మీరు ఇంట్లో వాడుతున్న ఆయిల్ మంచిదేనా? కల్తీది అయితే ఈ పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు
వంట ఆయిల్ మంచిదో, కల్తీదో తెలుసుకునేందుకు ఇంట్లోనే ఈ చిన్న పరీక్షను చేయొచ్చు.
వంటింట్లో వంటనూనెదే ప్రధాన స్థానం. ఏం వండాలన్నా కూడా ఆయిల్ ఉండాల్సిందే. ఆయిల్ లేనిదే ఏ వంటా సిద్ధమవదు. సాధారణంగా కూరగాయలు, పండ్లు లాంటివి చూసి మంచివో, కాదో తెలుసుకోవచ్చు. కానీ ఆయిల్ కల్తీదో కాదో తెలుసుకోవడం మాత్రం చాలా కష్టం. దాదాపు అన్ని ఆహారపు ఉత్పత్తులను కల్తీ చేయడం ప్రారంభించారు. దీనివల్ల ఆరోగ్యపరంగా ఎన్నో నష్టాలు ఉంటాయి. అందుకే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సంస్థ కల్తీ ఆహార పదార్థాలను ఎలా కనిపెట్టాలో వివరిస్తుంది. అలా నూనె కల్తీదో లేదో ఇంట్లోనే ఎలా గుర్తించాలో చెబుతోంది. మీరు వాడే వంట నూనె మంచిదో కల్తీదో ఇప్పుడే తెలుసుకోండి.
వంట నూనెకు పసుపు రంగు రావడం కోసం చాలామంది మెటానిల్ అని పిలిచే పసుపు రంగును వాడుతున్నారు. ఇది ప్రమాదకరమైనది. దీన్ని మన దేశంలో నిషేధించారు. ఆహార పదార్థాలలో వాడడానికి వీలు లేదు. కానీ కొంతమంది వంట నూనెలకు పసుపు రంగు రావడం కోసం మెటానిల్‌ను ఉపయోగిస్తున్నారు. ఇలా మెటానిల్ ఉపయోగించిన నూనెలు కల్తీవని అర్థం. మెటానిల్ కలిపిన వంట నూనెలను వాడడం వల్ల మెదడుపై తీవ్ర ప్రభావం పడుతుంది. మెదడులో సెరటోనిన్, డోపమైన్ వంటి హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి సవ్యంగా పనిచేస్తేనే మనము మానసికంగా ఆరోగ్యంగా ఉండగలం. అలాగే ఏదైనా విషయాలను గ్రహించడం, పరిస్థితులను అర్థం చేసుకోవడం అనేది ఈ హార్మోన్ల పనితీరుపైన ఆధారపడి ఉంటుంది. ఎప్పుడైతే మెటానిల్ వల్ల ఈ హార్మోన్లు ప్రభావితం అయ్యాయో... మీరు నేర్చుకునే సామర్థ్యం తగ్గిపోతుంది. మానసికంగా స్థిరంగా ఉండలేరు. అందుకే మెటానిల్ కలిపిన ఆహార పదార్థాలను దూరంగా ఉంచాలి. సాధారణంగా నూనెలు పసుపు రంగులో ఉండవు. ఆలివ్ ఆయిల్ మాత్రం కాస్త పసుపు రంగులో ఉంటుంది. మిగతా నూనెలు పసుపు రంగులో ఉన్నాయంటే అవి కల్తీవని అర్థం చేసుకోవాలి.
ఇలా చేయండి
ఒక మిల్లీలీటర్ వంట నూనెను తీసుకుని ఒక టెస్ట్ ట్యూబులో వేయండి. దానికి నాలుగు మిల్లీలీటర్ల డిస్టిల్డ్ వాటర్ ను కలపండి. తర్వాత ఆ టెస్ట్ ట్యూబ్ ను బాగా షేక్ చేయండి. ఇప్పుడు అందులోని మిశ్రమంలో సగం మిశ్రమాన్ని మరొక ట్యూబులో వేయండి. ఆ ట్యూబ్ లో హైడ్రోక్లోరిక్ యాసిడ్ ను కలపండి. కాసేపు రెండు ట్యూబులను వదిలేయండి. ట్యూబులో పైపొర పసుపు రంగులా ఏర్పడితే, అది కల్తీదనే అర్థం. పైన ఎలాంటి పొర ఏర్పడకుండా నూనె అంతా ఒకే రంగులో ఉంటే అది మంచి ఆయిల్ అని అర్థం. ఇది చాలా సులువుగా ఇంట్లోనే చేసుకోవచ్చు.
Also read: అందంగా మెరవాలనుకుంటున్నారా? అయితే ఇలాంటి ఆహారాలను దూరం పెట్టండి
Also read: ఈ పండ్లు ఎక్కడైనా కనిపిస్తే కచ్చితంగా తినండి, గుండె జబ్బులు రాకుండా ఉంటాయి
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.