Healthy Breakfast Recipe : బియ్యం పిండితో హెల్తీ రొట్టెలు.. కన్నడ స్టైల్ రెసిపీ
Karnataka Special Food Recipe : హెల్తీ, టేస్టీ బ్రేక్ఫాస్ట్ కావాలనుకుంటే మీరు బియ్యపు రొట్టెలను ట్రై చేయవచ్చు. వీటిని తయారు చేయడం చాలా తేలిక. పైగా ఇది కన్నడ స్టైల్ వంటకం.
Akki Rotti Recipe : కర్ణాటకలో బియ్యం పిండితో చేసే ఓ వంటకం మీకు ఆరోగ్యంతో పాటు మంచి రుచిని కూడా ఇస్తుంది. అదే అక్కిరోటీ. అక్కి అంటే కన్నడలో బియ్యం లేదా అన్నం అంటారు. బియ్యం పిండితో ఈ రోటీని చేస్తారు కాబట్టి దీనిని అక్కి రోటీ అంటారు. ఇది ఆ ప్రాంతంలో సాంప్రదాయమైన, ప్రసిద్ధి చెందిన వంటకం. దీనిని తయారు చేయడం చాలా తేలిక. కేవలం ఇంట్లో ఉండే పదార్థాలతో ఈ టేస్టీ రోటీలు తయారు చేసుకోవచ్చు. ఈ రెసిపీని ఎలా తయారు చేయాలి? కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
నీళ్లు - ఒకటిన్నర కప్పు
ఉప్పు - కొంచెం
జీలకర్ర - 1 టీస్పూన్
నూనె - 1 టీస్పూన్
బియ్యం పిండి - 1 కప్పు
పచ్చిమిర్చి -3
కరివేపాకు - 1 రెబ్బ
క్యారెట్ - 2
కొత్తిమీర - 1 కట్ట
ఉల్లిపాయలు - 2
తయారీ విధానం
ముందుగా ఉల్లిపాయలు, క్యారెట్, పచిమిర్చిని బాగా కడుగుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీరను చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. క్యారెట్ను బాగా తురుముకోవాలి. ఇప్పుడు స్టౌవ్ వెలిగించి దానిపై ఓ కడాయి పెట్టాలి. దానిలో కప్పున్నర నీళ్లు పోయాలి. నీరు మరుగుతున్నప్పుడు ఉప్పు వేయాలి. దానిలో జీలకర్ర వేసి బాగా మరగనివ్వాలి. దానిలో కాస్త నూనె వేయండి. అలా మరుగుతున్న నీటిలో కప్పు బియ్యం పిండిని దానిలో వేసి బాగా కలపాలి.
బియ్యం పిండి ముద్దలు కాకుండా మిశ్రమాన్ని బాగా కలపాలి. చేతితో కలిపితే కాలిపోయే ప్రమాదముంటుంది కాబట్టి స్పాచ్యూలాను ఉపయోగించి పిండిని మంచి ముద్దగా కలపాలి. ఇప్పుడు కడాయిపై మూత పెట్టి 5 నిమిషాలు మగ్గనివ్వండి. ఈ సమయంలో స్టౌవ్ ఫ్లేమ్ చిన్నగా ఉండాలి. అనంతరం స్టవ్ ఆపేసి.. మళ్లీ ఓ సారి గరిటతో తిప్పి చల్లారనివ్వండి. అనంతరం దానిలో తరిగిన ఉల్లిపాయ ముక్కలు, తురిమిన క్యారెట్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు వేయాలి. అన్ని బాగా కలిసేలా పిండిని కలుపుకోవాలి. కూరగాయల్లోని తేమ పిండిలోకి విడుదలయ్యేలా పిసుకుతూ పిండిని బాగా కలపాలి.
ఇప్పుడు బటర్ పేపర్ తీసుకోండి. లేదంటే అరిటాకు కూడా ఉపయోగించవచ్చు. దానికి కాస్త నూనె రాసి.. కొంచెం నూనెను మీరు కూడా చేతులకు అప్లై చేసుకోవాలి. తయారు చేసి పెట్టుకున్న పిండి నుంచి కాస్త ముద్ద తీసుకుని దానిని సన్నటి రొట్టెలా చపాతీ కంటే సన్నగా దానిని ఒత్తుకోవాలి. చేతితో ఒత్తుకుంటేనే మంచిది. చపాతీ కర్ర లాంటివి ఉపయోగిస్తే పిండి అంటుకుపోతుంది. ఇలా తయారు చేసుకున్న రోటికి మధ్యలో కాస్త రంధ్రాలు చేయండి. రోటిని వేయించడంలో ఈ రంధ్రాలు పనికొస్తాయి.
స్టౌవ్ వెలిగించి దానిపై తవా పెట్టండి. అది వేడి అయిన తర్వాత దానిపై కాస్త నూనె వేయండి. ఇప్పుడు తయారు చేసుకున్న రోటీని దానిపై వేయండి. రంధ్రాల్లో నూనె వేసి.. దోశ మాదిరిగా దానిని ఫ్రై చేయండి. ఒకవైపు వేగిన తర్వాత మరోవైపు దానిని తిప్పండి. దీనిని వేయిస్తున్నప్పుడు మంట మీడియంగా ఉండాలని గుర్తించుకోండి. ఇలా రెండు వైపులా కాల్చుకుంటే కన్నడ స్టైల్ రొట్టె రెడీ. దీనిని మీరు స్పైసీ చట్నీతో లేదా పొడులతో కలిపి తినొచ్చు. కొబ్బరి, వేరుశెనగ చట్నీలు దీనికి మంచి కాంబినేషన్. దీనినే మన తెలుగు రాష్ట్రాల్లో సర్వపిండి అని కూడా అంటారు.
Also Read : మహిళల ఆరోగ్యానికి ఈ లడ్డూలు ఎంతో మంచివి.. సింపుల్ రెసిపీ ఇదే