Leftover Rice: అన్నం మిగిలిపోతే ఇలా ఇడ్లీ, దోశెలు, గుంట పొంగనాలు చేసుకోండి
అన్నం మిగిలి పోవడం అనేది చాలా సాధారణ విషయం.
అందరి ఇళ్లల్లో వండిన అన్నం ఎంతోకొంత మిగిలిపోతూనే ఉంటుంది. అన్నాన్ని అన్నపూర్ణేశ్వరి దేవితో పోలుస్తారు. రోజూ పడేయాలంటే చాలా బాధపడతారు కొంతమంది.మిగిలిన అన్నాన్ని పారబోయాల్సిన అవసరం లేకుండా ఉదయాన వేడి వేడి టిఫిన్లుగా మార్చుకోవచ్చు.ఇడ్లీ, దోశె, గుంట పొంగనాలు వంటివి చేసుకోవచ్చు. చేయడం కూడా చాలా సులువు.
ఇడ్లీ
అన్నం - రెండు కప్పులు
ఇడ్లీ రవ్వ - ఒక కప్పు
ఉప్పు - తగినంత
నీళ్లు - తగినన్ని
నూనె - సరిపడినంత
ఇడ్లీ రవ్వను ఒక గంట ముందే గిన్నెలో వేసి నానబెట్టుకోవాలి. మిక్సీలో అన్నాన్ని మెత్తగా రుబ్బుకోవాలి. అవసరమైతే నీరు కలుపుకోవచ్చు. వదులు జావలా అన్నాన్ని రుబ్బుకున్నాక అందులో ఇడ్లీ రవ్వను కలుపుకోవాలి. తగినంత ఉప్పు కలుపుకోవాలి. ఇడ్లీ ప్లేట్లకు కాస్త నూనె రాసి రుబ్బును వేసుకోవాలి. ఇడ్లీ తయారయ్యాక కొబ్బరి చట్నీతో తింటే ఎంత రుచిగా ఉంటాయో.
దోశె
అన్నం - రెండు కప్పులు
బియ్యంప్పిండి - ఒక కప్పు
గోధుమ పిండి - అర కప్పు
పుల్లటి పెరుగు - ఒక కప్పు
ఉప్పు - రుచికి తగినంత
నీళ్లు - తగినన్ని
శెనగపప్పు - ఒక స్పూను
మిక్సీలో అన్నం, బియ్యంప్పిండి, గోధుమ పిండి, పుల్లటి పెరుగు, శెనగ పిండి, నీళ్లు , ఉప్పు వేసి మెత్తగా పేస్లుగా చేసుకోవాలి. దోశెలు వేయాడానికి ఎంత వదులుగా జారాలో అలా వచ్చేలా నీళ్లు కలుపుకోవచ్చు. ఆ రుబ్బుతో పలుచటి దోశెలు వేసుకోవాలి. ఇవి టేస్టీగానే కాదు, క్రిస్పీగా కూడా వస్తాయి.
గుంట పొంగనాలు
అన్నం - రెండు కప్పులు
ఉల్లి తరుగు - పావు కప్పు
పచ్చిమిర్చి తరుగు - రెండు స్పూనులు
కొత్తిమీర తరుగు - మూడు స్పూనులు
కరివేపాకు తరుగు - రెండు స్పూనులు
జీలకర్ర - అర టీస్పూను
పసుపు - చిటికెడు
గోధుమ రవ్వ - ఒక టేబుల్ స్పూను
పెరుగు - ఒక టేబుల్ స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - సరిపడా
మిక్సీలో గిన్నెలో అన్నం, పసుపు, పెరుగు, గోధుమ రవ్వ, ఉప్పు, జీలకర్ర వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఆ రుబ్బులో ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి తరుగు, కొత్తిమీర తరుగు, కరివేపాకు తరుగు అన్ని వేసి బాగా కలుపుకోవాలి. అవసరమైతే నీళ్లు కలుపుకోవచ్చు. ఆ మిశ్రమాన్ని గుంట పొంగనాల ట్రేకు కాస్త నూనె రాసి అందులో వేసుకోవాలి. బాగా వేగాక కొబ్బరి చట్నీతో తింటే చాలా టేస్టీగా ఉంటాయి.
Also read: బీపీ అధికంగా పెరిగిపోతే ఏమవుతుంది? పెరగకుండా ఉండాలంటే ఏం చేయాలి?
Also read: వారానికి రెండు సార్లు ఈ పండు తింటే చాలు, గుండె జబ్బులొచ్చే అవకాశం తగ్గుతుంది