Fertility: మీ సంతానోత్పత్తి సామర్థ్యాన్ని తగ్గించే అయిదు అలవాట్లు ఇవే...
ప్రపంచంలో పిల్లలు పుట్టక ఇబ్బంది పడుతున్న వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది.
భార్యాభర్తల్లో ఎవరిలో కాస్త లోపమున్నా సంతానం కలగదు. కానీ కొందరిలో ఎలాంటి లోపాలు లేకపోయినా గర్భం ధరించడం కష్టతరంగా మారుతుంది. దీనివల్ల టెస్టులు, మందులు వాడడం, డాక్టర్ చెకప్‌ల పేరుతో ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి ఉంటుంది. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంటుంది. సంతానోత్పత్తిపై ప్రభావం చూపించే అలవాట్లు చాలా ఉన్నాయి. ఈ అలవాట్లు మీకున్నా కూడా గర్భధారణ కష్టమవుతుంది. భార్యాభర్తలిద్దరూ తెలుసుకోవాల్సిన అంశాలు ఇవి.
మద్యపానం
ఆల్కహాల్ తాగడం శరీరానికి ఎన్నో విధాల నష్టం. అలాగే సంతానోత్పత్తికి కూడా ఇది అడ్డంకులు కలిగిస్తుంది. పునరుత్పత్తి సామర్ధ్యాన్ని తగ్గిస్తుంది. ఆరోగ్యవంతమైన పిల్లలు పుట్టే అవకాశాన్ని తగ్గిస్తుంది. మద్యపానం పరోక్షంగానూ, ప్రత్యక్షంగానూ కూడా పునరుత్పత్తి వ్యవస్థపై చాలా ప్రభావాన్ని కలిగిస్తుంది.
ధూమపానం
సిగరెట్ తాగడానికి సంతానోత్పత్తికి ఉన్న సంబంధం కంటికి కనిపించదు. కానీ ఆ పొగ చాలా వినాశకరమైన ప్రభావాన్ని చూపిస్తుంది. పురుషుల్లో అంగస్తంభన లోపాన్ని కలిగిస్తుంది. దీని వల్ల వీర్యకణాల సంఖ్య కూడా తగ్గుతుంది. వాటిలో చురుదనం కూడా ఉండదు. మొత్తం ఫలదీకరణ సామర్థ్యం తగ్గిపోతుంది.
అధికబరువు
ఈ సమస్య చిన్నదిగా కనిపించినా కూడా గర్భం ధరించడంపై మాత్రం ఎక్కువ ప్రభావాన్నే చూపిస్తుంది. భార్య భర్తల్లో ఎవరు అధిక బరువు ఉన్నా కూడా గర్భం ధరించడం కష్టమవుతుంది. అధిక బరువు వల్ల హృదయ సంబంధ వ్యాధులు, ఎముకల సమస్యలు కూడా వస్తాయి.
అసాధారణ లైంగిక పద్ధతులు
సురక్షితమైన, ఆహ్లాదకరమైన సెక్స్ వల్లే సంతానోత్పత్తి సక్రమంగా జరుగుతుంది. అసాధారణ, అసురక్షిత లైంగిక పద్ధతుల వల్ల ఇతర వ్యాధులు సోకే ప్రమాదం ఉంది.
తగిన నిద్ర లేకపోయినా
శరీరం సక్రమంగా పనిచేయాలంటే తగినంత విశ్రాంతి అవసరం. రోజూ నిద్రావేళలు పాటించకపోవడం వల్ల హార్మోన్ల అసమతుల్యత, ఒత్తిడి కలుగుతాయి. వీటి వల్ల లైంగిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. స్త్రీలలో నిద్రలేమి పునరుత్పత్తి వ్యవస్థపై ఎక్కువ ప్రభావాన్నే చూపిస్తుంది.
గమనిక:ఈ కథనంలో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా వ్యాయామం లేదా డైట్‌లో మార్పులు చేయాలనుకుంటే తప్పకుండా మీరు వైద్యుడు, డైటీషియన్‌ను సంప్రదించాలి.
Also read: ఈ దోశె మొత్తం తింటే రూ.71,000 క్యాష్ ప్రైజ్... తినడానికి మీరు సిద్ధమేనా?