Whiten Teeth: పళ్లు తెల్లగా మెరవాలంటే ఏం చేయాలి? డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా... మీరు ఇంట్లో చేసుకునేందుకు సులువుగా
సహజ పద్ధతిలో పళ్లని మెరిసిపోయేలా చేసేందుకు పలు పద్ధతులు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
పళ్లు తెల్లగా ఉండాలని అందరూ ప్రయత్నిస్తుంటారు. కాస్త ఎక్కువ సమయం బ్రష్ చేద్దామంటే... ఉరుకుల పరుగుల జీవితంలో జరగని పని. అసలు పళ్లు రంగు ఎలా మారతాయంటే... పొగ తాగే అలవాటు, ఆల్కహాల్ స్వీకరించడం, నీటిలో ఉండే ఫ్లోరైడ్ ఎక్కువ శాతం ఉండడం వల్ల పళ్లు రంగు మారేందుకు కొన్ని కారణాలు.
పళ్ళు తెల్లగా చేసే ట్రీట్మెంట్లో బ్లీచ్, హైడ్రోజెన్ పెరాక్సైడ్ వంటి కెమికల్స్ వాడతారు. పళ్లకి ఉండే ఎనామిల్, గమ్స్‌కి తక్కువ హాని జరిగేలా రేడియేషన్‌తో కలిపి వాడతారు. దీనికి ముందు పళ్లని క్లీన్ చేయడం, పాలిష్ చేయడం వంటివి రికమెండ్ చేస్తారు.
సహజ పద్ధతిలో పళ్లని మెరిసిపోయేలా చేసేందుకు పలు పద్ధతులు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
ఆయిల్ పుల్లింగ్ (Oil Pulling)
టేబుల్ స్పూన్ కొబ్బరి నూనెను నోట్లో పోసుకుని పుక్కిలించాలి. అలా ఓ 10 నిమిషాలు చేసిన తరువాత ఆ నూనెను ఉమ్మివేయాలి. తర్వాత నీటితో నోరును కడుక్కుని శుభ్రంగా బ్రష్ చేసుకోవాలి.
బొగ్గు పొడి (Activated Charcoal)
బొగ్గు ద్వారా దంతాలకు మేలు జరుగుతుంది. దంతాలను మెరిసేలా చేయడంతో పాటు నోటిలోని విషపూరితాలను, బ్యాక్టీరియాలను తరిమికొడుతుంది. కొంత బొగ్గును తీసుకుని పొడిగా చేసుకోవాలి. ఆ పొడిని పళ్లు తోమాలి. దీని వల్ల దంతాలు మెరుస్తాయి.
బేకింగ్ సోడా (Baking Soda)
దంతాలను తెల్లగా మార్చే గుణం బేకింగ్ సోడాకి ఉంది. దీన్ని కొన్ని రకాల టూత్ పేస్టులలో సైతం వాడతారు. కొంచెం బేకింగ్ సోడా పౌడర్‌ని వాటర్‌తో కలిపి పేస్టులా చేయాలి. ఈ పేస్టుతో ప్రతి రోజూ రెండు సార్లు బ్రష్ చేస్తే... కొద్ది రోజులకి మీ పళ్లు తెల్లగా మెరవడం ఖాయం.
యాపిల్ సైడర్ వెనిగర్
వాస్తవానికి యాపిల్ సైడర్ వెనిగర్ దంతాలకే కాదు మన శరీరంలోని పలు అవయవాలకు మేలు చేస్తుంది. ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకుని కొన్ని నీళ్లల్లో వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని నోట్లో పోసుకుని పుక్కిలించాలి. రోజూ బ్రష్ చేసే ముందు ఇలా చేస్తే మీరే మార్పును గమనిస్తారు.
పండ్ల తొక్కలు (Fruit Peels)
అరటి పండు, బత్తాయి, సంత్రా, నిమ్మకాయ తొక్కల్లో సిట్రిక్ ఆమ్లం ఉంటుంది. అది మీ దంతాలను తెలుపు రంగులోకి తీసుకువస్తుంది. ప్రతి రోజూ బ్రష్ చేసే ముందు అరటి పండు లేదా బత్తాయి లేదా నిమ్మకాయ తొక్కలతో దంతాలను రుద్దాలి. ఆ తరువాత బ్రష్ చేస్తే దంతాలు తెలుపు రంగులోకి మారతాయి.