International Womens Day : గౌరవం, ఆత్మవిశ్వాసం - మహిళా లోకానికి ఇదే సమాజం ఇవ్వాల్సిన కవచం !
మహిళాలోకంపై చూపించాల్సింది జాలి కాదు. ఉమెన్స్ డే రోజు మాత్రమే ప్రత్యేకంగా చెప్పే విషెష్ కాదు. వారికి గౌరవం ఇవ్వాలి. ఆత్మవిశ్వాసం ఇవ్వాలి. వారిని అన్ని విషయాల్లోన సమానంగా చూస్తే అదే అసలైన ఉమెన్స్ డే అవుతుంది.
ప్రతి ఏటా మహిళా దినోత్సవాలు జరుపుకుంటున్నాం. కానీ వారికి ఏం ఇవ్వాలో సమాజం గుర్తిస్తుందా ?అన్నది ఎప్పటికీ సందేహమే. మహిళలను గౌరవించడానికి.. మహిళలను ప్రోత్సహించడానికి.. మహిళా శక్తిని గుర్తించడానికి.. మహిళలను ముందు ఉండి నడిపించడానికి.. ప్రత్యేకంగా ఓ రోజు అక్కర్లేదు. కనిపెంచిన అమ్మను గౌరవించినట్లే మహిళలందర్నీ గౌరవిస్తే ప్రతి రోజు ఉమెన్స్ డేనే. రోడ్డు మీద కనపడిన స్రీని నిజంగా స్త్రీగా గౌరవిస్తే ప్రతీ నిమిషం ఉమెన్స్ డేనే. నానమ్మ మాటలు వింటూ, అమ్మమ్మ సలహాలు పాటిస్తూ మన జీవితంలో ఉన్న ప్రతీ స్త్రీకి నిజమైన ప్రాధాన్యత ఇస్తే.. వాళ్లను నెత్తిన పెట్టుకోకపోయినా, చాదస్తం అనే చేష్టతో వారిని అవమానించకుండా వారి స్పూర్తితో ముందుకి నడిస్తే.. అదే నిజమైన ఉమెన్స్ డే.
మహిళల్ని గౌరవించిన ప్రతీ రోజూ ఉమెన్స్ డేనే !
" ఎక్కడ మహిళలు గౌరవాన్ని పొందుతారో అక్కడ దేవతలు నివాసముంటారు; పూజలందుకొంటారు. మహిళలు గౌరవింపబడని చోట ఎటువంటి శుభాలు చేకూరవు; ఎంత గొప్ప సత్కార్యాలయినా ఫలించవు" అనే శ్లోకాలు, సూక్తులు, సిద్ధాంతాలు మనకు నిత్య జీవితంలో ఎన్నో కనిపిస్తూ ఉంటాయి. మహిళల్ని దేవతలు గా కొలిచే ఒక గొప్ప పవిత్ర దేశం మన భారతదేశం అని ఎంతో గొప్పగా మన గురించి మనం చెప్పుకొంటాం. కానీ చేతల్లో మాత్రం చాలా దూరంగా ఉంటాం. ఆడవారిని మనమందరం కచ్చితంగా గుర్తించితీరాలి. గౌరవించి తీరాలి. చేయూతనివ్వాలి. రక్షించాలి. జీవితంలో ఎందరో స్త్రీలు కనపడతారు. వాళ్ల పాత్ర చాలా ఉంటుంది. ఆఫీస్ కి వెళ్తే స్వీపర్ నుంచి బాస్ వరకు.. సినిమాకు వెళ్తే చెకింగ్ నుంచి స్క్రీన్ మీద హీరోయిన్ వరకు.. బండి తోలితే బెగ్గర్ నుంచి కారులో వెళ్లే ఆఫీసర్ వరకు.. ఇంట్లో పని మనిషి నుంచి అమ్మ వరకు, బంధువుల్లో పిన్ని నుంచి మేనత్త వరకు.. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతీ స్త్రీ మన జీవితంలో ఏదోక పాత్ర పోషిస్తూనే ఉంటుంది. కాబట్టి వాళ్లను వాళ్లగా గౌరవించడం అనేది నిజమైన ఉమెన్స్ డే.. వాళ్లను వాళ్లగా చూడడం, వాళ్లను దిగజార్చి మాట్లాడకుండా ఉండడమే నిజమైన ఉమెన్స్ డే.. స్త్రీతో కలిసి నడవండి.. కానీ స్త్రీని అవమానించని ప్రతీ రోజూ ఓ ఉమెన్స్ డేనే.
