Brown Bread: బ్రౌన్ బ్రెడ్ తినడం మంచిదేనా? ఇది తింటే సైడ్ ఎఫెక్టులు ఏమైనా ఉన్నాయా?
బ్రెడ్ వాడకం ఇటీవల కాలంలో విపరీతంగా పెరిగిపోయింది.
టిఫిన్లు చేసుకునే ఓపిక లేక చాలామంది బ్రెడ్ పై జామ్, బటర్ రాసుకొని తిని పనులకు వెళ్ళిపోతున్నారు. ఇలా తరుచూ బ్రెడ్ తినడం వల్ల ఆరోగ్యానికి మంచిది కాదని వివరిస్తున్నారు పోషకాహార నిపుణులు. బ్రెడ్ లో చాలా రకాలు ఉన్నాయి. మల్టీ గ్రైన్ బ్రెడ్, బ్రౌన్ బ్రెడ్, వైట్ బ్రెడ్ ఇలా అనేక రకాల బ్రెడ్‌లు తినే వాళ్ళు ఉన్నారు. అయితే వీటిలో వైట్ బ్రెడ్ తినడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. దీనిలో అధికంగా మైదానే ఉంటుంది. దీంతో శరీరంలో పిండి పదార్థం అధికంగా చేరుతుంది. బయట ఎక్కువగా తినేవారు అధిక రక్తపోటు బారిన త్వరగా పడతారు. గుండె సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది. ఈ పిండి పదార్థం తిన్న తర్వాత చాలా వేగంగా రక్తంలో కలిసిపోతుంది. దీనివల్ల చక్కెర స్థాయిలో పెరుగుతాయి. బ్రెడ్ తినడం వల్ల బరువు కూడా పెరుగుతారు. విటమిన్లు, మినరల్స్ వంటివి ఉండవు. కాబట్టి ఈ వైట్ బ్రెడ్ తినడం వల్ల ఎలాంటి ప్రయోజనమూ లేదు. ఆకలి తీరడం తప్ప. కాబట్టి వైట్ బ్రెడ్ తినకపోవడం మంచిది.
వైట్ బ్రెడ్ కన్నా బ్రౌన్ బ్రెడ్ తింటే ఆరోగ్యకరం. అలాగే మల్టీ గ్రైన్ బ్రెడ్ కూడా మేలే చేస్తుంది. బ్రౌన్ బ్రెడ్‌ను గోధుమలతో తయారు చేస్తారు. కాబట్టి ఎంతోకొంత ఆరోగ్యకరమైన చెప్పాలి. దీనిలో ఐరన్, జింక్, మెగ్నీషియం, కాపర్ వంటి పోషకాలు ఉంటాయి. అలాగే దీన్ని తినడం వల్ల విటమిన్ కె, విటమిన్ ఈ, విటమిన్ బి, మెగ్నీషియం, ఫైబర్ వంటి పోషకాలు కూడా అందుతాయి. బరువు తగ్గాలనుకునేవారు బ్రౌన్ బ్రెడ్ ను తినవచ్చు. దీన్ని తినడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం కూడా తగ్గుతుంది.
మానసిక ఆరోగ్యానికి కూడా బ్రౌన్ బ్రెడ్ ఎంతో మేలు చేస్తుంది. దీన్ని రోజుకు 1 లేదా రెండు ముక్కలు తింటే చాలు. మెదడు సెరటోనిన్ అనే హ్యాపీ హార్మోన్ ను విడుదల చేస్తుంది. ఈ హార్మోను ఒత్తిడిని తగ్గించడంతోపాటు రక్తపోటును అదుపులో ఉంచుతుంది. అలాగే నిద్రలేమి సమస్య నుంచి బయట పడేస్తుంది. ఈ బ్రౌన్ బ్రెడ్ గ్లైసేమిక్ ఇండెక్స్ కూడా చాలా తక్కువ. కాబట్టి మధుమేహం ఉన్నవారు కూడా దీన్ని తినవచ్చు. దీన్ని తినడం వల్ల డయాబెటిస్, క్యాన్సర్, గుండె జబ్బులు వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి.ఇవి శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడతాయి. కాబట్టి వైట్ బ్రెడ్ కి బదులు బ్రౌన్ బ్రెడ్ లేదా మల్టీ గ్రెయిన్ బ్రెడ్ ఎంచుకోవడం చాలా ఉత్తమం.
Also read: నేతితో పనీర్ జిలేబి, ఇంట్లోనే టేస్టీగా ఇలా చేసేయండి, చాలా సులువు
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.