PCOS: ఆ సమస్యా ఉన్నా ఇలా చేస్తే పిల్లలు పుట్టే ఛాన్స్
పెళ్లయిన జంటలు ఎదురు చూసేది తమ ప్రతిరూపాల కోసమే. కానీ పీసీఓఎస్ వంటి కొన్ని సమస్యలు వారికి ఆ ఆనందాన్ని దూరం చేస్తున్నాయి.
లోకంలోని అమ్మతనానికి ఉన్న విలువ దేనికీ లేదు. అమ్మా అని పిలుపించుకోవాలని కోరుకోని స్త్రీ ఎవరుంటారు? కానీ ప్రపంచంలో ఎంతో మంది అమ్మతనం కోసం అల్లాడుతున్నారు. కొన్ని ఆరోగ్యసమస్యలు వారిని తల్లితనానికి దూరం చేస్తున్నాయి. వాటిలో ముఖ్యమైనది ‘పీసీఓఎస్’. ప్రతి ఏడుగురి మహిళల్లో ఒకరికి ఈ సమస్య ఉన్నట్టు సర్వేలో తేలింది. పీసీఓఎస్ అంటే పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్. ఇది ఓ దీర్ఘకాలిక సమస్య. దీనివల్ల హార్మోన్ల సమతుల్యత లోపిస్తుంది. బరువు పెరుగుతారు. పురుషుల్లో ఉండే ఆండ్రోజెన్స్ అనే హార్లోన్లు మహిళల్లో పెరగడం వల్ల ఈ పీసీఓఎస్ సమస్య ఏర్పడుతుంది. దీనివల్ల అండం విడుదల కాకపోవడం, రుతుక్రమం సరిగా రాకపోవడం వంటివి కలుగుతాయి. ఈ మొత్తం ప్రభావం గర్భధారణపై పడుతుంది. ఈ సమస్య ఉన్నవారు త్వరగా గర్భం ధరించలేరు. అయితే పీసీఓఎస్ ఉన్నప్పటికీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా గర్భం ధరించవచ్చని చెబుతున్నారు గైనకాలజిస్టులు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరిస్తున్నారు.
1. పీసీఓఎస్ సమస్య ఉందని తెలియగానే స్త్రీలలో మానసిక ఆందోళన పెరిగిపోతుంది. తాము తల్లికాలేమనే బాధ ఎక్కువైపోతుంది. ముందుగా ఆ భయాన్ని వదిలేయాలి. మానసికంగా గట్టిగా ఉండాలి. లేకుంటే హర్మోన్ల అసమతుల్యతపై ఇంకా ప్రభావం పడుతుంది.
2. హార్మోన్ల అసమతుల్యత వల్లే బరువు పెరుగుతారు. ఇది ఊబకాయానికి కూడా దారితీయవచ్చు. అప్పుడు గర్భం ధరించే అవకాశాలు ఇంకా తగ్గిపోతాయి. కాబట్టి బరువు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోండి. ఎప్పటికప్పుడు బరువు చెక్ చేసుకుంటూ ఉండండి. మీ బాడీ మాస్ ఇండెక్స్ 18.5 నుంచి 24.9 మధ్యలోనే ఉండేట్టు చూసుకోండి. బరువు తగ్గాకే పిల్లల కోసం ప్రయత్నించండి.
3. పీరియడ్స్ ప్రతినెలా సక్రమంగా వచ్చేలా చూసుకోవాలి. రాకుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. బరువు తగ్గడం వల్ల పీరియడ్స్ కూడా క్రమంగా వచ్చే అవకాశం ఉంది. అలాగే పీసీఓఎస్ కు సంబంధించి వైద్యులు ఇచ్చిన మందులు కూడా వాడుతుండాలి. అన్ని సక్రమంగా ఉంటే గర్భధారణ అవకాశం కూడా పెరుగుతుంది.
4. అండోత్పత్తి సమయంలో కలయికలో పాల్గొంటే గర్భం ధరించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అండోత్పత్తి ఎప్పుడు అవుతుందో తెలుసుకునేందుకు ఓవులేషన్స్ కాలిక్యులేటర్స్, యాప్స్ అందుబాటులో ఉన్నాయి. అవి మీ ఫోన్ లో డౌన్ లోడ్ చేసుకుని మీ పీరియడ్స్ సంబంధించిన వివరాలు నమోదు చేయాలి. ఆ యాప్ ఒక అంచనా వేసి మీకు అండోత్పత్తి ఎప్పుడు జరుగుతుందో చెబుతుంది. ఆ రోజుల్లో ప్రయత్నిస్తే మంచి ఫలితం ఉండొచ్చు.
5. పీసీఓఎస్ సమస్య ఉన్న మహిళల్లో ఇన్సులిన్ స్థాయులు కూడా అధికంగా ఉంటాయి. కాబట్టి గర్భధారణకు ప్రయత్నించడానికి ముందే రక్తంలోని చక్కెర స్థాయులను కూడా అదుపులో ఉంచుకోవాలి. ఇందుకోసం మంచి ఆహరాన్ని తినాలి. చక్కెర అధికంగా ఉండే ఆహారాన్ని దూరం పెట్టాలి. ఇందుకు ఆహారనిపుణుల సలహాను తీసుకోవాలి.
6. చాలా మంది స్త్రీలలో విటమిన్ డి లోపం కనిపిస్తుంది. అది లేకుండా చూసుకోవాలి. నీరెండలో నిల్చోవడం, గుడ్లు, చేపలు తినడం వంటివి చేయాలి.
ఈ మొత్రం ప్రక్రియలో అన్నింటికన్నా ముఖ్యంగా వైద్యుల సూచనలతోనే ముందుకు వెళ్లడం మంచిది.
ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.
Also read: డయాబెటిస్ రోగులు కూడా హ్యాపీగా తినొచ్చు... తింటే ఎన్ని లాభాలో
Also read: రోజూ ఇలా పసుపు నీళ్లు తాగితే... ఊహించని ప్రయోజనాలు
Also read: రుచి, వాసనా గుర్తించలేకపోతున్నారా? తేలికగా తీసుకోకండి, కారణాలు ఇవి కావచ్చు
Also read: ఒకే కాన్పులో తొమ్మిది మంది పిల్లలు... రోజుకు వంద డైపర్లు, ఆరు లీటర్ల పాలు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి