అందంగా మెరవాలనుకుంటున్నారా? అయితే ఇలాంటి ఆహారాలను దూరం పెట్టండి
అందంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే కొన్ని రకాల ఆహారాలను దూరం పెట్టాలి.
చర్మం ఎంత ఆరోగ్యంగా ఉంటే అంత కాంతివంతంగా కనిపిస్తుంది. కాబట్టి చర్మం కోసం ప్రత్యేకంగా కొన్ని రకాల ఆహారాలను దూరం పెట్టాలి. ఈ ఆహారాలను తినడం వల్ల చర్మ సమస్యలు వచ్చి అందం తరిగిపోతుంది. ఎలాంటి ఆహారాలను చర్మ సౌందర్యం కోసం తినాలో, ఎలాంటివి తినకూడదో తెలుసుకుందాం. మనదేశంలో ఎక్కువ మంది స్పైసీ ఫుడ్‌ను ఇష్టపడతారు. మసాలా దట్టించిన ఆహారం అంటే ఎంతో ఇష్టం. బిర్యానీ దగ్గరనుంచి మాంసాహారం వరకు అన్ని మసాలా దట్టించిన స్పైసీ ఆహారాలే. వాటిని తినేందుకు ఎంతోమంది ఉవ్విళ్లూరుతారు. అయితే ఇలాంటి ఆహారాలు తినడం వల్ల చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాగే చర్మం పేలవంగా కనిపిస్తుంది. దీనివల్ల అందంగా కనిపించరు. చర్మం కాంతివంతంగా కనిపించాలనుకుంటే కారం, మసాలా వేసిన ఆహారాన్ని చాలా తక్కువగా తినాలి.
ఘాటుగా, స్పైసీగా ఉన్న ఆహారాన్ని తినడం వల్ల అధిక రక్తపోటు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాటిలో ఉప్పు, మసాలాలు అధికంగా ఉంటాయి. రక్త పోటు పెరిగిందంటే గుండె సమస్యలు కూడా రావచ్చు. బీపీ ఉన్నవాళ్లు కేవలం ఉప్పును మాత్రం తగ్గిస్తే సరిపోదు, కారం, మసాలాలు కూడా చాలా తక్కువగా తీసుకోవాలి.
మసాలా నిండిన ఆహారం తీసుకోవడం వల్ల చర్మంలో తేమ తరిగిపోతుంది. దీనివల్ల చర్మం పొడిబారినట్టు కనిపిస్తుంది. చర్మం పొడి బారడం వల్ల దురదతో పాటు అనేక రకాల సమస్యలు వస్తాయి. చర్మం కాంతివంతంగా కనిపించదు. కాబట్టి చర్మం కోసం సాత్వికమైన ఆహారాన్ని తీసుకోవాలి. చర్మం ఎంతగా మెరిస్తే మీరు అంత అందంగా కనిపిస్తారని గుర్తుపెట్టుకోండి. అలాగే స్పైసి ఫుడ్ తినడం వల్ల బరువు కూడా త్వరగా పెరుగుతారు. ఎందుకంటే వాటిలో ఉండే క్యాలరీల సంఖ్య అధికం. స్పైసి ఫుడ్ ఎంత తిన్నా ఆకలిగా ఇంకా పెరుగుతుంది తప్ప తరగదు. కాబట్టి మీకు తెలియకుండానే ఎక్కువ ఆహారం తిని బరువు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి తగ్గించుకుంటే అవసరం.
తరుచూ స్పైసీ ఫుడ్‌ను ఇష్టపడే వారికి భవిష్యత్తులో పైల్స్ వచ్చే ప్రమాదం ఎక్కువ. అత్యంత కారంగా ఉండే ఆహారం తింటే పైల్స్ సమస్య పెరుగుతుందని కొన్ని అధ్యయనాలు చెప్పాయి. కాబట్టి భవిష్యత్తులో ఈ సమస్య బారిన పడకుండా ఉండాలంటే కారం తక్కువగా ఉండే ఆహారాలను తినాలి.
చర్మ సౌందర్యం కోసం విటమిన్ ఏ అధికంగా ఉండే ఆహారాలను తింటూ ఉండాలి. ఆకుకూరల్లో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది. అలాగే క్యారెట్, పాలు, గుమ్మడికాయ, టమాటో, బీన్స్, చేపలు, బఠానీలు వంటి వాటిలో కూడా విటమిన్ ఏ లభిస్తుంది. వీటిని తరచూ తినడం వల్ల మీ చర్మం కాంతివంతంగా మారుతుంది. పుదీనా, కాకరకాయ, నేరేడు పండ్లు, ఉసిరికాయలు, బూడిద గుమ్మడికాయ వంటి వాటితో చేసిన ఆహారాలను కూడా తరచూ తింటూ ఉండాలి. అయితే వీటిని స్పైసి ఆహారంగా మార్చుకొని తింటే ఎలాంటి ఉపయోగం ఉండదు. సాత్వికంగా కారం, ఉప్పు తగ్గించుకొని కూరగా వండుకొని తింటేనే మంచిది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.