Heart Problems: ఈ ఏడు లక్షణాలు కనిపిస్తే, మీరు వెంటనే కార్డియాలజిస్టును సంప్రదించాల్సిందే
కొన్ని రకాల లక్షణాలను తేలికగా తీసుకోకూడదు. అవి గుండెపోటుకు కారణం అవుతాయి.
చాలామంది ఏదైనా ఆరోగ్య సమస్య కనిపిస్తే వైద్యులను కలవడానికి ఎక్కువ సమయం తీసుకుంటారు. కానీ గుండె సమస్యల విషయంలో అలాంటి అజాగ్రత్త అనర్ధానికి దారితీస్తుంది. గుండెకు సంబంధించి కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తే వెంటనే కార్డియాలజిస్టును కలవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గుండెకు వైద్య సహాయం కావాలనిపిస్తే అది కొన్ని సూచనలను మనకు తెలియజేస్తుంది. ఆ సూచనలను తేలిగ్గా తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తే గుండెపోటు, గుండె వైఫల్యం వంటివి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ చెప్పిన కొన్ని లక్షణాలు మీలో కనిపిస్తే వెంటనే ఓసారి గుండె వైద్యులను సంప్రదించి, గుండెను చెక్ చేయించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి సంవత్సరం రెండుసార్లు గుండెను తనిఖీ చేయించుకోవడం చాలా అవసరం. ఎందుకంటే మన శరీరంలోని ప్రధాన అవయవాల్లో గుండె కూడా ఒకటి. దీనికి ఏమైనా అయితే ప్రాణానికే సమస్య.
డయాబెటిస్ గుండెను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. కానీ ఈ విషయంపై చాలా తక్కువ మందికి అవగాహన ఉంది. మీ రక్తంలో చక్కెర స్థాయిలు అస్థిరంగా ఉంటే మీరు వెంటనే మీ హృదయం పట్ల జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. చక్కెర స్థాయిలు అధికంగా ఉన్నప్పుడు రక్తనాళాలు దెబ్బతింటాయి. దీనివల్ల గుండెకు హాని కలుగుతుంది. కాబట్టి రక్తంలో చక్కెర స్థాయిలు అధికంగా ఉన్నప్పుడు ఓసారి గుండె వైద్యులను సంప్రదిస్తే మంచిది.
మీరు రెగ్యులర్ గా కలిసే ఫిజీషియన్ మిమ్మల్ని ఒకసారి కార్డియాలజిస్టును సంప్రదించమని సూచించినట్లయితే దాన్ని తేలిగ్గా తీసుకోవద్దు. ఎందుకంటే ఎప్పుడూ మీకు చికిత్స చేస్తున్న ఒక వైద్యుడు అలా గుండె వైద్యుల్ని కలవమని చెప్పారంటే అతనికి ఏదైనా సందేహం ఉందేమోనని అర్థం. మీ ఆరోగ్యాన్ని కాపాడడం కోసమే ఆయన అలా చెప్పి ఉంటాడు. కాబట్టి ఖచ్చితంగా గుండె వైద్యులను సంప్రదించండి.
మీకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అనిపిస్తున్నట్లయితే ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించండి. శ్వాస సరిగా ఆడక పోవడానికి గుండెకు సంబంధించిన పరిస్థితి కారణమైతే దాన్ని వెంటనే గుండె వైద్యులు పరీక్షల ద్వారా తెలుసుకుంటారు. ఇంటి పనులు చేయడం, మెట్లు ఎక్కడం వంటి తక్కువ శారీరక శ్రమలు ఉన్న పనులు చేస్తున్నప్పుడు కూడా శ్వాస ఆడకపోతే అది గుండెకు సంబంధించిన సమస్య కూడా అయి ఉండవచ్చు.
ఛాతీలో నొప్పి రావడం కూడా గుండెకు సంబంధించి అవకాశం ఉంది. కాబట్టి పదేపదే ఛాతీ నొప్పులు వస్తుంటే తేలిగ్గా తీసుకోకుండా వెంటనే వైద్యులను సంప్రదించండి.
కొలెస్ట్రాల్ స్థాయిలు అధికంగా ఉన్నా కూడా గుండెకు ముప్పు తప్పదు. మీ కొలెస్ట్రాల్ స్థాయి సాధారణంగా ఎక్కువగా ఉందని అనిపిస్తే వెంటనే గుండె పరీక్షలు చేయించుకోవడం అవసరం.
ఒకే చోట ఎక్కువ గంటలపాటు కూర్చోవడం మానేయండి. ఎంతగా శారీరక శ్రమ చేస్తూ ఉంటే అంత మంచిది. అలా అని జిమ్‌లో పెద్ద బరువైన వర్కౌట్స్ చేస్తూ, గుండె పై ఒత్తిడి పెంచొద్దు. ఇంటి పనులతోనే గుండెకు ఆరోగ్యాన్ని ఇవ్వచ్చు. మెట్లు ఎక్కడం, దిగడం ఇంట్లో పనులు చేసుకోవడం, బయటకు వాకింగ్ కు వెళ్లడం వంటివి చేస్తే చాలు గుండెకు ఎంతో మంచిది.
Also read: మీరు వాడుతున్న పసుపు కల్తీదో, స్వచ్ఛమైనదో, ఇంట్లోనే ఇలా తెలుసుకోండి
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.