(Source: ECI/ABP News/ABP Majha)
Mint Benefits: పుదీనా తినడం వల్ల ఈ ఆరోగ్య సమస్యలకి చెక్ పెట్టేయవచ్చు
పుదీనా బిర్యానికి మంచి వాసన రుచే కాదు ఆరోగ్యానికి ప్రయోజనాలు అందిస్తోంది. దీన్ని తీసుకోవడం వల్ల కొన్ని అనారోగ్యాలు దరిచేరకుండా చూసుకోవచ్చు.
ఆకుకూరల్లో పుదీనా ప్రత్యేకతే వేరు. వాసన చాలా బాగుంటుంది. అందుకే, బిర్యానీలో సువాసన కోసం దీన్ని వేస్తుంటారు. ఇది మంచి వాసనతో పాటు రుచి కూడా ఇస్తుంది. బరువు తగ్గడానికి పుదీనా నీళ్ళు కూడా తాగుతారు. ఇంకొంతమంది పుదీనాతో పచ్చడి చేసుకుని తింటారు. పుదీనా ఆకులు కొద్దిగా నమిలితే మంచి రిఫ్రెష్ అనుభూతి కలుగుతుంది. దీన్ని అనేక శీతల పానీయాల్లో ఉపయోగిస్తారు. వేసవిలో చల్లని మజ్జిగలో పుదీనా ఆకులు వేసుకుని తాగడం వల్ల శరీరం డీహైడ్రేట్ కాకుండా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. విటమిన్ ఏ, ఐరన్, ఫోలేట్, మాంగనీస్ తో పాటు కేలరీలు తక్కువగా ఉంటాయి.
జీర్ణ వ్యవస్థ సక్రమంగా పని చేయడానికి పుదీనా తప్పకుండా తినాలి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. నిద్రలేమిని తగ్గించే గుణాలు ఇందులో ఉన్నాయి. గ్యాస్ సమస్య నుంచి బయటపడేస్తుంది. పుదీనాలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉన్నాయి. పుదీనాలో ఉండే మెంథాల్ శరీరం, మనసును రీఫ్రెష్ చేస్తుంది.
పొట్ట సమస్యలకి చెక్: కడుపులో నొప్పిగా లేదా అసౌకర్యంగా అజీర్తిగా అనిపించినప్పుడు కొద్దిగా పుదీనా ఆకులు నేరుగా తినొచ్చు. లేదంటే వేడి నీటిలో వేసుకుని తాగొచ్చు. కడుపు సమస్యల నుంచి ఉపశమనం పొందేందుకు సహాయపడుతుంది. జీర్ణ వ్యవస్థని సరిగా జరిగేలా చూస్తుంది.
నోటి దుర్వాసన పోగొడుతుంది: మీ నోరు చెడు వాసన వస్తుంటే కొద్దిగా పుదీనా ఆకులు నమిలితే ఆ వాసన పోతుంది. దంత సంరక్షణకి కూడా పుదీనా ఉపయోగపడుతుంది.
జలుబు తగ్గిస్తుంది: పుదీనాలో ఉండే మెంథాల్ జలుబు, తలనొప్పి నుంచి ఉపశమనం కలిగేలా చేస్తుంది. జలుబు లక్షణాలు దూరం చేయడంలో సహాయపడుతుంది. గొంతు, ఛాతిలో అసౌకర్యం లేకుండా చేస్తుంది. పుదీనా ఆకులతో ఛేసిన కషాయంతో నోరు పుక్కిలిస్తే గొంతు నొప్పి సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.
IBS సమస్యకి నివారణ: బవుల్ సిండ్రోమ్ అనేది ఒక సాధారణ జీర్ణ సమస్య. పుదీనా దీనికి బాగా పని చేస్తుంది. పుదీనా నూనె ఉపయోగించడం వల్ల IBS లక్షణాలు తగ్గించడంలో సహాయపడుతుంది.
పుదీనా ఆకుల్లో సాలిసిలిక్ ఆమ్లం అధికంగా ఉంటుంది. శరీరంలో చేరే హానికర ఫ్రీ రాడికల్స్ ను బయటకి పంపిస్తుంది. లివర్ ని శుభ్రం చేయడానికి పుదీనా రసం చక్కగా ఉపయోగపడుతుంది. వారానికి మూడు సార్లు పుదీనా రసం తీసుకోవడం వల్ల లివర్లో ఉండే వ్యర్థ, విష పదార్థాలు బయటకి వెళ్లిపోతాయి. పుదీనా తరచూ తీసుకోవడం వల్ల ఆస్తమా అదుపులో ఉంటుంది.
గర్భిణీలకి వచ్చే మార్నింగ్ సిక్ నెస్ ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అలర్జీలని తగ్గించడంతో పాటు సీజనల్ గా వచ్చే వ్యాధులకి అడ్డుకట్ట వేస్తుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Also read: బిర్యానీ ఆకు రుచే కాదు బోలెడు ఆరోగ్యాన్ని ఇస్తుందండోయ్
Also Read: బరువు తగ్గాలని అనుకుంటున్నారా? ఈ ఐదు ఫుడ్స్ ఎంపిక చేసుకుంటే సరి