Relationships: డబ్బుల కోసం వేధించే భర్తతో వేగడం ఎలా?
డబ్బులకే విలువిచ్చే తన భర్తతో జీవించలేకపోతున్నాను అని చెబుతున్న ఒక భార్య కథ ఇది.
ప్రశ్న: మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త బిజినెస్ చేస్తారు అతనికి నేను ఉద్యోగం చేయడం ఇష్టం ఉండదు. దీనివల్ల నేను ఇంట్లోనే ఉంటున్నాను. ఆ వ్యాపారంలో లాభం వస్తే నాకు చెప్పడు. కానీ నష్టం వస్తే మాత్రం నాకు చెబుతాడు. మా పుట్టింటి వారి దగ్గర నుంచి డబ్బులు తీసుకురమ్మని అడుగుతాడు. అలా అని మా పుట్టింటి వాళ్ళు అంటే గౌరవం కూడా లేదు. చాలా చులకన చేసి మాట్లాడుతూ ఉంటాడు. నా పుట్టింటి వాళ్ళు డబ్బులు ఇవ్వలేమని అంటే సాయం చేయరంటూ తిడుతూనే ఉంటాడు. ఇప్పటికే మా వాళ్ళు ఎన్నోసార్లు అతనికి డబ్బులు ఇచ్చారు కానీ ఇంతవరకు తిరిగి ఇవ్వలేదు. ముగ్గురు పిల్లలు ఉన్న నా తండ్రి ఇక డబ్బులు ఇవ్వలేనని చెప్పేసారు. దాంతో అతను మరింతగా రెచ్చిపోతున్నాడు. ప్రతి చిన్న విషయానికి అరుస్తున్నాడు. నామీద కోపాన్ని చూపిస్తున్నాడు. పిల్లలను కూడా నోటికి వచ్చినట్టు తిడుతున్నాడు. నన్ను, పిల్లల్ని అప్పుడప్పుడు కొడతాడు. ప్రతిసారి మీ పుట్టింటికి వెళ్లి డబ్బు తీసుకురమ్మని వేధిస్తూ ఉంటాడు. ఇలాంటి వ్యక్తితో ఎక్కువ కాలం జీవించలేనేమో అనిపిస్తోంది. ఇతడిని నమ్మి నేను నా కెరియర్ ని కూడా వదిలేసుకున్నాను. ఇప్పుడు ఉద్యోగం వెతుక్కోవడం కూడా కష్టంగానే అనిపిస్తుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇతనితో కలిసి జీవించడం కష్టం అలాగని పుట్టింట్లో చేరలేను. పిల్లలకు ఏమని చెప్పాలో అర్థం కావడం లేదు. ఇతను చేత తిట్లు, దెబ్బలు తింటూ జీవితాంతం ఉండలేని పరిస్థితి. ఏం చేయాలో సలహా ఇవ్వండి.
పరిష్కారం: మీ సమస్య కాస్త బాధాకరమైనది. అతని కోసం మీ చదువును, కెరియర్‌ను త్యాగం చేసి అతనే లోకంగా మీరు వచ్చారు. కానీ అతనికి మాత్రం మీ విలువ తెలియడం లేదు. డబ్బు చుట్టూనే ఆయన ఆలోచనలు తిరుగుతున్నాయి. లాభం వచ్చినప్పుడు మీ పుట్టింటి వారి అప్పు తీరుస్తే, వారు మళ్లీ ఇచ్చే అవకాశం ఉండేది. లాభాలు ఇతను తీసుకొని నష్టాలు వచ్చినప్పుడు మాత్రం మీ పుట్టింటి వారిపై ఆధారపడుతున్నాడు. అందుకే వారు ఇక ఇవ్వలేమని చెప్పి ఉంటారు. ఎవరైనా సరే ఒకటి రెండు సార్లు ఇస్తారు. పదేపదే ఇవ్వడం ఎవరికీ సాధ్యం కాదు. మీరు చెబుతున్న ప్రకారం మీ భర్త ఒక డబ్బు మనిషి. డబ్బుకు ఇచ్చే విలువ మనుషులకి ఇవ్వడు. కాబట్టే మిమ్మల్ని మీ పిల్లలను కూడా కొడుతున్నాడు. అతనికి డబ్బు ఉంటే చాలు డబ్బుతోనే గౌరవం వస్తుందని భావిస్తున్నాడు. నిజానికి చుట్టూ నా అనే మనుషులు లేకపోతే ఎంత కష్టంగా ఉంటుందో ఆయనకు తెలియడం లేదు.
ఇలాంటి పరిస్థితుల్లో మీరు చాలా ధైర్యంగా ఉండాలి. ముందడుగు వేసే ముందు ఆలోచించుకోవాలి. మీకు ఉన్న ప్రతి హక్కును వినియోగించుకోవాలి. ఒట్టి చేతులతో బయటకు వచ్చి బతకలేరు. మీ పిల్లలకు మీకు ఏదో ఒక భరోసా ఉండాలి. అది మీరు కోర్టు ద్వారా సాధించుకుంటారో లేక పెద్దల ద్వారా సాధించుకుంటారో మీరే నిర్ణయించుకోండి. ముందుగా అడుగు వేయడానికి కావలసిన శక్తిని కూడదీసుకోండి. మీ పుట్టింటి వారి సాయం మీకు చాలా అవసరం. అతని గురించి వివరించి పెద్దల్లో పంచాయతీ పెట్టండి. అతను మారితే పర్వాలేదు... లేకుంటే మీరే ధైర్యంగా నిలబడాల్సి ఉంటుంది. మీ కెరియర్‌ను మళ్ళీ మొదలు పెట్టాల్సి ఉంటుంది. అందుకు మీ పుట్టింటి వారి సాయం తీసుకోండి. పిల్లలకు ప్రేమ కరువు అవ్వకుండా మీ తల్లిదండ్రులు దగ్గరగా ఉంచండి. మీరు సంపాదించి మీ పిల్లల్ని చదివించుకోండి. తండ్రి ద్వారా వచ్చే ఏ ఆస్తి అయినా పిల్లలకు దక్కుతుంది. కాబట్టి దాని గురించి మీరు చింతించక్కర్లేదు. అతనికి మనిషి పక్కన లేకపోతే ఎలా ఉంటుందో అర్థమయ్యే రోజు కచ్చితంగా వస్తుంది. డబ్బుతో ప్రేమను కొనలేమన్న సంగతి ఆయన తప్పకుండా తెలుసుకుంటాడు. మీరు ఓపికగా, ధైర్యంగా ఉండాలి. అతని తల్లిదండ్రులతో కూడా విషయాన్ని చెప్పండి. అతని ప్రవర్తన, తీరు మారకపోతే మీరు తీసుకోవాల్సిన నిర్ణయం ఏమిటో కూడా చెప్పేయండి. వారి మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నించండి. బయట ఉద్యోగ అవకాశాలు వెతుక్కుంటూ ఉండండి. ఇన్నాళ్లు మీరు కెరీర్‌ను పక్కన పెట్టడమే తప్పయింది. మీకంటూ సొంత సంపాదన ఉంటే ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. కాబట్టి ఈరోజు నుంచే ముందుగా ఉద్యోగం పై దృష్టి పెట్టండి. మీకు మీరుగా బతకడం చాలా గొప్పగా ఉంటుంది.
Also read: టీ పొడి మీ ఇంట్లో ఉంటే మీరు కోటీశ్వరులే, దీని ధర ఆ రేంజ్లో ఉంటుంది మరి
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.