Home Decor Tips : కృష్ణ జన్మాష్టమి వేడుకల కోసం ఇంటిని ఇలా అలంకరించేయండి.. కన్నయ్యను ఇలా ఆహ్వానించేయండి
Krishna Janmashtami 2025 : జన్మాష్టమి 2025 వేడుకల కోసం ఇంటిని ఎలా అలంకరించాలో.. కన్నయ్యను ఆహ్వానించేందుకు ఏమి చేస్తే మంచిదో.. ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలో చూసేయండి.

Janmashtami Special Home Decor Tips : కృష్ణాష్టమి లేదా జన్మాష్టమి అనేది.. భక్తులు శ్రీకృష్ణుడి జన్మదినాన్ని వేడుకలా జరుపుకునే పండుగ. ఈ సమయంలో భక్తులు ఉపవాసం ఉండటంతో పాటు.. ఎంతో సంతోషంగా ఈ వేడుకను చేసుకుంంటారు. దీనిలో భాగంగా ఇంటిని చాలా అందంగా అలంకరించుకుంటారు. శ్రీకృష్ణుడి జననాన్ని గుర్తు చేసుకుంటూ ఊయలను అందంగా ముస్తాబు చేస్తారు. అంతే కాకుండా ఇంట్లో పండుగ వాతావరణాన్ని నెలకొల్పేలా పలు మార్పులు చేస్తారు. పండుగ వాతావరణాన్ని రెట్టింపు చేసే అలంకరణలు ఏంటో.. కృష్ణాష్టమి స్పెషల్ ఏమేమి కొత్తగా డిజైన్ చేయవచ్చో చూసేద్దాం.
ఊయల అలంకరణ
శ్రీకృష్ణుడి కోసం అద్భుతమైన ఊయలను తయారు చేయడం జన్మాష్టమిలో భాగం. ఎందుకంటే శ్రీకృష్ణుడికి ఊయలంటే అమితమైన ప్రేమ. కాబట్టి దీనిని పూజల్లో భాగం చేయడం ఓ ట్రెడీషన్‌గా వస్తుంది. దీనికోసం మెటల్లో లేదా చెక్కతో చేసిన ఊయల ఎంచుకోవడం బెస్ట్. దానికి రంగురంగుల పట్టు లేదా సాటిన్ వంటి వైబ్రెంట్, టెక్చర్డ్ ఫ్యాబ్రిక్‌లను కట్టండి. సహజ సౌందర్యం, సువాసనను రెట్టింపు చేసేందుకు తాజా పువ్వులను లేదా ప్లాస్టిక్ పువ్వులతో అందంగా అలంకరించండి. అదనపు ఆకర్షణ కోసం నెమలి ఈకలు కూడా కట్టవచ్చు. ఇవి శ్రీకృష్ణుడికి చిహ్నంగా ఉంటాయి. అంతేకాకుండా రాజరిక స్పర్శను ఇస్తాయి.
మట్టికుండలు
మట్టి కుండలు కూడా జన్మాష్టమిని జరుపుకోవడానికి ఓ అందమైన మార్గం. ఎందుకంటే శ్రీకృష్ణుడు మట్టి కుండలోని వెన్న దొంగలించాడని.. వెన్న అంటే కన్నయ్యకు అమితమైన ప్రీతి అని అందరికీ తెలుసు. కాబట్టి ఇది కూడా వేడుకల్లో ప్రధాన పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఈ వేడుకకోసం సాంప్రదాయ మట్టి కుండలను ఎంచుకోవడం మంచిది. వాటిని తెల్లని దూది లేదా పువ్వులతో రెడీ చేయవచ్చు. లేదా కుండలపై మంచి పెయింటింగ్స్ వేసి అలంకరించవచ్చు. పండగ వాతావరణం రెట్టింపు చేసేందుకు ఈ మట్టికుండలను పైకప్పు నుంచి వేలాడదీయవచ్చు. తాజా పువ్వులతో కుండలను నింపవచ్చు. ఈ అలంకరణ వేడుకలకు ఆనందకరమైన, దైవిక వాతావరణాన్ని తెస్తుంది.
రంగోలి డిజైన్స్
జన్మాష్టమి కోసం ఇంటిని అలంకరించుకోవడానికి రంగోలి ఒక అందమైన, సాంప్రదాయ మార్గం. తామర పువ్వులు, నెమళ్లు లేదా పువ్వులతో కూడిన ముగ్గులు ఎంచుకోవచ్చు. శ్రీకృష్ణుడికి సంబంధించిన చిత్రాలను.. పిల్లనగ్రోవి, ఆవులు లేదా వెన్న కుండలను ముగ్గులగా వేస్తే ఫెస్టివల్ వైబ్ రెట్టింపు అవుతుంది. రంగురంగుల కలయికతో.. పువ్వులు, దీపాలతో వాటిని అలంకరించవచ్చు. ఇంటి ప్రవేశ ద్వారం వద్ద, శ్రీకృష్ణుడి విగ్రహాన్ని ఉంచిన బలిపీఠం దగ్గర ఈ తరహా ముగ్గులు వేయవచ్చు. ముగ్గులకు దీపాలు జోడిస్తే డెడ్లీ కాంబినేషన్ అవుతుంది.
కృష్ణ సింహాసనం
కృష్ణ సింహాసనంతో ఇంటిని అలంకరిస్తే.. వేడుకల్లో రాజరిక, దైవిక స్పర్శ వస్తుంది. సింహాసనం కోసం కుర్చీ లేదా చిన్న సింహాసనం తీసుకుని అలంకరించుకోవాలి. రాయల్ బ్లూ, గోల్డ్ లేదా డీప్ రెడ్ వంటి రంగులతో దీనిని డిజైన్ చేసుకోవచ్చు. నెమలి ఈకలు, పువ్వులు, దుస్తులతో ఈ లుక్‌ని మెరుగుపరచుకోవచ్చు. అదనపు లుక్ కోసం LED ఫెయిరీ లైట్లతో సింహాసనాన్ని అలంకరించవచ్చు. శ్రీకృష్ణుడి అందమైన విగ్రహాన్ని సింహాసనంపై ఉంచండి. మీ మందిరం దగ్గర దీనిని ఉంచండి.
ఉర్లి డెకరేషన్
జన్మాష్టమి పండుగ వాతావరణాన్ని ఉర్లీలు సంపూర్ణంగా మెరుగుపరుస్తాయి. ఉర్లి అంటే లోతైన పాత్ర, దానిలో నీరు వేసి దానిపై పువ్వులు, దీపాలు పెడతారు. కాబట్టి ఉర్లీల కోసం లోతైన గిన్నెలు, తాజా నీరు, తాజా పూరేకులు సిద్ధం చేసుకోండి. శ్రీకృష్ణుడికి ఇష్టమైన బంతిపూలు, గులాబీలు లేదా జాస్మిన్ పూల రేకులతో నింపండి. వాటి లుక్ మెరుగుపరిచేందుకు నీటిలో తేలియాడే దీపాలు వెలిగించండి. ఇది ప్రశాంతమైన పండుగ వాతావరణాన్ని అందిస్తుంది. గది అంతటా లేదా ప్రవేశ ద్వారం, మందిరం ప్రదేశాల్లో అమర్చండి. ఉర్లిలా చుట్టూ పూల దండలు వేలాడదీయండి.






















