాల్ట్ ఎక్కువగా తీసుకుంటే బీపీ అమాంత పెరిగిపోయే ప్రమాదముంది. అలాగే పోటాషియం శరీరంలో ఎక్కువైన ఉప్పును తగ్గిస్తుంది.
పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. తృణ ధాన్యాలు, జీరో ఫ్యాట్ ఫుడ్స్ తీసుకోవాలి. చేపలు తింటే చాలా మంచిది. బీన్స్, నట్స్‌ని డైట్లో భాగంగా తీసుకోవచ్చు. కొవ్వు ఎక్కువగా ఉండే ఫుడ్‌కి దూరంగా ఉంటే మంచిది. ప్రాసెస్ చేసిన ఫుడ్‌కి ఎంత దూరంగా ఉంటే పూర్తి ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.
Also Read : వయసు ప్రకారం బీపీ ఎంత ఉండాలో తెలుసా? మగ, ఆడవారిలో ఉండే వ్యత్యాసం ఇదే
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.