మహిళల మనసుల్లో ఆత్మవిశ్వాసం నింపితే అద్భుతాలు !
మహిళా దినోత్సవానికి పునాది వేసిన అమెరికాలోనే ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఒక మహిళ అధ్యక్ష పదవికి ఎన్నిక కాకపోవడమే పురుషులకు.. స్త్రీలకు మధ్య ఎంత అంతరం ఉందో అర్థం అవుతుంది. ప్రతి రోజు ఏదో ఒక చోట లైంగిక వేధింపులు, పురిట్లోనే చిదిమేయడాలు మన దేశంలో సర్వ సాధారణంగా మారిపోయాయి. స్త్రీని ఓ ఆట వస్తువుగా చూసే సమాజాలు నేటికి ఉన్నాయి.ఇప్పటికీ మన దేశంలో మహిళలు కేవలం గృహిణులుగానే మిగిలిపోతున్నారు. చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ సమానమైన వేతనం, కూలీలు ఇవ్వడం లేదన్నది సుస్పష్టంగా కనిపిస్తుంది. నేటికీ మహిళగానూ, శ్రామిక మహిళగానూ, పౌరురాలిగానై దోపిడీకి గురౌతూనే ఉంది. ఇన్ని సమస్యలున్నా కొందరు విజయం వైపు దూసుకెళ్తూ దేశానికి గర్వకారణంగా నిలుస్తున్నారు. నేటి మహిళలు అన్ని రంగాల్లోనూ దూసుకెళ్తూ.. తమ సత్తా చాటుకుంటున్నారు. సైన్యంలో, సైన్సులో, రాజకీయాల్లో, కళల్లో మెరుపులు మెరిపిస్తున్నారు. కానీ చాలా పరిమితమే. !
వివక్ష, జాలి చూపించడం ఆపేసి సమానంగా చూడాలి !
దేశంలో నేటికీ ఇంకా బాలికా విద్య, మహిళా సమానత్వం, సాధికారత, అభివృద్ధి, చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లు అందని ద్రాక్షలాగా మారాయి. నాటికి నేటికి అక్షరాస్యత పెరిగి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రపంచమే కుగ్రామంగా మారినప్పటికీ మహిళలపై ఇంకా వివక్షత కొనసాగుతోంది. ఆడపిల్ల చదువంటే పెరట్లో చెట్టుకు నీళ్లు పోసినట్టుగానే ఇంకా చాలా మంది భావిస్తున్నారు. ఆమె తల్లిలా లాలిస్తుంది. చెల్లిగా తోడుంటుంది. భార్యగా బాగోగులు చూస్తు.. దాసిలా పని చేస్తుంది. కుటుంబ భారాన్ని మోస్తూ సర్వం త్యాగం చేస్తుంది. స్త్రీ లేకపోతే జననం లేదు. స్త్రీ లేకపోతే గమనం లేదు. స్త్రీ లేకపోతే సృష్టి జీవం లేదు. స్త్రీ లేకపోతే అసలు సృష్టే లేదు. కంటిపాపలా కాపాడే స్త్రీ మూర్తికి ఆమె. అమ్మాయి పుట్టినప్పటి నుంచి కుటుంబంలో.. సమాజంలో ఎన్నో ఆంక్షలను ఎదుర్కొంటుంది. వెనకబడిన దేశాల్లోనే కాదు.. అగ్రరాజ్యాలుగా దూసుకెళ్తున్న సమాజంల్లోనూ చాలా వరకూ మహిళలకు అవకాశాలు తక్కువే ఉన్నాయి.
సమాజంలో చైతన్యం వచ్చినప్పుడే అసలైన సాధికారిత !
ఇప్పటికైనా మహిళలు అన్ని రంగాల్లో సమానత్వం సాధించేలా ప్రత్యేకంగా సమాజంలో చైతన్యం కలిగించాలి. మహిళలు తమ కాళ్లపై తాము నిలబడేలా ప్రోత్సహిస్తూ వారికి సురక్షిత వాతావరణాన్ని కల్పించాలి. చట్టాలు చేసినంత మాత్రాన మార్పు రాదు. సమాజంలో కూడా మార్పు వచ్చేలా ప్రత్యేక చర్యలు, కార్యక్రమాలు చేపట్టాలి. మహిళలకు గౌరవం పెంచేలా సమాజాన్ని చైతన్య పరచాలి. అప్పుడే నిజమైన మహిళా సాధికారిత వస్తుంది.