Winter Food: చలికాలంలో కచ్చితంగా తినాల్సిన కూరగాయల జాబితా ఇదిగో
Winter Food: చలికాలం వచ్చిందంటే రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది.
Winter Food: శీతాకాలంలో ఆరోగ్యం కాస్త కుంటుపడినట్టు అనిపిస్తుంది. రోగ నిరోధక శక్తి బలహీనంగా ఉంటుంది. అందుకే జలుబు, దగ్గు, జ్వరం వంటివి త్వరగా దాడి చేస్తాయి. కఫం పట్టేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ద్వారా ఈ సమస్యలేవీ రాకుండా చూసుకోవచ్చు. శీతాకాలంలో కచ్చితంగా తినాల్సిన కొన్ని కూరగాయలు ఉన్నాయి. ఇవి ప్రతిరోజూ తింటే మంచిది. చలికాలంలో అనేక రకాల కూరగాయలు దొరుకుతూ ఉంటాయి. కానీ కొంతమంది కొన్ని రకాల కూరలు మాత్రమే తినడానికి ఇష్టపడతారు. ఇలా చేయడం వల్ల రోగనిరోధక శక్తి బలహీనంగా మారిపోతుంది. కాబట్టి చలికాలంలో ఖచ్చితంగా తినాల్సిన ఆకుకూరలు, కూరగాయలు ఏమిటో తెలుసుకుందాం.
మార్కెట్లో పాలకూర నిత్యం లభిస్తుంది. దీనిలో విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ కె, ఐరన్, మెగ్నీషియం, జింక్ వంటివి పుష్కలంగా ఉంటాయి. మన రోగనిరోధక శక్తిని బలంగా మార్చేందుకు ఇవి చాలా అవసరం. ఎముకలు బలంగా మారేందుకు, హిమోగ్లోబిన్ ఉత్పత్తి పెరిగేందుకు, శరీరంలో ఇన్ఫ్లమేషన్ తగ్గించేందుకు పాలకూర ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి రెండు రోజులకు ఒకసారి కచ్చితంగా పాలకూరను ఆహారంలో భాగం చేసుకుంటే మంచిది.
చలికాలంలో క్యారెట్లు అధికంగానే దొరుకుతాయి. దీనిలో బీటా కెరాటిన్ పుష్కలంగా ఉంటుంది. దీన్ని తినడం వల్ల దాదాపు అన్ని రకాల విటమిన్లు లభిస్తాయి. అలాగే మధుమేహం, క్యాన్సర్, గుండె జబ్బులు వంటి వాటితో బాధపడుతున్నవారు క్యారెట్‌ను ప్రతిరోజూ తినడం అవసరం. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అందుకే చలికాలంలో కచ్చితంగా తినాల్సిన ఆహారాలలో క్యారెట్ కూడా ఒకటి. క్యారెట్ తినడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. జుట్టు ఎదుగుదల కూడా బాగుంటుంది.
అన్ని రకాల అన్ని కాలాల్లోనూ దొరికే కూరగాయల్లో బీట్రూట్ ఒకటి. దీని ధర కూడా పెద్ద ఎక్కువ ఏమీ ఉండదు. అందరికీ అందుబాటు ధరలోనే ఉంటుంది. దీనిలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. అలాగే మన శరీరానికి అవసరమైన విటమిన్ ఏ, విటమిన్ b6, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. శీతాకాలంలో కచ్చితంగా తినాల్సిన వాటిలో బీట్రూట్ ఒకటి. ఇది కాలేయాన్ని శుద్ధి చేసి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. డయాబెటిస్ వచ్చే అవకాశాన్ని తగ్గిస్తుంది. ఊబకాయం బారిన పడకుండా కాపాడుతుంది.
ముల్లంగి దుంపను తినే వారి సంఖ్య చాలా తక్కువ. కానీ ముల్లంగిని తినడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీనిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. పొటాషియం, విటమిన్ సి, సోడియం, మెగ్నీషియం అధికంగా ఉంటాయి. దీనిలో నీటి కంటెంట్ ఎక్కువ కాబట్టి శరీరం తేమవంతంగా ఉంటుంది. దీన్ని తినడం వల్ల ఫ్లూ వంటివి శీతాకాలంలో త్వరగా రాకుండా ఉంటాయి. దీన్ని శీతాకాలపు కూరగాయగా చెప్పుకోవచ్చు. సాంబార్లో దీన్ని వేసుకోవచ్చు, లేదా టమాటా వేసి కూరగా వండుకోవచ్.చు ఫ్రై చేసుకున్నా కూడా టేస్టీగా ఉంటుంది.
బ్రకోలి అన్ని సూపర్ మార్కెట్లలో లభిస్తుంది. దీన్ని వండకుండా పచ్చిగా తిన్నా టేస్టీగానే ఉంటుంది. దీనిలో కాల్షియం, ఫోలేట్, జింక్, సెలీనియం, విటమిన్ సి, విటమిన్ కె, విటమిన్ b6, విటమిన్ b2 అధికంగా ఉంటాయి. దీన్ని తినడం వల్ల శరీరంలో ఫైబర్ అధికంగా చేరుతుంది. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. బ్యాక్టీరియా వైరస్‌లతో పోరాడే శక్తిని ఇది అందిస్తుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.