Lemon: నిమ్మకాయ కన్నా నిమ్మ విత్తనాలలోనే అద్భుత గుణాలు, వాటిని దాచి ఇలా చేయండి
నిమ్మ విత్తనాలను ఎవరు దాచి పెట్టుకోరు. నిమ్మకాయ పిండేసాక వాటిని కూడా పడేస్తారు.
నిమ్మకాయ మనకి ఎన్నో రకాలుగా ఆరోగ్యాన్ని అందిస్తుంది. కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే నిమ్మకాయ కన్నా నిమ్మ విత్తనాల్లో ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. నిమ్మకాయ సీజన్‌తో సంబంధం లేకుండా అన్ని కాలాల్లోనూ లభిస్తుంది. దీన్ని అన్ని సీజన్లలోనూ ఆహారంలో భాగం చేసుకున్నా..ఎలాంటి నష్టం ఉండదు. నిమ్మకాయలో ఉన్న గుణాలు శరీరాన్ని సర్వవిధాలా కాపాడతాయి. వేసవికాలంలో నిమ్మ రసాన్ని తాగడం వల్ల ఒళ్ళు చల్లబడుతుంది. అదే శీతాకాలంలో నిమ్మరసం రోజు తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. నిమ్మకాయలాగే నిమ్మ విత్తనాలు కూడా మనకెంతో ఉపయోగపడతాయి. కాబట్టి వాటిని పడేయకుండా తీసి దాచి పెట్టండి. వాటిని ఎండలో బాగా ఎండబెట్టి పొడిలా చేసి దాచుకున్న మంచిదే. అవసరం అయినప్పుడు వాడుకోవచ్చు.
నిమ్మ విత్తనాలలో కూడా శరీరాన్ని డిటాక్సిఫై చేసే గుణాలు ఉంటాయి. శరీరంలోని వ్యర్ధాలను ఇవి బయటకు పంపుతాయి. నిమ్మ విత్తనాలను నీళ్లలో వేసి మరిగించి తాగితే ఎంతో మంచిది. లేదా నిమ్మ విత్తనాల పొడిని నీళ్లలో వేసి మరిగించి తాగినా ఉత్తమమే. ఇలా తాగడం వల్ల లివర్, కిడ్నీలు వంటివి శుభ్రపడతాయి. అవి ఆరోగ్యంగా పనిచేస్తాయి. కీళ్ల నొప్పులు ఉన్నవారికి నిమ్మ విత్తనాలు ఎంతో మంచిది. ఈ విత్తనాలను పెనంపై కాస్త వేయించి తింటే కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. కీళ్ల నొప్పులు ఉన్న వారికి ఇవి అద్భుతంగా పనిచేస్తాయి.
నిమ్మ విత్తనాలు జీర్ణవ్యవస్థ పై ఎంతో ప్రభావాన్ని చూపిస్తాయి. పేగుల్లో ఉండే వ్యర్ధాలను ఇవి తొలగిస్తాయి. పొట్టలో ఉన్న చిన్న చిన్న పురుగులు కూడా నిమ్మ విత్తనాలు లోని గుణాలకు నశిస్తాయి. ముఖం కాంతివంతంగా మారాలన్నా కూడా నిమ్మ విత్తనాల పేస్టుని రాసుకుంటే ఫలితం ఉంటుంది. మొటిమలు, మచ్చలు వంటివి పోతాయి. సమస్యల నుంచి నిమ్మ విత్తనాలు బయటపడేస్తాయి. వీటిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు ఎక్కువ. కాబట్టి నిమ్మ విత్తనాల పొడిని నీటిలో కలుపుకొని రోజూ తాగితే బ్యాక్టీరియా, వైరస్ వంటివి శరీరం పై దాడి చేసిన ఎలాంటి నష్టం ఉండదు. జ్వరం వచ్చే అవకాశాలను ఇది తగ్గిస్తుంది. నిమ్మ విత్తనాల్లో యాంటీ ఫంగస్ గుణాలు కూడా ఉన్నాయి. కాబట్టి పేస్టులా చేసి చర్మానికి రాసుకుంటే ఫంగస్ సమస్యల నుంచి దూరం అవ్వచ్చు. గోరుచుట్టు వంటి వాటికి ఇది అద్భుత ఔషధంగా పనిచేస్తుంది. నిమ్మ గింజలను ఏరి దాచుకోవాలి. వాటిని ఎండబెట్టి దాచుకున్నా లేక పొడి రూపంలో దాచుకున్నా మంచిదే.
Also read: ఎముకలకు బలాన్నిచ్చే మటన్ బోన్ సూప్ - ఇలా చేయండి
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.